శివయ్య వేషధారణ రహస్యాలేంటి…
– శంకరుని శరీరంపై పులి చర్మం ఉండేందుకు గల కారణాలు
లహరి, ఫిబ్రవరి 17, ఆధ్యాత్మికం : మహా శివరాత్రి రోజున ఈశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస వ్రతం ఆచరించడం.. జాగరణ చేసిన వారికి శివుని అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. తనపై భక్తితో కేవలం నీరు, బిల్వపత్రాలు, ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తే చాలు తన భక్తుల కోరికలన్నీ తీరుస్తాడని అందరూ విశ్వసిస్తారు. ఇదిలా ఉండగా.. పరమేశ్వరుడి రూపాన్ని పరిశీలిస్తే.. తను చాలా సాధారణంగా ఉంటాడు. శంకరుడు ఎప్పటికీ తన శరీరాన్ని దుస్తులతో నిండుగా కప్పుకోలేదు. తన ఒంటిపై కేవలం పులి చర్మం, మెడలో పాము, ఒక చేతిలో ఢమరుకంతో, మరో చేతిలో త్రిశూలం, తలపై చంద్రుడితో దర్శనమిస్తూ ఉంటాడు. అయితే శివుడి రూపంలో ఒక్కో దాని వెనుక ఒక్కో పరమార్థం ఉంది. శివయ్య ఏం చేసినా అందులో ఏదో ఒక ఆంతర్యం ఉంటుందని పండితులు చెబుతారు. ఈ సందర్భంగా ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
అడవుల్లో దిగంబరుడిగా..
పురాణాల ప్రకారం, పరమేశ్వరుడు సర్వసంగ పరిత్యాగి. శివుడు దిగంబరుడై(బట్టలు లేకుండా నగ్నంగా) అడవులలో, స్మశానాల్లో తిరుగుతూ ఉండేవాడు. అలా సంచరిస్తున్న సమయంలో ఓ రోజు శివయ్యను మునికాంతలు(మహర్షుల సతీమణులు) చూసి.. తమ చూపు తిప్పుకోలేకపోతారు. ఈశ్వరుడి తేజస్సును చూసి ఆకర్షణకు గురవుతారు. దీంతో శివయ్యనే తలచుకుంటూ వారి ఇంటి పనులను కూడా సరిగా చేసేవారు కాదు.
Also Read : ఏడాదికి ఒక్కసారే దర్శనమిచ్చే శివుడు
శివయ్యపై పులిని..
తమ భార్యలలో అకస్మాత్తుగా ఈ మార్పు ఎందుకొచ్చిందని, అందుకు గల కారణాలేంటని మునులు ఆలోచిస్తూ ఉంటారు. అంతలోనే పరమేశ్వరుడు ప్రత్యక్షంగా కనిపించడంతో వారి ప్రశ్నలకు జవాబు దొరికింది. అయితే తను దిగంబర రూపంలో ఉండటంతో తనను వధించాలని పథకం రచిస్తారు. అందులో భాగంగా స్వామి నడిచే దారిలో ఓ గుంతను తవ్వారు. తను అక్కడికి రాగానే ఓ పులిని శివయ్యపై ఉసిగొల్పారు.
పులి చర్మాన్ని తన శరీరంపై..
అయితే ఆ సమయంలో శంకరుడు పులిని అత్యంత సులభంగా సంహరించి.. మునుల పథకం వెనుక ఉన్న వారి ఉద్దేశ్యం ఏంటో తెలుసుకుని ఆ పులి చర్మాన్ని తన శరీరంపై కప్పుకున్నాడు. అది చూసిన మునులు, రోజూ తమ సమీపంలో సంచరిస్తున్నది సాధారణ వ్యక్తి కాదని, అత్యంత శక్తిమంతుడైన శివయ్య అని తెలుసుకుని.. తన కాళ్ల మీద పడి క్షమించని వేడుకున్నాడు. అప్పటినుంచి స్వామి వారు పులి చర్మాన్ని ధరించినట్లు శివ పురాణంలో పేర్కొనబడింది.
Also Read : ఇటువంటివి కలలో కనిపిస్తే.
శివయ్య ఆయుధాలు.. వాటి అర్థాలు..
పరమేశ్వరుని చేతిలో ఉండే త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతీకగా భావిస్తారు. ఇవి భూత, వర్తమానం, భవిష్యత్తు కాలాలను సూచిస్తాయి. ఈ త్రిశూలం సృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారిని సంహరిస్తుంది. మరో చేతిలో ఉండే ఢమరుకం శబ్దం బ్రహ్మ స్వరూపంగా పరిగణిస్తారు. అలాగే శివయ్య తలపై ఉండే చంద్రుడు మనో నిగ్రహానికి, తలలో ఉండే గంగాదేవి శాశ్వతం అనేదానికి ప్రతీకగా పరిగణిస్తారు.