కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై రాళ్ల దాడి..
టీ మీడియా, ఫిబ్రవరి 25, కోల్‌కతా : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. దీంతో ఆయన ప్రయాణించిన కారు ముందున్న అద్దం ధ్వంసమైంది. స్పందించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో ఈ సంఘటన జరిగింది. ఇటీవల బీఎస్‌ఎఫ్ సిబ్బంది కాల్పుల్లో స్థానిక గిరిజనుడు చనిపోయాడు. కూచ్‌బెహార్ ఎంపీ అయిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్ దీనికి కారణమని స్థానికులు ఆరోపించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ ఇటీవల ఇక్కడ ర్యాలీ నిర్వహించారు. గిరిజనుడి హత్యపై కేంద్ర మంత్రి నిసిత్ ఏమీ చేయడం లేదని మండిపడ్డారు. ఆయనకు వ్యతికేకంగా నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. కాగా, కేంద్ర మంత్రి నిసిత్ ప్రమాణిక్ శనివారం స్థానిక బీజేపీ కార్యాలయానికి వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌పై దాడి జరిగింది. స్థానికులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. కేంద్ర మంత్రి నిసిత్ కాన్వాయ్‌పైకి కొందరు రాళ్లు విసిరారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రయాణించిన కారు ముందు అద్దం ధ్వంసమైంది. దీంతో పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.
Also Read : ఏసీబీ తనిఖీలలో పట్టుబడిన గర్ల్స్ హైస్కూల్ హెచ్ఎం
మరోవైపు బెంగాల్‌లో అధికారంలో ఉన్న సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి నిసిత్ ప్రమాణిక్ మండిపడ్డారు. మంత్రికే రక్షణ లేకపోతే సాధారణ ప్రజల భద్రత గురించి ఊహించుకోవచ్చని విమర్శించారు. తన కాన్వాయ్‌పై జరిగిన దాడి సంఘటన బెంగాల్‌లో ప్రజాస్వామ్య పరిస్థితికి నిదర్శనమని ఆరోపించారు. కాగా, కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై రాళ్ల దాడికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube