బదిలీల సిఫార్సులు.
-ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు
టి మీడియా, జూన్ 21,అమరావతి:
‘సార్… మీ లెటర్ ఇస్తే నాకు బదిలీ జరుగుతుంది. దయ చేసి మీరు సహాయం చేయాలి..’ ఓ ఎమ్మెల్యేకు రెవెన్యూ ఉద్యోగి విజ్ఞప్తి!
ఆయన మనకు కావాల్సినవారు. అతను ఆ మండలం లోనే ఉండే విధంగా చూడండి..’ – ఉన్నతాధికారికి ఓ ప్రజాప్రతినిధి సూచన.’జిల్లా పరిషత్తులో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పేరుతో బోగస్ లేఖలు వచ్చాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించాలి..!’ ఆశాఖ ఉద్యోగులు జడ్పీ సీఈఓకు విజ్ఞప్తి.జిల్లాలో సాధారణ బదిలీల జాతర జరుగుతోంది. పైరవీలకే పెద్దపీట వేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అమాత్యుల సిఫార్సుల లేఖలకు డిమాండ్ పెరిగింది. ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ ప్రభుత్వ ఉద్యోగులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇతర జిల్లాలకు చెందిన మంత్రుల నుంచి సిఫార్సు లేఖలు తెస్తున్నారు. జిల్లా కలెక్టరేట్‌కు సిఫార్సులు లేఖలు కుప్పులు తెప్పలు పడుతున్నాయి. కొన్ని శాఖల్లో ఇప్పటికే కౌన్సెలింగ్ ప్రారంభమైనా నిబంధనలకు పాతర వేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇష్టానుసారం పోస్టింగులు ఇస్తున్నారు. బదిలీల్లో ఫోకల్ పోస్టులకు రూ.లక్షల్లో డిమాండ్ ఉంది. రిజిస్ట్రేషన్ శాఖలో ఇప్పటికే కొన్ని బదిలీలు పూర్తికాగా కొన్నింటిపై ఆరోపణలు వస్తున్నాయి.
Also Read : పట్టణ ప్రగతి ప్రజలకు శూన్యం
జిల్లాల్లో సాధారణ బదిలీలకు ఈ నెలఖరు వరకు గడువు పొడిగించిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం సర్వీసు, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తలు అంశాలకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది. వారు కొరుకున్న ప్రాంతం ఖాళీగా ఉంటే బదిలీకి అవకాశం ఉంది. వారికి పాయింట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో వారు కౌన్సెలింగులో ముందు వరుసలో ఉంటారు. కానీ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలతో పరిపాలన సౌలభ్యం (అడ్మినిస్ట్రేట్ గ్రౌండ్) కోసం బదిలీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా సంఘాల బాధ్యులకు బదిలీ అవకాశం లేదు. వీటిని పెట్టుకొని కొంత మంది బదిలీల నుంచి తప్పించుకోగా మరికొంత మంది కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేయించుకుంటున్నారు. దీంతో వాస్తవంగా అసలైన అర్హులకు అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. రెండు జిల్లాల పరిధిలోనూ బదిలీలు ప్రారంభమైన విషయం తెలిసిందే.రిజిస్ట్రేషన్ల శాఖలో ఇటీవల డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్ల బదిలీలు ఉన్నత స్థాయిలో జరిగాయి. జిల్లాకు చెందిన ముగ్గురు జిల్లా రిజిస్ట్రార్లు బదిలీ అయ్యారు. కొత్త జిల్లా రిజిస్ట్రార్లు బాధ్యతలు తీసుకున్నారు. ఆ మరుసటి రోజే సబ్ రిజిస్ట్రార్ల బదిలీలు ప్రారంభించారు. నోడల్ డీఐజీగా ఉన్న అధికారి ఈ బదిలీలు చేయాలి. సబ్ రిజిస్ట్రార్లు బదిలీలు సర్వీసు, ఇతర అంశాలను తీసుకుని మెరిట్ జాబితా ప్రకారం వరుస క్రమంలో కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.ఏ కేటగిరి నుంచి ఏ కేటగిరికి ఎస్‌ఆర్‌లను బదిలీ చేయకూడదు. కానీ జిల్లాలో ఏ కేటగిరికి చెందిన ఉయ్యూరు నుంచి ఏకేటగిరికి చెందిన మరో స్థానం ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Also Read : ప్రతి జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య
దీని కోసం గాంధీనగర్, పటమట కోరుకున్న వారికి దక్కలేదని తెలిసింది. సీనియారిటీలో నాలుగో స్థానంలో ఉన్న వ్యక్తి పటమట కోరుకోగా మరో రెండు ఆప్షన్లు ఇవ్వాలని ఉన్నతాధికారులు సూచించారు. దీంతో గాంధీనగర్, రాజమండ్రి పరిధిలోని రాజానగరం కోరుకోగా అప్పటికే రాజానగరం వేరే వారికి అయిపోయిందని చెప్పి.. గాంధీనగర్, పటమటలో కేటాయించకుండా హోల్డ్(పెండింగ్)లో పెట్టడం చర్చనీయాంశమైంది. ఈ రెండు స్థానాలకు జిల్లాలో విపరీతమైన డిమాండ్ ఉంది. సోమవారం నాలుగో స్థానంలో రాఘవరావుకు పటమట సబ్‌రిజిస్ట్రార్ పోస్టు కేటాయించినట్లు తెలిసింది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.రిజిస్ట్రేషన్ శాఖలో ముందస్తుగానే సబ్ రిజిస్ట్రార్లతో ఒప్పందాలు చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అక్కడ కమీషన్ రూపంలో భారీగా ముడుపులు అందుతాయి. దీనిలో పటమట ఒకటి కావడం విశేషం. పటమట రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఓ డాక్యుమెంటు రైటర్ నడిపిస్తారనే ప్రచారం ఉంది. కార్యాలయం అద్దె కూడా ఆయన చెల్లిస్తారని తెలిసింది. దీంతో ఆయన చెప్పినట్లు ఇక్కడ పోస్టింగులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.వాణిజ్య పన్నుల శాఖలోనూ అంతర్గత బదిలీలలో పైరవీలకే పెద్దపీట వేశారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలు పట్టించుకోకుండా బదిలీలు జరుగుతున్నాయని కొంతమంది ఫిర్యాదు చేశారు. ఈ శాఖలోనూ ముడుపులకు ఎక్కువ అవకాశం ఉంది. ఆదాయం వచ్చే పోస్టులకు డిమాండ్ ఎక్కువగా ఉంది.రెవెన్యూ శాఖలో పూర్తిగా ఎమ్మెల్యేల సిఫార్సులతోనే నచ్చిన వారికి పోస్టింగులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
Also Read : పాఠశాలకు ఫ్యాన్ వితరణ
పరిపాలన గ్రౌండ్స్ కింద ఎప్పటికప్పుడు బదిలీలు జరిగే అవకాశం ఈ శాఖలో ఉంది. డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్ల బదిలీలకు ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన వారికే చోటు కల్పిస్తున్నారు. దీంతో వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ల టేబుల్ మీద సిఫార్సుల లేఖలతో పాటు స్వయంగా ఫోన్ ద్వారా రికమెండేషన్లు అందాయి.జిల్లా పరిషత్తులో బోగస్ సిఫార్సు లేఖలు చలామణి అవుతున్నట్లుఆరోపణలున్నాయి. ఆ శాఖ మంత్రి లేటర్ హెడ్స్ ముద్రించి ఫోర్జరీతో జడ్పీ సీఈఓ, ఛైర్‌పర్సన్‌కు అందించారని చెబుతున్నారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించాలని కొంత మంది కోరుతున్నారు. మొగల్రాజపురంలో ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో మంత్రి లెటర్ హెడ్స్ ముద్రణకు ఇవ్వగా వాటిలో కొన్ని ఓ వ్యక్తి భద్రపరిచి ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు. దీనిపై విచారణ చేయాల్సి ఉంది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube