శివుడికి కాశీ అంటేనే ఎందుకంత ఇష్టం?
లహరి, ఫిబ్రవరి 18, వారణాసి : భగవంతుడు విశ్వవ్యాప్తంగా ఉంటాడు. కానీ, అంతటా నిండి ఉన్న దేవుడి తత్తాన్ని తెలియజేసే పుణ్యక్షేత్రాలు మాత్రం కొన్నే. అందులో ప్రముఖమైనది వారణాసి. కైలాస సదనంలో కులాసాగా ఉంటున్న శంకరుడికి.. ఒకసారి హిమగిరులు దాటి ఆవల ఉండాలని మనసు పుట్టింది. పార్వతితో కలిసి ఏదైనా సిద్ధక్షేత్రంలో నివసించాలని కోరుకున్నాడు. చివరికి కాశీ ని ఎంచుకున్నాడు శివుడు. అప్పటికే కాశీని రాజధానిగా చేసుకొని ఆ ప్రాంతాన్ని దివోదాసు అనే రాజు పరిపాలిస్తున్నాడు. పరమేశ్వరుడి ఆనతితో నికుంభుడనే రాక్షసుడు వారణాసికి వెళ్లి అక్కడి ప్రజలను, రాజును తరలించి, శివుడు నివసించడానికి అనువైన ఏర్పాట్లు చేస్తాడు. తన రాజ్యం పోయిందన్న బాధతో దివోదాసు బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. అప్పుడు కాశీరాజు ‘దేవతలు దేవలోకంలో, నాగులు పాతాళంలో, భూలోకంలో మనుషులు మాత్రమే ఉండే విధంగా వరం ఇవ్వమ’ని కోరుతాడు. ‘తథాస్తు’ అంటాడు బ్రహ్మ. దీంతో కాశీనాథుడు మళ్లీ కైలాసానికి వెళ్లాల్సి వస్తుంది.
Also Read : అలంపూర్ బాలబ్రహ్మేశ్వరునికి ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
అక్కడికి వెళ్లినా శివుడి మనసు మనసులో ఉండదు. కాశీలో ఉండటానికి మార్గం సుగమం చేయమంటూ 64 మంది యోగినులను పంపిస్తాడు. ఆ వచ్చిన దేవతలను గంగాతీరంలో ప్రతిష్ఠిస్తాడు దివోదాసు. శివాజ్ఞ మేరకు సూర్యుడు రాగా, ద్వాదశాదిత్య రూపాలుగా గంగ ఒడ్డున ప్రతిష్ఠిస్తాడు. దివోదాసును ఒప్పించడానికి స్వయంగా బ్రహ్మదేవుడే వారణాసికి వెళ్తాడు. ఆయననూ మచ్చిక చేసుకున్న రాజు.. బ్రహ్మతో గంగాతీరంలో దశాశ్వమేథ హోమం చేయిస్తాడు. చివరికి విష్ణుమూర్తి కాశీకి వెళ్లి, దివోదాసుకు జ్ఞానోపదేశం చేస్తాడు. అలా శివుడు మళ్లీ కాశీ విశ్వనాథుడు అయ్యాడని స్థలపురాణం.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube