మకర వాహనంపై కపిలతీర్థ విభుడు
లహరి, ఫిబ్రవరి 14, తిరుమల : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామి సోమ స్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ దేవేంద్ర బాబు, ఏఈఓ పార్థ సారధి, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్‌పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణతోపాటు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.