శ్రీశైలం డ్యాం లో 9 మంది ఏమయ్యారు

లోపల చిక్కుకున్న 9 మంది ఏమయ్యారు


శ్రీశైలం డ్యామ్ కు వరద నీరు భారీగా చేరుకోవడంతో గేట్లు ఎత్తి నీటికి కిందకు వదులుతున్న సంగతి తెలిసిందే. డ్యామ్ లో నీరు పుష్కలంగా ఉండటంతో జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అయితే, గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత సడెన్ గా శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం నాలుగో యూనిట్ లో మంటలు చెలరేగాయి. నాలుగో యూనిట్ నుంచి మొత్తం ఆరు యూనిట్లు పొగలు కమ్మేశాయి. దీంతో ప్రాజెక్టులో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయడంతో ప్రాజెక్ట్ మొత్తం అంధకారంగా మారిపోయింది. పొగలు మంటలు కమ్ముకోవడంతో కొంతమంది బయటకు ఇంకా తొమ్మిది సిబ్బంది లోపలే ఉన్నట్టు సమాచారం. పోలీసులు, రక్షణ సిబ్బంది జలవిద్యుత్ కేంద్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. అయితే లోపలికి వెళ్లివచ్చిన ఫైర్ సిబ్బంది మాటలని బట్టి లోపల చిక్కుకున్న వారు కనపడడం లేదని తెలుస్తోంది. మంటలు, పొగలు అదుపులోకి వచ్చాయని, ప్రమాదం జరిగిన స్పాట్ వరకు ఈజీగా వెళ్లగలుగుతున్నామని వారు చెబుతున్నారు. నిన్న రాత్రి నుంచి దట్టమైన పొగల కారణంగా లోపలికి వెళ్లలేకపోయామని, అయితే ఇప్పుడు లోపలోకి వెళ్ళినా ఆ తొమ్మిది మంది క్షేమంగా ఉన్నారా లేదా ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు. స్పాట్ నుంచి చాలా దూరం వరకు వెళ్లి వెతికినా ఎవరూ కనపడలేదని చెబుతున్నారు. శబ్దాలు కూడా వినపడలేదని, ప్రయత్నం చేస్తున్నామని వారు చెబుతున్నారు.