హాస్య స్ఫూర్తి ఎవరికి ఎక్కువ

హాస్య స్ఫూర్తి ఎవరికి ఎక్కువ

0
TMedia (Telugu News) :

హాస్య స్ఫూర్తి ఎవరికి ఎక్కువ..

లహరి, జనవరి 27, కల్చరల్ : ఇందులో ఒక స్థానమైనా లేక ఒక గ్రహమైనా బలంగా ఉన్నట్టయితే అటువంటి జాతకులు ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు.హాస్య స్ఫూర్తి ఎవరికి ఎక్కువ?.హాస్య స్ఫూర్తి లేని వ్యక్తి జీవితంలో ఎందుకూ కొరగాడని ప్రముఖ హాస్య రచయిత ముళ్ళపూడి వెంకటరమణ అంటుండేవారు. జీవితంలో హాస్యానికి పెద్ద పాత్రే ఉంది. నవ్వటం చేతకాక పోయినా, జీవితాన్ని లైట్ గా తీసుకోలేకపోయినా ఆ జీవితం దుర్భరంగా ఉంటుందని ప్రముఖ హాలీవుడ్ నటుడు గ్రోషో మార్క్స్ అనేవారు. మొత్తం మీద జీవితంలో హాస్యస్ఫూర్తి అత్యంత ప్రాధాన్యం సంపాదించుకుంది అనడంలో సందేహం లేదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం, లగ్నం, లగ్నం నుంచి రెండవ రాశి, ఐదవ రాశి హాస్యస్ఫూర్తికి సంబంధించిన స్థానాలు. బుధుడు, చంద్రుడు, కొద్దిగా శుక్రుడు హాస్యానికి లేదా హాస్య సంభాషణకు కారకులు. ఇందులో ఒక స్థానమైనా లేక ఒక గ్రహమైనా బలంగా ఉన్నట్టయితే అటువంటి జాతకులు ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు.


సాధారణంగా జాతక చక్రంలో బుధుడు గాని, చంద్రుడు గాని ఒకటి, రెండు, నాలుగు, అయిదు, ఏడు, పది స్థానాలలో ఉన్నట్టయితే అటువంటి వారిలో హాస్యస్ఫూర్తి ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ ఉంటుంది. వీరిలో హాస్యానికి సంబంధించిన సృజనాత్మకత చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువగా ఉంటుంది. హాస్యనటుల్లో ఎక్కువమందికి బుధ చంద్రుడు వారి జాతక చక్రాల్లో బలంగా ఉండటం కనిపిస్తుంది. చార్లీ చాప్లిన్, లారెల్, హార్డీ, గ్రోషో మార్క్స్ నుంచి రేలంగి, రమణారెడ్డి, రాజబాబు, జానీ వాకర్ వరకు ప్రతి హాస్యనటుడి జాతకం లోను బుధ గ్రహం పైన చెప్పిన రాశుల్లో గానీ, ఇతరత్రా బలంగా గానీ ఉన్నట్టు అర్థమవుతుంది.లగ్నంలో కానీ, ద్వితీయంలో కానీ బుధుడు ఉన్న జాతకాల వారు ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటారు. వారి ముఖాలు కూడా ఎప్పుడు చూసినా నవ్వులు చిందిస్తూనే ఉంటాయి. వారు ఎక్కువగా హాస్య రచనలు కూడా చేస్తుంటారు. వారి నుంచి అలవోకగా జోక్స్ పుట్టుకొస్తుంటాయి.

Also Read : వైభవంగా రథసప్తమి వేడుకలు.

వారి ముఖాలు ప్రసన్నంగానే ఉంటాయి. లగ్నం నుంచి రెండవ స్థానం ముఖానికి సంబంధించింది. అందువల్ల ఈ స్థానంలో బుధుడు లేదా చంద్రుడు ఉండటం మంచిది. ఇటువంటి వారి సంభాషణలు కూడా చతురోక్తులతో నిండి ఉంటాయి. రెండవ స్థానంలో చంద్రుడు ఉన్నపక్షంలో వారు మంచి సంభాషణ చతురులు అవుతారు. వారితో కాసేపు మాట్లాడినా మనలోని మానసిక ఒత్తిడి, టెన్షన్లు మటుమాయం అయిపోతాయి. హాస్యం లేనిదే వారు మాట్లాడటం కూడా జరగదు. అంతేకాదు, వీరు ఎప్పుడు చూసినా సానుకూల దృక్పథంతోనే వ్యవహరిస్తారు. రెండవ స్థానాన్ని వాక్ స్థానం అని కూడా అంటారు.వాక్ స్థానంలో గురువుగానీ, శుక్రుడు కానీ ఉన్న పక్షంలో ఎక్కువగా వారు నాలెడ్జ్ సంబంధమైన మాటలే మాట్లాడుతారు. వీరు అడపాదడపా మాత్రమే హాస్యాన్ని పండిస్తారు. అయితే, ఇతరుల హాస్య సంభాషణలకు సానుకూలంగా స్పందిస్తారు. శుక్ర గ్రహం ద్వితీయ స్థానంలో ఉన్న పక్షంలో ఎక్కువగా శృంగార సంబంధమైన హాస్యాన్ని మాత్రమే మాట్లాడటం జరుగుతుంది. శుక్ర గ్రహం వల్ల సృజనాత్మకంగా శృంగార సంబంధమైన చతురోక్తులు, సరసాలకు అవకాశం ఉంటుంది. రెండవ రాశిలో శని గ్రహం ఉన్న పక్షంలో అటువంటి జాతకులు సాధారణంగా నవ్వటం అంటూ ఉండదు. వారు ఎప్పుడు చూసినా సీరియస్ గా కనిపిస్తారు. వారు నవ్వరు నవ్వించరు. పైగా ఎవరైనా హాస్యమాడితే వారికి కాస్తంత కోపం వచ్చినా రావచ్చు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టుగా, బాగా విచారంలో ఉన్నట్టుగా కనిపిస్తారు.లగ్నంలో కానీ, ద్వితీయ స్థానంలో కానీ కుజ గ్రహం ఉన్నట్టయితే వారిలో హాస్యం కన్నా కోపం అధికంగా ఉంటుంది. వారు ఎదుట వారి చతురోక్తుల కన్నా తమ చతురోక్తులనే ఇష్టపడతారు.

Also Read : అరసవెల్లి ఆలయంలో రథసప్తమి వేడుకలు..

నిజానికి వారి దగ్గర జోక్స్ వేయడం, వారితో సరసాలు ఆడటం అంత శ్రేయస్కరం కాదు. ద్వితీయ స్థానంలో రవి ఉన్నట్టయితే, అటువంటి జాతకులు ఎప్పుడు చూసినా గంభీరంగానే ఉంటారు. సరస సంభాషణలకు, చతురోక్తులకు వీరు ముసి ముసి నవ్వులు నవ్వడమే ఎక్కువ. సాధారణంగా వీరు జోక్స్ వేయడం తక్కువ. వారు వేసిన జోక్స్ కు మాత్రం అందరూ బాగా నవ్వాలని కోరుకుంటారు.ఇక రాహువు విషయానికి వస్తే, ఇటువంటి జాతకులు నవ్వటం చాలా చాలా అరుదు. అసభ్య, అశ్లీల పదజాలంతో హాస్యాన్ని పండించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. పెద్దమనిషి తరహా హాస్యం వీరి దగ్గర సాధ్యం కాదు. హాస్యం కన్నా అపహాస్యం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఇతరులను వేళాకోళం చేయటం, వెటకారంగా మాట్లాడటం, వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం వీరిలో ఒక పాలు ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారిని కించపరచడంలోనే వీరికి హాస్యం కనిపిస్తుంది. వాక్ స్థానంలో కేతు గ్రహం ఉన్న జాతకులకు సందర్భశుద్ధి తక్కువగా ఉంటుంది. ఎక్కడ జోక్స్ వేయాలో ఎక్కడ వేయకూడదో వీరికి తెలియదనిపిస్తుంది. పైగా హాస్యాన్ని సరిగ్గా పండించడం గానీ, వ్యక్తం చేయడం కానీ ఉండదు. హాస్య సంభాషణ అనేది ఒక కళ అని అర్థం చేసుకోవడం ఉండదు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube