ఆ వైరస్ కొవిడ్‌లా వ్యాపిస్తోంది : ఎయిమ్స్ మాజీ చీఫ్

ఆ వైరస్ కొవిడ్‌లా వ్యాపిస్తోంది : ఎయిమ్స్ మాజీ చీఫ్

0
TMedia (Telugu News) :

ఆ వైరస్ కొవిడ్‌లా వ్యాపిస్తోంది : ఎయిమ్స్ మాజీ చీఫ్

టీ మీడియా, మార్చ్ 7, ఢిల్లీ : దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వైరస్ కొవిడ్ లాగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు. గాల్లో తుంపర్ల ద్వారా వ్యాపించే ఈ వైరస్‌ సాధారణంగా ఏటా ఈ సమయంలో మార్పులకు లోనవుతుందని చెప్పారు. అయితే..పెద్దలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు జాతీయ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం మనం ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరగడాన్ని చూస్తున్నాం. ఏటా ఈ టైంలో ఈ వైరస్ వ్యాప్తి పెరుగుతుంటుంది. దీని వల్ల జ్వరం, దగ్గు, గొంతులో గరగర, ఒళ్లు నొప్పులు, జలుబు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే..ఈ వైరస్ ఏటా మార్పులకు లోనవుతుంది. దీన్ని యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అంటారు. కొన్నేళ్ల క్రితం హెచ్1ఎన్1 వైరస్‌తో సంక్షోభం వచ్చింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నది హెచ్3ఎన్2 రకం వైరస్. ఇది సాధారణ ఫ్లూ వేరియంటే. అయితే..వైరస్ తరచూ మార్పులకు లోనై రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకోగలుగుతోంది. దీంతో కేసుల సంఖ్య పెరుగుతోంది.

Also Read : విద్యార్థినులకు 6 నెలల మెటర్నిటీ లీవ్..

ఈ వైరస్ గాల్లో తుంపర్ల ద్వారా వ్యాపిస్తోంది. అయితే ఇదేమంతా ఆందోళనకరమైన అంశం కాదు. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యలో భారీ పెరుగుదల లేదు’’ అని డా. గులేరియా వివరించారు. వాతావరణ మార్పుల కారణంగా హెచ్3ఎన్2 సహజంగానే మార్పులకు లోనవతుంటుందని చెప్పుకొచ్చారు. ప్రజల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి అలవాట్లు తగ్గడంతో ఇన్‌ఫ్లుయెంజా కేసుల సంఖ్య పెరుగుతోందని ఆయన చెప్పారు. ఈ జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వైరస్ వేగంగా వ్యాపించగలుగుతోందని చెప్పారు. కాబట్టి.. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు మాస్కులు దరించాలని, తరచూ చేతులను శుభ్రపరుచుకోవాలని సూచించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube