గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీం విచారణ వాయిదా
టీ మీడియా, అక్టోబర్ 13, న్యూఢిల్లీ : గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు మళ్లీ సోమవారం విచారణ చేపట్టనున్నది. 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఓ మహిళ సుప్రీంలో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. ఆ మహిళకు చెందిన అన్ని రిపోర్టులు ఇవ్వాలని ఎయిమ్స్ వైద్యులను సుప్రీం ఇవాళ ఆదేశించింది. ఆ మహిళ పిండానికి ఎటువంటి సమస్యలు ఉన్నాయో గుర్తించాలని ఎయిమ్స్‌ను సుప్రీం కోరింది. మానసిక చికిత్స కోసం తీసుకుంటున్న డ్రగ్స్ వల్ల గర్భంలో ఉన్న పిండానికి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయో స్టడీ చేయాలని ఎయిమ్స్‌ను సుప్రీం కోరింది. ఆ మహిళ మానసిక, శారీరక రుగ్మతల గురించి విశ్లేషణ చేపట్టాలని ఎయిమ్స్ వైద్యుల్ని సుప్రీం కోరింది. పిండాన్ని రక్షించుకునేందుకు ఏదైనా ప్రత్యామ్నాయ వైద్యం ఉందో లేదో తెలుసుకోవాలని ఎయిమ్స్‌ను సుప్రీం అడిగింది. 26 వారాల ప్రెగ్నెంట్ పెట్టుకున్న అభ్యర్థన కేసులో గురువారం సీజే చంద్రచూడ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆర్డర్ ద్వారా పర్మిషన్ తీసుకుని శిశువును చంపాలనుకుంటున్నారా అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. ఈ కేసులో శుక్రవారం మళ్లీ విచారణ చేపట్టారు. అబార్షన్ అపీల్ గురించి ఆ మహిళతో కేంద్రం తరపున లాయర్ మాట్లాడాలని సుప్రీంకోర్టు సూచించింది.
Also Read : జైలులో పరిస్థితులు నా భర్తకు తీవ్రముప్పు తలపెట్టేలా ఉన్నాయి
సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె ఇప్పటికే డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు ఆ పిటీషన్‌లో పేర్కొన్నారు. మానసికంగా, ఆర్థికంగా మూడవ శిశువును పెంచే స్థితిలో తాను లేనట్లు ఆమె ఆ పిటీషన్‌లో తెలిపింది.ఈ కేసులో అబార్షన్‌కు అనుమతి ఇస్తూ అక్టోబర్ 9వ తేదీన కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఎయిమ్స్ వైద్యుల బృందం మాత్రం అబార్షన్‌కు నిరాకరించారు. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం బుధవారం ఈ కేసులో భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసింది. దీంతో ఆ కేసును శుక్రవారం సీజే చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం టేకప్ చేసింది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube