సాక్ష్యాల కోసమే నాగరామకృష్ణ వీడియో

సాక్ష్యాల కోసమే నాగరామకృష్ణ వీడియో

0
TMedia (Telugu News) :

 

 

 

ramakrishna house
ramakrishna house
kmm dist jail
kmm dist jail

ఖమ్మం : వనమా రాఘవ వేధింపుల కారణంగానే తన భార్యాపిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సెల్ఫీ వీడియోలో పేర్కొన్న నాగరామకృష్ణ, ఆ వీడియో బయట ప్రపంచానికి తెలిసేలా పగడ్బందీగా వ్యవహరించారు. రాఘవ జైలుకు వెళ్లినా బెయిల్‌ మీద బయటకొచ్చి.. తనకున్న రాజకీయ, ధన బలంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తాడని, సాక్షుల ప్రాణాలకూ ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆయన ఊహించారు. బలవన్మరణానికి ముందే బలమైన సాక్షాయధారాలు ఉండేలా సెల్ఫీవీడియో తీసుకుని ఫోన్‌ను తన కారులోని డ్యాష్‌బోర్డులో భద్రపరిచారు. ఈ విషయాన్ని తన మిత్రుడికి వాయిస్‌ మెసేజ్‌ ద్వారా తెలిపారు. తన అంతిమ సంస్కార కార్యక్రమాలు పూర్తయిన తర్వాత తన కారు డ్యాష్‌ బోర్డులో ఉన్న తన సెల్‌ఫోన్‌ తీసి 7474నంబరుతో అన్‌లాక్‌ చేసి అందులో ఉన్న వీడియోను ప్రజల్లోకి విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు రాఘవ రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు.
బయటకొచ్చిన సెల్ఫీ వీడియో ఆధారంగానే తాము అనేక ఆధారాలు సేకరించామని ఏడు పేజీల రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. దీంతో పాటు గతంలో రాఘవపై ఉన్న 12 కేసుల వివరాలను కూడా న్యాయస్థానానికి అందించారు. నాగరామకృష్ణ కుటుంబం ఆత్మాహుతి కేసులో దర్యాప్తు జరిగిన తీరును న్యాయస్థానానికి వివరించారు. కాగా ఈ వీడియో చూసే సమయానికి తాను బతికి ఉండనని, కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటున్నామని సెల్ఫీవీడియోలో నాగరామకృష్ణ తెలిపిన విషయం తెలిసిందే. తమ మృతికి ప్రధాన సూత్రధారి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్రరావు (రాఘవ)అని, ఆయనతో పాటు తన తల్లి మండిగ సూర్యవతి, సోదరి మాధవి కారణమని, వారికి ఏ శిక్ష విధించాలో సమాజానికే వదిలేస్తున్నానని సెల్ఫీ వీడియోలో రామకృష్ణ పేర్కొనారు. కాగా కేసులో 14 రోజుల రిమాండ్‌ ఖైదీగా భద్రాచలం సబ్‌ జైల్లో ఉన్న రాఘవను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు. కొవిడ్‌ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ఐసొలేషన్‌ బ్యారక్‌లో ఉంచారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube