జాతీయ రాజకీయాలకు వేదికగా తెలంగాణ

రాష్ట్రం నుంచి అగ్రనేతల పోటీ?

0
TMedia (Telugu News) :

జాతీయ రాజకీయాలకు వేదికగా తెలంగాణ..

-రాష్ట్రం నుంచి అగ్రనేతల పోటీ?

-మోదీ, సోనియా సై అంటారా?

టి మీడియా, జనవరి 5,ఢిల్లీ : జాతీయ రాజకీయాలకు తెలంగాణ వేదిక కాబోతోందా? రెండు జాతీయ పార్టీల అగ్రనేతలు ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్నారా? రాష్ట్రం నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్న తమ నేతల విజ్ఞప్తిని వారు మన్నిస్తారా? అలా అయితే.. తెలంగాణ నుంచి పోటీ చేసే ఆ జాతీయ పార్టీలు ఏవి ? ఇంతకీ ఆ ఇద్దరు అగ్రనేతలు ఎవరు? వారిద్దరి అరంగేట్రంతో తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం ఎలా మారబోతోంది ?
తెలంగాణ నుంచి బరిలోకి సోనియా?
అసెంబ్లీ ఎన్నికలతో దేశవ్యాప్తంగా హాట్‌హాట్ చర్చకు తెరలేపిన తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ రాజకీయాలు రాష్ట్రానికి వేదిక కాబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని టీపీసీసీ కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉందని.. సోనియా ఇక్కడి నుంచి పోటీ చేస్తే పార్టీకి తిరుగుండదని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. అంతేకాదు.. ఆమె పోటీ చేయడం వల్ల ఆ ప్రభావం తెలంగాణతోపాటు ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్‌పై కూడా చూపించి మెజార్టీ సీట్లు గెలుచుకునే అవకాశముందని భావిస్తున్నారు.

Also Read : డిసిసిబి చైర్మన్ రేసు లో తుళ్లూరి బ్రహ్మయ్య ..?

సోనియా లేదా ప్రియాంక పోటీ చేస్తే..
గతంలో ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. సోనియా కూడా కాంటెస్ట్ చేయాలని కోరుతున్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్న భువనగిరి, నల్గొండ, ఖమ్మం స్థానాల్లో ఒకచోట నుంచి ఆమె పోటీ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. లేదా ఇందిరాగాంధీ గతంలో పోటీ చేసిన మెదక్ పార్లమెంట్ నుంచి సోనియాగాంధీ గానీ ప్రియాంకగాంధీ గానీ పోటీ చేస్తే కాంగ్రెస్‌కు బాగా కలిసి వస్తుందని చెబుతున్నారు పార్టీ నేతలు.

తెలంగాణ నుంచి ప్రధాని మోదీ పోటీ?
మరోవైపు బీజేపీ నేతలు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. ఏకంగా ప్రధాని నరేంద్రమోదీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు వారు. మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ప్రధానికి లేఖ రాయడంతో పాటు స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రధాని తెలంగాణ నుంచి పోటీ చేస్తే దక్షిణాదిలో బీజేపీ మరింత బలపడే అవకాశముందని కమలనాథులు భావిస్తున్నారు.

Also Read : పత్తి కొనుగోలు లో దందా

మల్కాజ్ గిరి నుంచి మోదీ పోటీ?
బీజేపీ బలంగా ఉన్న మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని రాష్ట్ర నేతలు కోరుతున్నారు. ఈ నియోజవకర్గం పరిధిలో నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉండటం, కంటోన్మెంట్ ఏరియా కూడా మల్కాజిగిరి పరిధిలోకి రావడం కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. ప్రధాని తెలంగాణ నుంచి పోటీచేస్తే ఆ ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై పూర్తిగా పడుతుందని.. ఒకవేళ నార్త్ ఇండియాలో సీట్లు తగ్గినా ఇక్కడ గెలిచే స్థానాలతో వాటిని భర్తీ చేసుకోవచ్చని చెబుతున్నారు.బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో మల్కాజిగిరి ఒకటి కావడంతో ఇక్కడ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన ఈటల రాజేందర్ మల్కాజిగిరి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు బీజేపీ మధ్యప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధర్‌రావు కూడా ఈ నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు, మిల్లెట్ టిఫిన్స్ వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.

Also Read : డిసిసిబి చైర్మన్ రేసు లో తుళ్లూరి బ్రహ్మయ్య ..?

టికెట్ ఆశిస్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత
ఇక అండతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత మల్క కొమురయ్య సైతం ఇక్కడి నుంచే టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవలే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిన ఆయన.. తన మనసులో మాట బయటపెట్టినట్లు సమాచారం. గతంలో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో పోటీచేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు సైతం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.ఒకవేళ రాష్ట్ర నేతల విజ్ఞప్తి మేరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్ర నేతలు రాష్ట్రం నుంచి బరిలోకి దిగితే జాతీయ రాజకీయాలలో తెలంగాణ మరోసారి చర్చనీయాంశంగా మారడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube