స్కూలులోనే ఉంటూ .. విద్యాబోధన

స్కూలులోనే ఉంటూ .. విద్యాబోధన

0
TMedia (Telugu News) :

స్కూలులోనే ఉంటూ .. విద్యాబోధన

లహరి, ఫిబ్రవరి 21,తమిళనాడు : పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో టీచర్‌ జాన్సన్‌కి బాగా తెలుసు. అందుకే కొండల్లో, సుదూర ప్రాంతంలో నివసించే పేద పిల్లలకు చదువు దూరం కాకూడదనుకున్నాడు. ఆ స్కూలుకు వచ్చిన ప్రతి టీచరూ బదిలీ చేయించుకుని వెళుతుంటే.. తాను మాత్రం ఆ పాఠశాలోనే ఉంటూ పిల్లలకు చదువు చెబుతున్నారు. చదువు ప్రాధాన్యత గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ … విద్యార్థుల సంఖ్య పెంపునకు కృషి చేస్తున్నారు.

తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన జాన్సన్‌ 14 ఏళ్ల నుంచి ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నాడు. గత ఏడాది మార్చిలో ఆయనకు కదంబకుట్టై గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయింది. అది కొండల్లో ఉన్న చిన్న పల్లెటూరు. ఎలాంటి సదుపాయాలూ ఆ్కడ లేవు. ఆ ఊరికి చేరుకోవాలంటే ఎటువంటి వాహన సౌకర్యం ఉండదు. మెయిన్‌ రోడ్డు నుంచి కొండల మధ్యగా 2.5 కి.మీ. నడవాలి. కావాల్సిన సరుకులు దొరకవు. జాన్సన్‌ నివాసం ఉంటున్న ఊరి నుంచి 60 కి.మీ. ప్రయాణించాలి. తను అంత శ్రమించి ఆ ఊరికి చేరితే… స్కూల్లో ఉంది 9 మంది విద్యార్థులు. ఇన్ని ఇబ్బందులు ఉన్న ఈ ఊరికి ఏ టీచర్‌ వచ్చినా వెంటనే బదిలీ చేయించుకుని వెళ్లిపోతున్నారు. లేదా లాంగ్‌ లీవ్‌ తీసుకుని, రెండు నెలలకో, మూడు నెలలకో వచ్చిపోతుంటారు. దాంతో ఆ పాఠశాలకు వచ్చిన పిల్లల హాజరు శాతం క్రమంగా తగ్గిపోతుంది. ఉన్న పిల్లలకు చదువు పెద్దగా అబ్బలేదు.

Also Read : శ్రీముఖ లింగేశ్వరుడి చక్రస్నానం..

ఆ ఊరిలో గిరిజన కుటుంబాలే ఎక్కువ. పిల్లల్ని ఖాళీగా ఇంటి దగ్గర ఉంచడం దండగ అని తల్లిదండ్రులు తమతో పాటు పనికి తీసుకెళుతున్నారు. చాలామంది ఆడపిల్లలకు బాల్యవివాహాలు చేశారు. తమ పిల్లలకు చదువు చెప్పే టీచర్లు ఎవరూ రావడం లేదని, వచ్చినా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతున్నారని ఊరి పెద్దలకు, తల్లిదండ్రులకు గట్టి అభిప్రాయం ఏర్పడింది. ఇదంతా జాన్సన్‌కు ఆ పాఠశాలకు వచ్చిన మొదటి రోజే అర్థమైంది. తానూ కొన్ని నెలలు ఉండి బదిలీ చేయించుకుని వెళ్లాలనుకున్నాడు. కాని స్కూలుకు వచ్చిన తొమ్మిది మంది విద్యార్థులతో మాట్లాడిన తరువాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఏ టీచర్‌ వచ్చినా కొద్ది రోజులు కనిపించి, వెళ్లిపోవడంతో చదువుకోవాలన్న ఆసక్తి చాలామంది పిల్లల్లో క్రమంగా తగ్గిపోతోంది. ‘మాకు చదువు చెప్పండి. మేము బాగా చదువుకుని.. పెద్ద ఉద్యోగాలు చేయాలనుకుంటున్నాం. మా ఊరిని మేము బాగుచేసుకోవాలి. ఊరికి అన్ని సదుపాయాలూ కల్పించాలి. అదే మా లక్ష్యం.’ అక్కడి పిల్లలు మాస్టారిని అభ్యర్థించారు. దాంతో ఆయన మనసు కరిగిపోయింది. పిల్లల ఆవేదన, ఆకాంక్ష తన ఆలోచనని మార్చివేశాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ పిల్లల చదువు ఆగకూడదనున్నాడు. ఇప్పుడు ఆ స్కూల్లోనే నివాసం ఉంటున్నాడు. తన కుటుంబం ఉన్న హుసూర్‌కు వారంలో ఒక రోజు వెళ్లి వస్తున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు రెండు రోజులకు సరిపడా ఆహారం, మిగిలిన మూడు రోజులకు సరిపడా సరుకులు తెచ్చుకుని, వండుకుంటున్నాడు. రాత్రి వేళల్లో ఏనుగులు, పాములు ఆ స్కూలు పరిసరాల్లో సంచరిస్తూ ఉంటాయి. అయినా ఆయన స్కూలు వదిలి వెళ్లకుండా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు.

Also Read : మూడోసారి కేసీఆర్ నే సీఎం

స్కూలు వదిలిన తరువాత కూడా పిల్లలకు దగ్గరుండి చదివిస్తున్నాడు. డ్రాపౌట్స్‌ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి, పిల్లల్ని స్కూలుకు తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. బాల్య వివాహాలు మంచివి కాదని వివరిస్తున్నాడు. ఆ గ్రామానికి అరకిలో మీటరు దూరంలో వీరబద్రన్‌ కొట్టారు తండా ఉంది. జాన్సన్‌ అక్కడికి వెళ్లి పిల్లల్ని స్కూలుకు పంపిచమని కోరి, వారు వచ్చేలా చేస్తున్నాడు. స్కూలుకు రాని పిల్లలకు సాయంత్రం ఇళ్ల దగ్గరకు వెళ్లి పాఠాలు చెబుతున్నాడు. దాంతో అక్కడ పిల్లల చదువులో మార్పు వచ్చింది. కొద్ది నెలల్లోనే అక్షరాలు నుంచి వాక్యాలు చదివే స్థాయికి తమ పిల్లలు రావడం తల్లిదండ్రులు గమనించారు.పాఠశాల్లో ఉన్న సమస్యలను అధికారులకు వివరించి, బోధనా సామగ్రిని పంపించమని కోరాడు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్‌, ఇతర సౌకర్యాలు కల్పించమని అభ్యర్థిస్తున్నాడు. తమ ఊరిలో ఓ ఉపాధ్యాయుడు స్థిరంగా ఉండటం చూసి తల్లిదండ్రులు హర్షిస్తున్నారు. పిల్లలకు చదువు చెప్పాలన్న జాన్సన్‌ పట్టుదల చూసి అధికారులు, ఊరి ప్రజలు తగిన సహకారం అందిస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube