బదిలీలకు బేరసారాలు

సొంత జిల్లాకు వచ్చేందుకు ఉపాధ్యాయుల పరస్పర అవగాహన

1
TMedia (Telugu News) :

బదిలీలకు బేరసారాలు
సొంత జిల్లాకు వచ్చేందుకు ఉపాధ్యాయుల పరస్పర అవగాహన
గరిష్ఠంగా రూ.20 లక్షలు ఇచ్చేందుకూ సుముఖం

టీ మీడియా , మార్చి 14:హైదరాబాద్‌: ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోతో పలువురు ఉపాధ్యాయులు తమ కుటుంబాలను వదిలి వేరే జిల్లాలోని పాఠశాలలో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వారికి ఉపశమనంగా ప్రభుత్వం ఫిబ్రవరి 2వ తేదీన పరస్పర బదిలీలకు అనుమతి ఇచ్చింది. జీవో ప్రకారం వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు పరస్పర అంగీకారంతో జిల్లాలు మారవచ్చు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వికారాబాద్‌, వనపర్తి, నారాయణపేట తదితర మారుమూల జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు రంగారెడ్డి, మేల్చల్‌-మల్కాజిగిరి జిల్లాలకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని కొందరు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. హైదరాబాద్‌ శివారు జిల్లాల్లో పనిచేస్తున్న పలువురు మారుమూల జిల్లాలకు రావడానికి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ శివారు జిల్లాలో హెచ్‌ఆర్‌ఏ 24 శాతం వస్తుందని, మారుమూల జిల్లాల్లో 11 శాతమే వస్తుందని లెక్కలు చెబుతున్నారు. కాగా, పదవీ విరమణకు చేరువలో ఉన్నవారు ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇతరులెవరైనా మరింత ఎక్కువ ఇస్తామని చెబితే ఎక్కడ మనసు మార్చుకుంటారోనని కొందరు ముందుగా కొంత మొత్తాన్ని ఇస్తూ… లిఖితపూర్వక ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 15వ తేదీ తుది గడువు కావడంతో ఇలాంటి వ్యవహారాలు జోరందుకున్నాయి.

Also Read : ఇళ్ల పట్టాల పంపీణీలో మనమే నంబర్‌ వన్: మంత్రి పువ్వాడ

ఇదీ ఒప్పందాల వరస..
* రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడొకరు వికారాబాద్‌ జిల్లాకు రావాలంటే రూ.15 లక్షలు డిమాండ్‌ చేస్తున్నారు. ఒకరు రూ.10 లక్షలు ఇస్తానన్నా ఒప్పుకోలేదు.
* జనగామ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు తనకు హనుమకొండ వచ్చేందుకు సహకరించేవారికి ఏకంగా 150 గజాల ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని ముందుకొచ్చారు.
* నారాయణపేట జిల్లాలో పనిచేస్తున్న మహిళా హిందీ పండిత్‌ ఒకరు రంగారెడ్డి లేదా మేడ్చల్‌ జిల్లాకు రావడానికి రూ.20 లక్షలు ఇచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నారు. ఆమె భర్త మేడ్చల్‌ జిల్లాలో వ్యాపారి.
* రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు ప్రస్తుతం వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలంలో పనిచేస్తున్నారు. తన సొంతూరికి చేరువలో వచ్చేందుకు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడి(ఈయన సొంత జిల్లా వికారాబాద్‌)తో రూ.6.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని దరఖాస్తు చేసుకున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube