కోర్టు ఆదేశాలు పాటించరా

ఒఆర్‌ఒపి కేసులో కేంద్రంపై సుప్రీం ఆగ్రహం

0
TMedia (Telugu News) :

కోర్టు ఆదేశాలు పాటించరా ?

-ఒఆర్‌ఒపి కేసులో కేంద్రంపై సుప్రీం ఆగ్రహం

టీ మీడియా, ఫిబ్రవరి 28,న్యూఢిల్లీ : ‘వన్‌ ర్యాంక్‌… వన్‌ పెన్షన్‌ (ఒఆర్‌ఒపి)కి సంబంధించి న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్ని పాటించరా? ఇదేం పద్ధతి?’ అంటూ కేంద్ర ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ”కోర్టు ధిక్కారణ నోటీసులు పంపాల్సి ఉంటుంది” అంటూ రక్షణ శాఖను హెచ్చరించింది. సైనిక బలగాలకు చెందిన అర్హులైన పెన్షన్‌దారులకు ఒఆర్‌ఒపి బకాయిల్ని ఒకే విడతలో చెల్లించాలని, మార్చి 15కల్లా చెల్లింపుల ప్రక్రియ పూర్తిచేయాలని జనవరి 9న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును పరిగణలోకి తీసుకోకుండా పెన్షన్‌దారులకు నాలుగు విడతల్లో బకాయిలు చెల్లించబోతున్నామని జనవరి 20న రక్షణశాఖ ఒక నోటిఫికేషన్‌ జారీచేసింది.భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం ‘ఓఆర్‌ఓపీ’ కేసుపై విచారణ జరిపింది. కోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరిస్తూ రక్షణశాఖ నోటిఫికేషన్‌ జారీచేయటం ఏంటని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటిఫికేషన్‌ను రద్దు చేయకపోతే కోర్టు ధిక్కారణ నోటీసులు పంపాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Also Read : 175 స్థానాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యముందా

”సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఒఆర్‌ఒపి కేసులో అర్హులైన పెన్షనదారులకు బకాయిల్ని చెల్లించాలి. కోర్టు ఉత్తర్వులు వెలువడ్డాక కూడా.. నాలుగు వాయిదాల్లో బకాయిలు చెల్లిస్తామని రక్షణ శాఖ ఎలా నిర్ణయించింది?” అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ హోలి పండుగ తర్వాత చేపడతామని కేసును వాయిదా వేసింది.
జనవరి 9 నాటి సుప్రీం విచారణకు కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంటకరమణి హాజరయ్యారు. ”వ్యక్తిగతంగా ఈ అంశాన్ని పరిశీలిస్తాను. వీలైనంత త్వరలో బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటా”మని న్యాయస్థానానికి ఆయన హామీ ఇచ్చారు. కేంద్రం కోరిన మీదట సుప్రీంకోర్టు బకాయిల చెల్లింపు గడువు ఇప్పటికే రెండుమార్లు పొడగించింది. లక్షలాది కుటుంబాలకు సంబంధించినది మాజీ సైనికాధికారులుసైనిక బలగాల్లో పనిచేసి రిటైర్‌ అయినవారి ర్యాంక్‌, సర్వీస్‌ కాల వ్యవధిని మాత్రమే లెక్కలోకి తీసుకొని పెన్షన్‌ నిర్ణయించాలన్నదే ‘ఓఆర్‌ఓపీ’. రిటైర్‌ అయిన తేదీని బట్టి పెన్షన్‌ నిర్ణయించరాదని ‘ఓఆర్‌ఓపీ’ చెబుతోంది. జులై 1, 2014 నుంచి ఓఆర్‌ఓపీ అమల్లోకి వచ్చింది.

Also Read : రామావతారంలో హనుమంత వాహనంపై విహరించిన లక్ష్మీనరసింహుడు

దీని ప్రకారం ప్రతి ఐదేండ్లకోమారు పెన్షన్‌ చెల్లింపులో సవరణలు ఉంటాయి. అర్హులైన పెన్షన్‌దారుల బకాయిల చెల్లింపు ప్రక్రియ మూడు నెలల్లోగా పూర్తిచేయాలని గతంలో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. తమకు రావాల్సిన బకాయిల్ని ఒకే విడతలో చెల్లించాలని కోరుతూ కొంతమంది మాజీ సైనికాధికారుల బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణ పెండింగ్‌లో ఉండిపోవటంతో ఈ సమయంలో దాదాపు 4లక్షల మంది పెన్షనర్లు చనిపోయారని, దీనివల్ల అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని సుప్రీం ముందు వారు గోడువెళ్లబోసుకున్నారు. దీంతో ఈ అంశంపై విచారణ పూర్తిచేసిన సుప్రీంకోర్టు జనవరి 9న తీర్పు వెలువరించింది. పెన్షన్‌దారులకు ఒకే విడతలో బకాయిలు చెల్లించాలని చెప్పింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube