టీ మీడియా, డిసెంబర్ 4, కర్నూలు జిల్లా
ఈ మధ్య కాలంలో ఎటిఎం కేంద్రాలలో ఎటిఎం కార్డులు మార్చే మోసాలు ఎక్కువగా అవుతున్నాయని అమాయక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్ .సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ విషయాన్ని ఎన్ని సార్లు తెలిపినా మోసాలకు గురవుతూనే ఉన్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు.
ఎటిఎం సెంటర్ల వద్ద అపరిచిత వ్యక్తులు అమాయకులకు డబ్బులు డ్రా చేసి ఇస్తామని చెప్పి ఎటిఎం కార్డులు తీసుకొని , పిన్ నెంబర్ తెలుసుకుని ఒరిజినల్ ఎటిఎం కార్డులు తిరిగి ఇవ్వకుండా నకిలి ఎటిఎం కార్డులు ఇచ్చి మోసాలు చేస్తున్నారు. కొందరు ఎటిఎం కార్డుల వెనుక వైపు ఎటిఎం పిన్ నెంబర్లు రాసుకొని ఉండడంతో ఆ ఎటిఎం మరియు పిన్ నెంబర్లను తెలుసుకుని వాటిని పోలిన విధంగా నకిలి ఎటిఎం కార్డులు తయారు చేసి మోసాలు చేస్తున్నారు.
డబ్బుల(నగదు) కొరకు ఎటిఎం కేంద్రాలకు వెళ్ళే వృద్దులు, చదువురాని వారు డబ్బులు డ్రా చేయడం తెలియనప్పుడు అపరిచిత వ్యక్తులను నమ్మి వారిని ఎటిఎం కార్డుల నుండి డబ్బులు డ్రా చేసి ఇమ్మని అడిగిన సంధర్బాలలో వారు ఒరిజినల్ కార్డులు తిరిగి ఇవ్వకుండా నకిలి కార్డులు ఇచ్చి ఒరిజినల్ ఎటిఎం కార్డుని తీసుకొని దాని ద్వారా ఖాతా లోని మొత్తం డబ్బును డ్రా చేసుకుంటున్నారు.
అపరిచిత వ్యక్తులకు మీ ఎటిఎం కార్డు గాని, ఎటిఎం పిన్ నెంబర్ గాని ఇచ్చి డబ్బులు డ్రా చేయమని అడగవద్దని ఏదైనా అవసరమైన పరిస్ధితులలో ఎటిఎం కేంద్రాలలో డబ్బులు డ్రా చేసుకోవడం తెలియక పోతే అక్కడ ఉన్న ఎటిఎం సెక్యూరిటి గార్డులు లేదా తెలిసిన వ్యక్తుల సహాయం తీసుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు.