ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయం

అసెంబ్లీ ఎన్నికల్లో ఒకలా

0
TMedia (Telugu News) :

ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయం .

– అసెంబ్లీ ఎన్నికల్లో ఒకలా..

-సార్వత్రిక ఎన్నిక ల్లో మరోలా

టీ మీడియా, ఫిబ్రవరి 15హైదరాబాద్ : తెవిపక్ష నేతగా ముద్ర పడిన వెంకట రెడ్డి.. గత కొంత కాలంగా అనుసరిస్తున్న ధోరణి అందరిలో ఆసక్తి రేపుతూనే వుంది. రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి వచ్చినప్పట్నించి ఆయన ధోరణి తరచూ వార్తలకెక్కుతోంది. మరీ ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో అద్దంకి దయాకర్.. చేసిన కామెంట్లు కోమటిరెడ్డి వెంకట రెడ్డిలో ఆగ్రహాన్ని రేపాయి. ఆనాటి దయాకర్ మాటల వెనుక, అసభ్య పదజాలం వెనుక రేవంత్ రెడ్డి వున్నారని వెంకట రెడ్డి ఇప్పటికీ భావిస్తున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్ రావు ఠాక్రే నియమితులైన తర్వాత తిరిగి గాంధీభవన్ మెట్లెక్కిన వెంకటరెడ్డి పార్టీ లైన్లోకి మారినట్లుగానే కనిపించింది. రేవంత్ రెడ్డితో మాటా మంతీ కలిపిన తర్వాత వెంకట రెడ్డి ఇక పార్టీలో మళ్ళీ యాక్టివ్ అవుతారని.. అందరు కాకపోయినా మెజారిటీ కాంగ్రెస్ శ్రేణులు భావించాయి. కానీ తాజాగా ఫిబ్రవరి 14న వెంకట రెడ్డి చేసిన కామెంట్లు మరోసారి పార్టీలో చిచ్చు రేపాయి. శ్రీధర్ బాబు వంటి నేతలు పార్టీ విధానంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తద్వారా డ్యామేజీ కంట్రోల్‌కు ప్రయత్నించారు. ఓవైపు బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అంటూ రేవంత్ రెడ్డి కాలికి బలపం కట్టుకుని మరీ పాదయాత్ర చేస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి మెజారిటీ రాదని, కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నా.. బీఆర్ఎస్ పార్టీతో జతకట్టక తప్పదని వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాదు కాదు.. కాంగ్రెస్ పార్టీనే సొంతంగా పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఆ వెంటనే మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డ్యామేజీ కంట్రోల్ ప్రకటన చేశారు. అయితే, ఇటీవల జరిగిన పరిణామాలు, రెండు పార్టీల నేతల మాటలు, చేతలు గమనించిన వారు.. శ్రీధర్ బాబు ప్రకటన కంటే వెంకట రెడ్డి వ్యాఖ్యలనే విశ్వసించే పరిస్థితి కనిపిస్తోంది.

Also Read :  యోగజీవనం

కాంగ్రెస్ పాలనే బెటరన్న సంకేతాలు
ఫిబ్రవరి 12న బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీని, ఆ పార్టీ నేతలను, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడారు. అదేసమయంలో బీజేపీ పాలన కంటే కాంగ్రెస్ పాలనే బెటరన్న సంకేతాలు ఆయన ప్రసంగంలో బయటపడ్డాయి. కేసీఆర్ అంతరంగం ఎలా వున్నా.. బీఆర్ఎస్ పార్టీతో జత కట్టడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో మాత్రం రెండు అభిప్రాయాలు వున్నాయి. బీజేపీని నిలువరించేందుకు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి లాభించేలా తెలంగాణలో ఎంపీల సంఖ్యను పెంచుకునేందుకు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని టీ.కాంగ్రెస్ నేతల్లో ఓ వర్గం కోరుకుంటోంది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని మరో వర్గం భావిస్తోంది. సీఎం సీటుపై కన్నేసిన రేవంత్ రెడ్డి అనుకూలవాదులంతా కనీసం అసెంబ్లీ ఎన్నికల దాకానైనా బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి పొత్తు వుండవద్దని కోరుకుంటోంది.
కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు
అయితే, ఇక్కడ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు వేరువేరుగా జరిగే అవకాశాలు ఎక్కువగా వుండడంతో అసెంబ్లీ ఎన్నికల దాకా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీతో నువ్వా నేనా అన్న విధంగానే ప్రధాన కాంగ్రెస్ నేతలంతా వుండే అవకాశం వుంది. పూర్తి మెజారిటీతో మేజిక్ మార్కైన 60 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే.. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీతో అవసరం లేకుండానే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొవచ్చు. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికీ పూర్తి మెజారిటీ రాకపోతే.. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీతో జత కట్టేందుకు కాంగ్రెస్ నేతలకు పెద్దగా అభ్యంతరం వుండకపోవచ్చు. అందుకు రాష్ట్ర అవసరాల కంటే జాతీయ స్థాయి అవసరాలే ప్రాధాన్యతాంశాలుగా మారిపోవచ్చు. తెలంగాణలో పాత ఉమ్మడి జిల్లాలను పరిశీలిస్తే.. కొన్ని జిల్లాలు బీఆర్ఎస్ పార్టీకి, మరికొన్ని జిల్లాలు కాంగ్రెస్ పార్టీకి, ఇంకొన్ని జిల్లాలు బీజేపీ అనుకూల ఫలితాలిచ్చే అవకాశాలు కనిపిస్తోంది. దీన్ని అధిగమించి, ఏదైనా పార్టీ మేజిక్ మార్కును సొంతంగా దాటితే అది ఆశ్చర్యమేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారిపోవడం రివాజు. ఇపుడు తెలంగాణలో ఆ దిశగానే అడుగులు పడుతున్నాయని చెప్పాలి. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పెద్దగా నాయకగణం లేని బీజేపీ దాన్ని సరిదిద్దుకునేందుకు పలువురు ఇతర పార్టీల నేతలకు గాలమేస్తున్నా అది వర్కౌట్ కావడం లేదనడానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారమే పెద్ద ఉదాహరణ. ఈటల రాజేందర్ లాంటి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీనివాస్ రెడ్డి అంత తేలికగా బీజేపీలో చేరే అవకాశాలు కనిపించడం లేదు. ఆయన షర్మిల పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్‌కు వెళ్ళిన పొంగులేటి.. అక్కడి సీఎం వైఎస్ జగన్‌ని కలిసి వచ్చారు. గతంలో (2014లో) పొంగులేటి జగన్ పార్టీ తరపున ఎంపీగా గెలిచి.. టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే జగన్‌తో జరిగిన భేటీలో ఆయనకు ఏమైనా సూచనలు అందాయా అన్న దిశగా కొన్ని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అన్నతో విభేదించి తెలంగాణ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల పార్టీలో చేరమని జగన్ సలహా ఇచ్చారా ? లేక బీజేపీలో చేరాలని అడ్వైజ్ చేశారా? అన్న విషయంలో ఊహాగానాలున్నాయి.
మూడు పార్టీలు.. మూడు సమస్యలు కొన్ని జిల్లాల్లో తగిన లీడర్లు ,అభ్యర్థులు లేక బీజేపీ ఇబ్బంది ఎదుర్కొనే అవకాశముండగా.. అంతర్గత గ్రూపు విభేదాలు కాంగ్రెస్ పార్టీకి అశనిపాతంగా మారే అవకాశాలున్నాయి.

Also Read : బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సర్వేలపై విరుచుకుపడ్డ విపక్షాలు

ఇక క్యాడర్, లీడర్స్ బలంగా వున్న బీఆర్ఎస్ పార్టీకి.. ప్రభుత్వంపై వున్న వ్యతిరేకత ఇబ్బంది కలిగించే అవకాశముంది. ఇలా మూడు ప్రధాన పార్టీలు ఏదో ఒక సమస్యతోనే ఎన్నికలకు వెళ్ళే అవకాశం వుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యూహం మాత్రం క్లియర్‌గా కనిపిస్తోంది. అందుకు కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఒకేరోజు భిన్నమైన ప్రకటనలే తార్కాణంగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే అవకాశముందని ఫిబ్రవరి 14 ఉదయం మాట్లాడిన వెంకట రెడ్డి.. సాయంత్రానికి తన మాటలను మీడియా వక్రీకరించిందని చెప్పుకొచ్చారు. ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఠాక్రేతో భేటీ తర్వాత మాట మార్చారు. అంటే ఎన్నికలకు ముందే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసే అవకాశముందన్న అభిప్రాయం జనాల్లోకి వెళితే అది బీజేపీ నేతలకు అస్త్రంగా మారుతుందని ఠాక్రే సూచించిన తర్వాతనే వెంకట రెడ్డి మాట మార్చినట్లు ఎవరికైనా అర్థమవుతుంది. అయితే, వెంకట రెడ్డి మాటలు రాహుల్ గాంధీ వరంగల్ సభలో చేసిన ప్రకటనకు భిన్నంగా వుండడం వల్ల కూడా వెంకట రెడ్డి వెనక్కి తగ్గి వుండవచ్చు. ఏది ఏమైనా .. అసెంబ్లీ ఎన్నికల దాకా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు ప్రత్యర్థులుగానే కొనసాగడం అవసరం, అనివార్యం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇరు పార్టీల వ్యూహాలు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టే దిశకు మారతాయి. అప్పుడు ప్రస్తుత ప్రత్యర్థులు, మిత్రులుగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube