ముంచుకొస్తున్న ‘తాలిబన్‌’ గండం

-ప్ర‌పంచ బ్యాంక్ సాయాన్ని అర్ధించిన పాక్‌

0
TMedia (Telugu News) :

ముంచుకొస్తున్న ‘తాలిబన్‌’ గండం
-ప్ర‌పంచ బ్యాంక్ సాయాన్ని అర్ధించిన పాక్‌
-ప‌డిపోయినరూపాయి విలువ‌
-ఆకాశానంటుతున్న నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు

టీ మీడియా,జనవరి 10 , ,ప్రత్యేక విభాగం : పాకిస్థాన్ మరో శ్రీలంక కాబోతున్నదా.. అంటే, అవుననే సమాధానం వస్తున్నది. పాక్‌ ఇవ్వాళ అన్నింటా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ప్రజలు నిత్యావసరాల కోసం రోడ్లపై బారులు తీరుతున్నారు. తీవ్ర ఆర్థిక మాంద్యం నెలకొనటంతో పాకిస్థాన్‌లో అన్నిరకాల ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. శాంతి భద్రతలు అడుగంటాయి. మరో వైపు పాకిస్థాన్‌ తాలిబన్‌లుగా పిలుస్తున్న తెహరిక్‌ ఇ తాలిబన్‌ (టీటీపీ) ఏకంగా పాక్‌ ప్రభుత్వాన్నే హెచ్చరించే స్థితికి చేరుకున్నది.మొత్తంగా చూస్తే.. పాక్‌లో ప్రభుత్వం నామమత్రంగా ఉన్నదా అంటే ఉన్నట్టే కనిపిస్తున్నది. పాకిస్థాన్‌ గత కొన్నేండ్లుగా తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నది. ఆర్థిక మాంద్యం రెండంకెలకు చేరుకున్నది. ద్రవ్యోల్బణం 24.5శాతానికి చేరుకున్నదని పాక్‌ ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి.అమెరికా డాలర్‌తో పాక్‌ రూపాయి విలువ రూ.280లకు పడిపోయింది! ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లో అన్ని రకాల నిత్యావసరాల ధరలు 56శాతం పెరిగాయి.

Also Read : జగన్ కనుసైగ చేస్తే చాలు

ఉల్లిగడ్డ ధర 415 శాతం పెరిగింది. పాకిస్థాన్‌ సింధ్‌లో జరిగిన ఘటన పాక్‌ దుస్థితికి అద్దం పడుతుంది. ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే గోధుమ పిండి పంపిణీ దగ్గర తొక్కిసలాట జరిగి ఓ వ్యక్తి చనిపోయాడు. అనేక మంది గాయాలపాలయ్యారు.రూ. 20లకు దొరకాల్సిన కిలో పిండి రూ. 140నుంచి 160కి చేరుకొన్నది. పిండి పాక్‌లోని వివిధ ప్రాంతాల్లో వివిధ రేట్లకు అందుబాటులో ఉన్నది. సింధ్‌లో కిలో గోధుమ పిండిని రూ.65కు అమ్ముతుంటే, ఇస్లామా బాద్‌, పెశావర్‌లో రూ. 150కి అమ్ముతున్నారు. ఈ పరిస్థితుల్లో పాక్‌ ప్రపంచ బ్యాంకు సాయాన్ని అర్థించింది. కానీ సాయం అందాలంటే.. పాక్‌లో ప్రజలకు ఇస్తున్న అన్ని రకాల సబ్సిడీలను ఎత్తి వేయాలని ఐఎంఎఫ్ ష‌రతు పెట్టింది.దీంతో గత్యంతరం లేక ప్రపంచ బ్యంకు సూచన మేరకు అన్నిరకాల సబ్సిడీలను ఎత్తి వేస్తున్నట్లు పాక్‌ ప్రధాని ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో పాక్‌లో నిత్యావసరాల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉన్నది. ఈ పరిస్థితులే ఎదురైతే ప్రజలు ఆకలి చావులకు గురయ్యే దుస్థితి ఏర్పడుతుంది.పాకిస్థాన్‌లో ఆర్థిక, సామాజిక పరిస్థితి దారుణంగా క్షీణించింది. విద్యుత్, ఇతర ఇంధన శక్తిని కాపాడు కునేందుకు అన్ని రకాల మార్కెట్లను, దుకాణాలను సాయంత్రం ఐదు గంటలకే మూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ నేపథ్యంలోంచే.. వంట గ్యాస్‌ను కూడా ప్లాస్టిక్‌ బ్యాగుల్లో ఇచ్చే దుస్థితి వచ్చిందంటే పరిస్థితి ఎంత అద్వాన్నంగా ఉన్నదో ఊహించుకోవచ్చు.ఆర్థిక పరిస్థితి ఒకవైపు పాక్‌ను కుంగదీస్తుంటే.. తెహరిక్‌ ఇ తాలిబన్‌(టీటీపీ)లు ఆఫ్ఘాన్‌ సరిహద్దు ప్రాంతాన్ని కేంద్రం చేసుకొని కార్యకలాపాలను విస్తృతం చేశారు. తమ కార్యకలాపాలను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పాక్‌ ప్రధానిశేబాజ్‌ షరీఫ్‌, విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీని హెచ్చరించారు.తమపై దాడులకు పాల్పడుతున్నారని పాక్‌ పోలీస్‌ స్టేషన్లపై, ఆర్మీ క్యాంపులపై దాడులు చేసి పదుల సంఖ్యలో పోలీసులను హతమార్చారు.

Also Read : హర్యానా ఉపముఖ్యమంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

కిడ్నాప్‌లకు పాల్పడి పెద్ద మొత్తంలో డబ్బును డిమాండ్‌ చేస్తున్నారు. అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు 2021లో అధికారం చేపట్టిన తర్వాత టీటీపీ మరింత రెచ్చి పోతున్నది. అఫ్ఘన్‌-పాక్‌ సరిహద్దు ప్రాంతాన్ని స్థావరంగా చేసుకొని సరిహద్దు జిల్లాలను తమ విముక్తి ప్రాంతాలుగా ప్రకటించుకొన్నారు. నిలువరించటానికి వచ్చిన పాక్‌ పోలీసులను, మిలట్రీని మట్టుబెడుతున్నారు.ఇంతటితో ఆగకుండా త్వరలోనే పాక్‌ను వశం చేసుకొంటామని ప్రకటిస్తున్నారు. పాక్‌ గృహమంత్రి రానా సనౌళ్లా.. టీటీపీ టెర్రరిస్టులు కేవలం 7నుంచి 10మంది దాకా ఉంటారని ప్రకటించారు. వారిని కట్టడి చేసి పాక్‌లో శాంతిభద్రతలను కాపాడుకొంటామని తెలిపారు. ఇటీవలే 11మంది తాలిబన్‌ టెర్రరిస్టులను పాక్‌ సైన్యం మట్టుబెట్టింది. కానీ అఫ్ఘన్‌ తాలిబన్‌ల అండతో పాక్‌పై కన్నేసిన టీటీపీని కట్టడి చేయటం అంత సులువైన పని కాదని పరిశీలకులు అంటుండటం గమనార్హం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube