* 6,000 ఏళ్ళతెలుగు ప్రజల సంప్రదాయం… సంక్రాంతి కోడి పందాలు

0
TMedia (Telugu News) :

 

Betting on Cock-fighting in AP Touches New Heights

* 6,000 ఏళ్ళ పూర్వం నుంచే కోడి పందాలు
* ఏటేటా వన్నె తగ్గని సంప్రదాయం
* సంక్రాంతి సంబరాల్లో పందాలదే పైచేయి
* ప్రభుత్వ నియంత్రణ అంతంత మాత్రమే
* తగ్గేదే లే అంటున్న సంప్రదాయ ప్రియులు

శంఖవరం, జనవరి 14, (విశ్వం వాయిస్ న్యూస్) ;

ఢీ అంటే ఢీ… అంటూ 6 నుంచి 8 నిమిషాలపాటు బరిలో పోరు.. అందుకు తగ్గేదే లే… అంటూ ప్రత్యర్థి కోడి పుంజుపై పోటీ కోడి పుంజు కాలు దువ్వే తీరు … ఆపై విరుచుకుపడే పనితీరు… విజయం ఎవరో ఒకరికి కైవసం అయ్యే కోడి పందాల ఆ యుద్ధ విన్యాస ఘట్టాలను సంక్రాంతి సంబురాల్లో మాత్రమే ప్రత్యకంగా ప్రత్యక్షంగా తనివితీరా చూసి తీరాల్సిందే. గ్రామీణులకు సంప్రదాయం.. పందెం రాయుళ్లకు ఉత్కంఠ భరిత జూదం… చూసేవాళ్లకు సరదాల సంబరమైన పందాలకు కోళ్లను ఎలా సిద్ధం చేస్తారనేదీ ఆసక్తికరం.
కోడి పందెం అనేది రెండు పందెం కోళ్ళ మధ్య తెలుగు ప్రజలు నిర్వహించే క్రీడ. ఈ పందాల ప్రియులు ప్రతీ యేటా సంక్రాంతి పండుగ నాలుగు రోజుల్లోనూ ఈ పందాలను నిర్వహిస్తూ ఉంటారు. భారత దేశంలో కోడిపందాలు ప్రధానంగా జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ, తమిళనాడు, కేరళ రాష్ట్రంలోనూ భారీ ఏర్పాట్లతో పెద్ద ఎత్తున ఈ కోడి పందాలను ప్రతీ ఏటా క్రమం తప్పకుండా ఓ సంప్రదాయంగా నిర్వహిస్తూ వస్తున్నారు. తమిళనాడులో జరిగే జల్లికట్టు అక్కడ ఎంత ప్రాచుర్యమో అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ నిర్వహించే ఈ కోడి పందాలకు కూడా చాలా ఖ్యాతి ఉంది. అయితే రాను రాను అది మరింత పెరుగు తున్నట్లు కనిపిస్తోంది. ఈ పందెం కోసం ప్రత్యేకంగా పెంచే కోడి పుంజులను మాత్రమే పందెం కోళ్ళు అంటారు. కొన్నేళ్ల క్రితం వరకూ ఉభయగోదావరి జిల్లాల పరిధిలో మాత్రమే కోడి పందేల సందడి కనిపించేది. కానీ ఇప్పుడు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈ పందాలు సంప్రదాయంగా కొనసాగు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నరసాపురం, గణపవరం, వీరవాసరం, ఐ.భీమవరం, ద్వారకాతిరుమల, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, ఉంగుటూరు, భీమడోలు తదితర ప్రాంతాల్లోని కోడి పందాలు ప్రసిద్ధి.
కోడి పందాలు జూద క్రీడగా మారుతూ వస్తున్నందున జంతు, వన్య ప్రాణి సంరక్షణ చట్టం మేరకు కోడి పందాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదు.

చరిత్రలో కోడి పందాలు….
_______

ఈ కోడి పందాల సంస్కృతి పురాతన కాలం నాటిదని ప్రపంచ చరిత్ర చెపుతోంది. 6,000 సంవత్సరాలకు పూర్వమే పర్షియా దేశంలో కోడి పందాలు జరిగాయి.
పల్నాడు, బొబ్బిలి యుద్ధాల్లో కోడి పందాలను ఆడినట్టు మన భారతదేశ చరిత్ర చెపుతోంది. ప్రాచీన భారత దేశంలో అడవి కోళ్లు, ఇంటి కోళ్లు వంటి పక్షుల మధ్య జరిగే పోరాటాలే నాటి ప్రజలకు ప్రధాన
వినోద విధానంగా ఉండేది. 1178–1182 మధ్య కాలపు పలనాడు చరిత్రలో నాయకురాలు నాగమ్మ, బ్రహ్మదేవుడు వంటి వారి కాలం నుంచి సంప్రదాయంగా కోడి పందాలు సాగుతున్నాయి. కోడి పందాల పోరాటం ఆధారంగానే పల్నాడు యుద్ధం ఫలితాన్ని నిర్ణయించారని, బొబ్బిలి యుద్ధంలో కూడా కోడి పందాలు జరిగాయని మన చరిత్ర చెపుతోంది. ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆ త‌ర్వాత గ‌త మూడు ద‌శాబ్దాలుగా గోదావ‌రి జిల్లాల్లో ఈ పందేల తీవ్ర‌త పెరుగుతోంది.

కుక్కుట శాస్త్రం ఆధారంగానే…
________

పౌరుషానికి ప్రతిరూపాలు పందెంకోళ్లు.. కత్తి కట్టి బరిలోకి దించితే.. యజమాని పరువు కోసం.. ప్రాణాలు పణంగా పెట్టి.. కొట్లాడుతుంది. ఇక సంక్రాంతి వచ్చిందంటే చాలు.. తగ్గేదే లే.. అంటూ ప్రత్యర్థిపై విరుచుకుపడేందుకు కోళ్లు రెఢీ అవుతాయి. పండుగ సమయంలో ఢీ అంటే ఢీ అనే కోడి పుంజులకు గిరాకీ ఎక్కువ. అందులోనూ చాలా రకాలుంటాయి. మరి వాటిని ఎలా గుర్తించాలి.? ఎలా పెంచాలి? ఏం తినిపించాలి.? కోడిని ఏ దిక్కు నుంచి బరిలోకి దించితే విజయం సాధిస్తుంది, ఏ ముహూర్తాన ఏ కోడి గెలుస్తుంది? అనే అంశాలను పందెం రాయుళ్లు విశ్వసించే కోడి శాస్త్రం ఏం చెప్తోంది. అంటే శాస్త్రాలు మనుషులకే కాదు కోళ్లకూ ఉన్నాయి !. పందెం కోడి పుంజుల గురించి రాసిన పంచాంగమే కుక్కుటశాస్త్రం. సంస్కృత భాషలో కుక్కుటం అంటే కోడిపుంజు. ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు ప్రారంభించే టప్పుడు ఈ కుక్కుట శాస్త్రాన్ని చదువుతుంటారు. కోళ్ల పుట్టుక, పందెం కోళ్ల ఎంపిక తదాదిగా వాటికి ఆహారం, వైద్యం, శిక్షణ వంటి పలు అంశాలను తేట తెల్లం చేసేదే ఈ కుక్కుట శాస్త్రం. ఈ శాస్త్రంను పురాతన కాలంలోని తాత ముత్తాతల నుండి నేటి కంప్యూటర్ ఆధునిక కాలం వరకూ ఆచరిస్తూనే వస్తున్నారు. తమ తాతల కాలం నుంచి కూడా ఉందని ఆత్రేయపురం మండలానికి చెందిన రాజు వివరించారు. కుక్కుట శాస్త్రం చెప్పినట్టు నక్షత్రాల ఆధారంగా పందెం కోళ్లను పోటికి ఎంపిక చేస్తామంటున్నారు. వారాలు, పక్షాలను అనుసరించి కొన్ని జాతుల కోడి పుంజుల జీర్ణ శక్తి మందగిస్తుందని అంచనా. ఆ సమయంలో పందేనికి దింపితే కోడి అపజయం పాలవుతుందంటారు. శతాబ్దాల కాలం నుండి ఆంధ్ర క్షత్రియులు తమ పౌరుషానికి ప్రతీకగా కుక్కుట (కోడి పంజు) శాస్తాన్ని ఆచరిస్తూ కోడి పందాలను నిర్వహించేవారు. కోడి కొక్కొరొకో అనగానే నిద్ర లేచేవారు కొందరు. మరి కొందరేమో.. కోడి పుంజులను పెంచడానికే నిద్ర లేస్తుంటారు. కోస్తా జిల్లాల్లోని చాలా గ్రామాల్లో ఇప్పుడు జరుగుతోంది ఇదే.

జాతి రకాలు ఇవీ …
_____

కోడిపుంజుల్లో కూడా పలు రకాలున్నాయి. కనీసంగా 25 రకాల కోడి పుంజులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో సాగే పందేల్లో పాల్గొంటున్నాయి. వాటి ఈకల రంగును బట్టి కోళ్ల రకాలను నిర్ణయిస్తారు. నల్లని ఈకలు ఉండే పుంజును కాకి, మెడపై నల్లని ఈకలుంటే సవల అని, ఎర్రటి ఈకలు ఉంటే డేగ అని పసుపు రంగు ఈకలు ఉంటే నెమలి అని, నలుపు, ఎరుపు, పసుపు ఈకలు ఉంటే కౌజు అని, తెలుపు రెక్కలపై అక్కడక్కడా నలుపు రంగు, లేత గోధుమ వర్ణం ఈకలు ఉంటే పింగళి అని, ముంగిస జూలు రంగులో ఉండే పుంజును ముంగిస అని, నల్లటి శరీరం, రెండు మూడు రంగుల ఈకలు ఉంటే కొక్కిరాయి అని, ఇవే కాకుండా కోడి కాకి, కోడి డేగ, శేహువ, కోడి నెమలి, పచ్చకాకి, చవల, సేతువ, పచ్చకాకి, రసంగి, కౌజు, మైల, ఎరుపుగౌడు, తెలుపుగౌడు వంటి 25 రకాల కోడి పుంజులూ ఉన్నాయి.

ఆహారమిలా…
____

పందెం కోళ్లకు ప్రత్యేకమైన, నాణ్యమైన, బలవర్ధకమైన ఆహారం అందిస్తారు. 40 రోజుల పాటు కోడి గుడ్డు (పచ్చసొన లేకుండా) పెడతారు. 60 రోజుల పాటు బాదం పప్పు (6 నుంచి 10), ఖీమా (30 గ్రాముల వరకు), బీకాంప్లెక్స్‌ ట్యాబ్లెట్లు ఇస్తారు. రెండు రోజుల కోసారి కిస్‌మిస్‌లు, దానిమ్మ గింజలు, ఖర్జూరం పెడతారు. క్యారెట్‌, తోటకూర, కొత్తిమీరను ఉడకబెట్టి తినిపిస్తారు. అలాగే ఉల్లిని తినిపిస్తారు. జీడిపప్పు, బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. రోజూ కోడిగుడ్డు కూడా ఇస్తారు. కొన్నిటికి బోన్‌లెస్ చికెన్ కూడా ఆహారంగా ఇస్తారు. పౌష్టిక ఆహారంతో పాటుగా రోజూ ఎక్సర్‌సైజులు చేయిస్తారు. కోడి రంగు, సూర్యుని వెలుగుని బట్టి పందెం రాయుళ్లు రంగంలోకి దిగుతారు. ఈ జిల్లాలో ప్రతి ఏటా కోడి పందేలను నాలుగు రకాలుగా నిర్వహిస్తారు. ఎత్తుడు దించుడు పందెం, చూపుడు పందెం, ముసుగు పందెం, డింకీ పందెం. వీటిల్లో ఎత్తుడు దింపుడు పందేలకు ఎక్కువ గిరాకీ ఉంటోంది. కోళ్లను తీసుకొచ్చిన వారు కాసే పందేల కంటే వాటిని చూడడానికి వచ్చేవారు కాసే పందేలే వందరెట్లు ఎక్కువగా జరుగుతాయి.

బెట్టింగ్ హబ్’….
_____

సంక్రాంతి సందర్భంగా ఈ పందాలు పెద్ద ఎత్తున జరుగు తున్నప్పటికీ, ఏడాది పొడవునా కోడి పందాలు ఆడే వారికి కొదవ ఉండడం లేదు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతాన్ని కోడి పందాల బెట్టింగ్ హబ్‌గా అభివర్ణిస్తుంటారు. ఈ కోడి పందాల నిర్వహణలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. పందేలు నిర్వహించే ప్రాంతాన్ని బరి అంటారు. ఈ బరులు గోదావరి జిల్లాల్లోనే సుమారుగా 400 వరకూ ఏర్పాటవుతాయి. భీమవరం చుట్టు, అలాగే ఉభయ గోదావరి జిల్లాలు చుట్టు పక్కల ప్రాంతాల్లో సాగే కోడి పందాలు వందల కోట్ల రూపాయల్లో జరుగుతాయి. ఏటా సంక్రాంతి సమయంలో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే కోడి పందాల్లో చేతులు మారే సొమ్ము 150 కోట్లు దాటుతుందని ఓ అంచనా. ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపి సుమారు 250 కోట్ల రూపాయల మేరకు ఈ పందేలు సాగుతాయన్నది ఓ అంచనా.

 

 

 

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube