ఆ భూములన్నీ మావే…
-మరోసారి వివాదానికి తెరలేపిన టిటిడి
– మూడు వేల ఎకరాల్లో రిజిస్ట్రేషన్ల నిషేధం
లహరి , ఫిబ్రవరి27,తిరుపతి బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) మరో వివాదాన్ని తెరపైకి తెచ్చింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు వేల ఎకరాలకుపైగా భూములన్నీ మావే. వీటిని రిజిస్ట్రేషన్ చేయొద్దు’ అంటూ గతేడాది ఫిబ్రవరిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌కు లేఖ రాసింది. ఇందుకు సంబంధించి సుమారు 200 సర్వే నంబర్లను సమర్పించింది. ఈ లేఖపై దేవాదాయ శాఖ స్పందిస్తూ ఈ భూములన్నీ 22ఎ కింద ఉన్నాయని, వీటి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయాలని రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖకు నివేదించింది. దీంతో, ఈ మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 26 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖ ఈ నెల తొమ్మిదిన ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ల నిషేధం విధించిన వాటిలో సర్వే నంబర్ 11/2బి-2 అక్కారంపల్లిలోని 1200 ఎకరాలు, సర్వే నంబర్ 1, 2, 3, 4లో లీలామహల్ నుంచి బిటిఆర్ నగర్, శెట్టిపల్లి, మంగళం క్వార్టర్స్, కరకంబాడి వరకూ 700 ఎకరాలు, తిరుపతి బ్లిస్ స్టార్ హోటల్ నుంచి లక్ష్మీపురం జంక్షన్, పద్మావతిపురం వరకూ మరో 300 ఎకరాలు, నాగలాపురం, అప్పలాయగుంట, నారాయణవనంలోని రైతులకు సంబంధించి 250 ఎకరాలు ఉన్నాయి. నారాయణవనానికి చెందిన టిటిడి కల్యాణ మండపం సర్వే నంబర్ 83/12ఎ/2బి/4ఎలో మూడు ఎకరాల్లో ఉంది. అయితే సర్వే నంబర్‌లోని 30 ఎకరాల రిజిస్ట్రేషన్‌పైనా నిషేధం విధించింది. ఈ మూడు వేల ఎకరాల్లో 1100 ఎకరాలు సాగు భూములు ఉన్నాయి. వీటిని రైతులు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నారు. మిగిలిన 1900 ఎకరాల్లో ఇళ్లు, షాపులు, కొన్ని అపార్టుమెంట్లు ఉన్నాయి. పేదలు, ప్రయివేట్ వ్యక్తులు వీటిని నిర్మించుకున్నారు. ఈ వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా, ఎటువంటి విచారణా జరపకుండా రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖ గుడ్డిగా ఈ ఆదేశాలు ఇచ్చిందని స్థానికులు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా పోరాడేందుకు వారు సన్నద్ధం అవుతున్నారు. నిషేధం విషయమై తిరుపతి జిల్లాకు సంబంధించిన ఓ రిజిస్ట్రేషన్ అధికారిని ‘ప్రజాశక్తి’ ఫోన్‌లో సంప్రదించగా టిటిడి ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రకటించారు తప్ప, సబ్‌డివిజన్ చేసి ఉంటే గందరగోళం ఉండేది కాదన్నారు. 26 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సమస్య తలనొప్పిగా మారిందని, తమ చేతుల్లో ఏమీ లేదని, ప్రభుత్వమే గెజిటెడ్ నోటిఫికేషన్ ఇచ్చి సబ్‌డివిజన్ చేసి తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ ఈ సమస్య ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు.
Also Read : చార్ ధామ్ యాత్రకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్
గతంలోనూ…
టిటిడి గతంలో కూడా ఇటువంటి వివాదాలకు తెరలేపింది. ‘తిరుపతి అంతా టిటిడితే’ అంటూ 2002లో అప్పటి ప్రభుత్వం 781 జిఒను జారీ చేసింది. టిటిడి విజ్ఞప్తి మేరకు ఈ జిఒ ఇచ్చింది. అప్పట్లో ఇది పెద్ద వివాదాస్పదమైంది. ‘781 వ్యతిరేక జిఒ పోరాట కమిటీ’గా స్థానికులు ఏర్పడి మూడు నెలల పాటు ఆందోళనలు చేయడంతో అప్పటి ప్రభుత్వం వెనక్కి తగ్గి ఈ జిఒను ఉపసంహరించుకుంది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube