బతుకమ్మ వేడుకల్లో పూలనే ఎందుకు పూజిస్తారు.?
లహరి, అక్టోబర్ 14, కల్చరల్ : బతుకమ్మ పండుగ అంటే మహిళలందరూ సంతోషంగా, ప్రకృతితో మమేకమై జరుపుకునే అద్భుతమైన పండుగ. తెలంగాణ కల్చర్, ఆచారాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం అశ్వీయుజ మాసంలో శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య తిథి నుంచి ఎంగిలి పూల బతుకమ్మ ఈ పండుగ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 22వ తేదీ వరకు ఈ బతుకమ్మ వేడుకలను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. చివరి రోజున సద్దుల బతుకమ్మతో ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
ఆడపడుచుల పండుగ :
బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఆడబిడ్డలకు ఎంతో సంతోషం కలుగుతుంది. చరిత్రను పరిశీలిస్తే.. ఇది మొదటగా జానపదుల పండుగగా ప్రారంభమైంది. ఆ తర్వాత అది గ్రామాలకు, అనంతరం నగరాలకు వ్యాపించింది. ఇప్పుడైతే ఏకంగా మన దేశంతో పాటు విదేశాల్లో సైతం బతుకమ్మ వేడుకలను జరుపుకుంటున్నారు. బతుకమ్మ అంటే ఆడపడుచు. అందుకే బతుకమ్మను ప్రతి ఒక్క ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. బతుకమ్మ పండుగ అంటే ఆటలు, పాటలు, రరకరాల పూలు వాటిలో ఎన్నో అర్థాలుంటాయి.
Also Read : బతుకమ్మ పేర్చడం బౌద్దులు నేర్పించారా.
తొమ్మిది రోజులు..9 రకాల పూలు :
అక్టోబర్ 14వ తేదీ భాద్రపద అమావాస్య లేదా మహాలయ అమావాస్య రోజున అంటే బతుకమ్మ వేడుకల్లో తొలి రోజున ఎంగిలిపూలతో వేడుకలు జరుపుకుంటారు. అక్టోబర్ 15న ఆదివారం నాడు అటుకుల బతుకమ్మ, అక్టోబర్ 16న సోమవారం నాడు ముద్దపప్పు బతుకమ్మ, అక్టోబర్ 17న మంగళవారం రోజు నానే బియ్యం బతుకమ్మ, అక్టోబర్ 18న బుధవారం రోజున అట్ల బతుకమ్మ, అక్టోబర్ 19న ఆరో రోజు గురువారం నాడు అలిగిన బతుకమ్మ, అక్టోబర్ 20న ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, అక్టోబర్ 21న శుక్రవారం రోజున వెన్నముద్దల బతుకమ్మ, అక్టోబర్ 22న సద్దుల బతుకమ్మతో ఈ పండుగ ముగుస్తుంది. ఈరోజున సాధారణ రోజుల కంటే ఎక్కువగా తయారు చేసి నీళ్లలో నిమజ్జనం చేస్తారు. ఇదే రోజున నవరాత్రుల్లో భాగంగా దుర్గాష్టమి పండుగను జరుపుకుంటారు.
బతుకమ్మ కథలు..!
పూర్వ కాలంలో ఓ జంటకు ఎంత మంది సంతానం కలిగితే వారంతా చనిపోతూనే ఉంటారు. దీంతో వారు తమ పిల్లల కోసం పార్వతీ దేవిని ఆరాధించారు. అప్పుడు ఆ తల్లి ఆశీస్సులతో ఓ ఆడబిడ్డ పుట్టింది. ఆమెను వారు బతుకమ్మా అని ఆశీర్వదించి తనకు బతుకమ్మ అని పేరు పెట్టారు. అప్పటివరకు ఎందరో పిల్లలు పుట్టి మరణించగా.. బతుకమ్మా అని ఆశీర్వదించడంతో తను బతికింది. అందుకే తనకు బతుకమ్మ అని పేరు పెట్టారు.