తెలంగాణ సాహిత్యం వాస్తవికతను ప్రతిబింబిస్తుంది

ఎమ్మెల్సీ కవిత

1
TMedia (Telugu News) :

తెలంగాణ సాహిత్యం వాస్తవికతను ప్రతిబింబిస్తుంది : ఎమ్మెల్సీ కవిత
టి మీడియా,ఏప్రిల్ 21,హైదరాబాద్‌ : తెలంగాణ సాహిత్యం విస్తృతమైందని, కల్పన కంటే వాస్తవికతకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కోటి ఉమెన్స్‌ కాలేజీ అధ్యాపకురాలు డాక్టర్‌ ఎం. దేవేంద్ర రచించిన ‘‘తెలంగాణ కథ వర్తమాన జీవన చిత్రణ’’ అన్న పరిశోధనా గ్రంథాన్ని బుధవారంనాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత మరుగునపడ్డ మన సాహిత్యం కోటి ప్రభలతో వెలుగొందుతుందని, మన చరిత్రను మనమే రాసుకుంటున్న చారిత్రక సందర్భం ఆవిష్కృతమైందన్నారు.మన కళలు, సాహిత్యం తెలంగాణ సమాజానికి పంచ ప్రాణాలుగా నిలుస్తున్నాయన్నారు. తరతరాల మన మూల సంస్కృతి, సమాజ పరిణామ క్రమం, చరిత్ర, సాహిత్యంపై విస్తృతంగా పరిశోధనలు జరుగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మౌఖిక సాహిత్యం, లిఖిత సాహిత్యం తెలంగాణకు రెండు కళ్లవంటివని అభివర్ణించారు.

Also Read : రైస్ మిల్లుల్లో అవకతవకలపై ప్రభుత్వం స్పందించాలి

తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ఆటుపోట్లన్నీ తెలంగాణ కథల్లో, పాటల్లో, కవితల్లో, నవలల్లో నిక్షిప్తమై ఉన్నాయని వివరించారు. తెలంగాణ కథా సాహిత్యం వాస్తవిక జీవితానికి దగ్గరగా ఉంటుందని విశ్లేషించారు.ఇటీవల తెలంగాణ సాహిత్య అకాడమి ‘‘మన వూరుమన చెట్లు’’ అన్న కథల పోటీ నిర్వహిస్తే అందులో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు పాల్గొనటం దేశంలోని బాల సాహిత్య చరిత్రలోనే నూతన అధ్యాయనంగా నిలిచిపోతుందని ప్రకటించారు. మన తరతరాల సామాజిక చరిత్రకు సజీవ ప్రతీకగా తెలంగాణ సాహిత్యం నిరంతరం జీవనదిలా ప్రవహిస్తుందని కవిత అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌, గాయత్రి రవి, కథా రచయిత్రి డాక్టర్‌ ఎం. దేవేంద్ర, అధ్యాపకుడు ఎం. నర్సింహాచారి , టీఆర్‌ఎస్‌ నాయకులు వద్దిరాజు రవిచంద్రతదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube