4 ఏళ్ల కొడుకును చంపిన స్టార్ట‌ప్ సీఈవో

4 ఏళ్ల కొడుకును చంపిన స్టార్ట‌ప్ సీఈవో

0
TMedia (Telugu News) :

4 ఏళ్ల కొడుకును చంపిన స్టార్ట‌ప్ సీఈవో

టీ మీడియా, జనవరి 9, ప‌నాజీ: ఓ మహిళా వ్యాపారవేత్త తన నాలుగేళ్ల కుమారుడిని అతి దారుణంగా హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఆ చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో దాచిపెట్టి.. గోవా నుంచి కర్ణాటక వరకు ట్యాక్సీలో ప్రయాణించింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆమెను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన సుచనా సేత్‌ ఓ స్టార్టప్‌ని స్థాపించి, సీఈవో గా వ్యవహరిస్తోంది. గత శనివారం ఆమె తన నాలుగేళ్ల కుమారుడిని తీసుకుని ఉత్తర గోవాలోని ఒక హోటల్‌కు వెళ్లింది. సోమవారం ఉదయం అక్కడ గదిని ఖాళీ చేసి ట్యాక్సీలో కర్ణాటకకు బయల్దేరింది. ఆ గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది.. అక్కడ రక్తపు మరకలను గుర్తించారు. హోటల్‌ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. హోటల్‌లో దిగినప్పుడు కుమారుడితో కలిసి కన్పించిన సుచనా.. వెళ్లేటప్పుడు మాత్రం ఒంటరిగా కన్పించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమె వెళ్లిన ట్యాక్సీ డ్రైవర్‌కు పోలీసులు ఫోన్‌ చేసి సుచనాతో మాట్లాడారు. అయితే, తన కుమారుడిని ఫ్రెండ్‌ ఇంటి వద్ద వదిలేసినట్లు ఆమె చెప్పింది.

Also Read : ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశాం

సుచనా ఇచ్చిన ఫ్రెండ్‌ అడ్రస్‌ నకిలీదని తేలడంతో పోలీసుల అనుమానం బలపడింది. వెంటనే కర్ణాటక పోలీసులకు సమాచారమిచ్చారు. అదే సమయంలో, ట్యాక్సీ డ్రైవర్‌ను సంప్రదించి అనుమానం రాకుండా ఆమెను సమీపంలోని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లాలని సూచించారు. చివరకు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. సుచనాను అరెస్టు చేశారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube