ఆత్మస్థైర్యమే ఆమె బలం

ఆత్మస్థైర్యమే ఆమె బలం

0
TMedia (Telugu News) :

ఆత్మస్థైర్యమే ఆమె బలం

లహరి, ఫిబ్రవరి 13, విజయవాడ కల్చరల్ :భర్త మరణం శ్రీదేవిని ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టేలా చేసింది. సమాజంలో ఒంటరి మహిళ పట్ల వున్న చిన్నచూపు, వేధింపులలూ తనని స్వతంత్రంగా బతకాలి అనే నిర్ణయం తీసుకునేలా చేశాయి. కుటుంబసభ్యులు వద్దని వారించినా, బంధువులు సూటిపోటు మాటలన్నా ఆటో నడపటం నేర్చుకొంది. ఎనిమిదేళ్లుగా ఆటో నడుపుతూ, వచ్చిన ఆదాయంతో పిల్లల్ని పెంచి, పెద్ద చేసింది. ఆటో ప్రయాణంలోనూ ఎన్నో ఆటుపోట్లు చవిచూసింది. రోడ్డు ప్రమాదంలో ప్రాణం మీదకు వచ్చినా ఆటో నడపడం మాత్రం ఆపలేదు. స్వశక్తితో బతకాలన్న ఆమె సంకల్పం ఎందరికో స్ఫూర్తిదాయకం.
విజయవాడ, కృష్ణలంకకు చెందిన రేపాని శ్రీదేవి పేద కుటుంబానికి చెందిన మహిళ. ఈమె చిన్నప్పుడే ఓ ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోయారు. ఓ తమ్ముడు ఉన్నాడు. వీరి పరిస్థితి గమనించి పిన్ని (అమ్మ చెల్లి), బాబాయి చేరదీశారు. తమ ఇద్దరు బిడ్డలతో సమానంగా పెంచారు. శ్రీదేవి పదో తరగతి వరకు చదువుకుంది. పై చదువులు చెప్పించే స్థోమత లేక కృష్ణలంకకు చెందిన శ్రీనివాసరావుకు ఇచ్చి పెళ్లి చేశారు. ఆయన వంట మాస్టారు. కొన్నాళ్లకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు. ప్రతినెలా భర్త తీసుకువచ్చే జీతంతో ఇల్లు గడుపుతూ పిల్లల్ని చూసుకుంటూ శ్రీదేవి ఇంట్లోనే ఉండేది.పదేళ్ల క్రితం శ్రీనివాసరావు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా లివర్లు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఆయన దీర్ఘకాలంగా ఓ హోటల్‌లో కట్టెల పొయ్యి దగ్గర ఉండి వంట చేశాడు. ఆ పొగ పీల్చడం వల్ల జబ్బుపడ్డాడని, పని మానుకోవాలని చెప్పారు. దాంతో శ్రీనివాసరావు తీవ్ర అనారోగ్యంతో ఇంట్లోనే ఉండసాగాడు. అప్పటి వరకూ ఇంట్లో ఉన్న శ్రీదేవి కుటుంబం కోసం ఉపాధి వెతకులాట ప్రారంభించింది. పగలంతా పిల్లల్ని, భర్తను చూసుకుంటూ అనుకూలంగా ఉన్న నైట్‌ సెక్యురిటీ గార్డుగా చేరింది. వచ్చే రూ.6 వేలు సరిపోకపోవడంతో అప్పు చేసి మరీ శ్రీనివాసరావుకు వైద్యం అందించింది. కాని పరిస్థితి విషమించి ఎనిమిదేళ్ల క్రితం భర్త చనిపోయాడు. దాంతో ఆమె కుంగిపోయింది. కొన్ని రోజులు ఇంటి నుంచి బయటకు రాలేకపోయింది.

Also Read : ఆదర్శ విద్యార్థి

అవమానాలైనా …
రెండు నెలల తర్వాత పిల్లల్ని బాగా చూసుకోవాలన్న ఆశతో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఆయాగా చేరింది. ఒంటరి మహిళ అని తెలిసి కొంతమంది చిన్నచూపుగా మాట్లాడం భరించలేకపోయింది. ఆ ఉద్యోగం మానేసింది. స్థానిక ప్రదేశంలో కొంతమంది వృద్ధులకు కేర్‌ టేకర్‌గా చేసింది. అక్కడా సమస్యలు ఎదుర్కొంది. సొంతంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. ఆ సమయంలో ‘ఆసక్తి ఉన్న డ్వాక్రా మహిళలకు ఫ్రీగా ఆటో డ్రైవింగ్‌ శిక్షణ ఇచ్చి, ఆటో ఇప్పిస్తాం’ అన్న అధికారుల ప్రకటన కనిపించింది. శ్రీదేవి, మరి కొంత మహిళలు ‘మేము ఆటో తోలడం నేర్చుకుంటాం’ అని ధైర్యంగా ముందుకు వచ్చారు. నులకపేట సమీపంలో రామ్‌-కార్‌ కంపెనీ సంస్థ ఆధ్వర్యంలో ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. శ్రీదేవి అప్పటికే స్కూటీ నడిపిన అనుభవం ఉండటంతో త్వరగా నేర్చుకోగలిగింది. సిటీలో డిఆర్‌టిఎస్‌ రోడ్డు, కొండపల్లి, ఆగిరిపల్లి…అన్నీ రోడ్లు తిరుగుతూ సుమారు 70 కి.మీ. డ్రైవింగ్‌ చేయగల సామర్థ్యం సంపాదించింది. పిల్లలు, తమ్ముడు, బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆటో నేర్చుకోవడానికి వెళ్లొద్దు.. నడపద్దు అంటూ అడ్డంకి చెప్పారు. ఏ తోడులేని మహిళకు సమాజంలో ఎటువంటి వేధింపులుంటాయో తనకు మాత్రమే తెలుసునని, ఒకరి దగ్గర పనికి వెళ్లనని చెప్పి శ్రీదేవి పట్టుదలగా ఆటో నేర్చుకుంది.

ప్రమాదం జరిగినా..మూడు నెలలు శిక్షణ పూర్తి అయిన తర్వాత ఓ బ్యాంకులో రూ.4.5 లక్షల లోను తీసుకుని ఆటో కొనుగోలు చేసింది. ఉచితంగా సిటీ మొత్తం తిప్పుకునేలా అధికారులు అనుమతి ఇచ్చారు. దాంతో చాలా తక్కువ సమయంలో శ్రీదేవి మంచి ఆటో డ్రైవర్‌గా గుర్తింపు సంపాదించింది. రోజూ స్థానిక ఏరియాలో పిల్లల్ని స్కూలుకు తీసుకెళ్లడం, తీసుకురావడం చేస్తూ ప్రతి నెలా రూ.10 వేలు, ఖాళీ సమయంలో బాడుగకు తిప్పుతూ రూ.500 సంపాదించింది. కొన్నాళ్లకు అప్పు తీర్చింది. పిల్లలను చదివించింది. ఓ రోజు రాత్రి ఆటో నడుపుతూ ఇంటికి వస్తున్న క్రమంలో జోరున వర్షం. రామవరప్పాడు దగ్గర రోడ్డు కోతకు గురై ఆటో పక్కకు ఒరిగి, శ్రీదేవి కింద పడింది. తనపై ఆటో పడి కాలికి గాయం అయ్యింది. దాంతో వర్షం నీళ్లు ఆటోలోకి వచ్చి పూర్తిగా మునిగిపోయింది. ఊపిరాడలేదు. ఆ సమయంలో ఆమె ప్రాణాలు పోయాయినుకుంది. పిల్లలు గుర్తొచ్చి బలమంతా కూడగట్టుకుని ఆటో ఇనుప రాడ్డు సాయంతో లేచింది. ఫోన్‌ నీళ్లల్లో కొట్టుకుపోయింది. అలాగే కాలు ఈడ్చుకుంటూ రోడ్డు మీదకు వచ్చి ఓ వ్యక్తి సాయం కోరింది. ఆయనే శ్రీదేవి పిల్లలకు సమాచారం ఇచ్చాడు. వాళ్లు వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారు. అందరూ ఒక్కసారిగా కోపాన్ని ప్రదర్శించారు. ‘ఆడవాళ్లు ఆటో నడపడం ఏంటి? అసలు ఈ చేతకాని పనులు నీకు ఎందుకు? ఇక నుంచి ఆటో నడపకు’ అంటూ వాదించారు. అయినా శ్రీదేవి ఆగలేదు. చేతిలో విద్య ఉండగా ఒకరి దగ్గర పనిచేయడానికి మనస్కరించలేదు. గాయమయిన నెల రోజులకు ఆటో నడిపింది. పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక పెళ్లిళ్లు చేసింది. తరువాత వారూ తల్లి మనుసు అర్థం చేసుకున్నారు. పెద్దబ్బాయి మెడికల్‌ ఫీల్డ్‌లో స్థిరపడగా, చిన్నబ్బాయి తనతో పాటు ఆటో నడుపుతున్నాడు.

Also Read : లడ్డూలతో హోలీ జరుపుకుంటారట..

వివక్ష ఎదుర్కొంటూ ..
శ్రీదేవి ఆటో నడుపుతున్న క్రమంలో మగ ఆటో డ్రైవర్లు ఆమెను చాలా సందర్భాల్లో బెదిరించడం చేశారు. ‘మీరు ఈ ఏరియాకు ఎందుకు వచ్చారు?, మా ఏరియా ప్రయాణికులను ఎక్కించుకోవొద్దు’ అంటూ మాట్లాడేవారు. అయినా శ్రీదేవి భయపడకుండా ధైర్యంగా సమాధానం చెబుతుంది. ఎప్పుడైనా రాత్రివేళలో ఆటోలో వస్తున్నప్పుడు ఆకతాయిలు భయపెట్టడానికి చూస్తూ ఉంటారు. వారు పారిపోయేలా గంభీరమైన స్వరంతో సమాధానం చెబుతుంది. మహిళా ఆటో డ్రైవర్‌ అయితే సురక్షితం అని భావించిన పిల్లల తల్లిదండ్రులు ఆమెను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. దాంతో శ్రీదేవి కూడా వారికి నమ్మకంగా ఎనిమిదేళ్లగా పిల్లల్ని స్కూలుకు తీసుకెళుతూ తల్లో నాలుకలా కలిసిపోయింది. ‘నా ఆటో ఎక్కి చాలామంది ఆడవాళ్లు..’ఆటోనే నడపాలన్న ఆలోచన ఎందుకు కలిగింది? మీ కుటుంబ పరిస్థితి ఏంటి? మాకు ఆటో నేర్పిస్తారా?’ అంటూ ప్రశ్నిస్తారు. ఒంటరి మహిళగా బతకాలంటే చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలంటే ధైర్యం కావాలి. దాన్ని ఎప్పుడూ కోల్పోను. ఆత్మస్థైర్యమే నా బలం’ అంటోంది శ్రీదేవి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube