చట్టబద్ధమైన డిమాండ్‌ లేవనెత్తితే సస్పెండ్‌ చేస్తారా.?

చట్టబద్ధమైన డిమాండ్‌ లేవనెత్తితే సస్పెండ్‌ చేస్తారా.?

0
TMedia (Telugu News) :

చట్టబద్ధమైన డిమాండ్‌ లేవనెత్తితే సస్పెండ్‌ చేస్తారా.?

– కాంగ్రెస్‌ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ

టీ మీడియా, డిసెంబర్ 20, న్యూఢిల్లీ : చట్టబద్ధమైన డిమాండ్‌ లేవనెత్తినందుకు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఊపిరి ఆడకుండా చేస్తోందని కాంగ్రెస్‌ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ విమర్శించారు. బుధవారం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో 141 మంది ప్రతిపక్ష ఎంపిల సస్పెన్షన్‌పై ఆమె స్పందించారు. మునుపెన్నడూ పార్లమెంట్‌ నుంచి ఈ స్థాయిలో ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేయలేదని అన్నారు. అది కూడా సహేతుకమైన, చట్టబద్ధమైన డిమాండ్‌ను లేవనెత్తినందుకు సభ్యులపై వేటు వేశారని ధ్వజమెత్తారు. డిసెంబర్‌ 13 నాటి అసాధారణ ఘటనపై పార్లమెంటులో హోం మంత్రి ప్రకటన చేయాలని మాత్రమే ప్రతిపక్ష ఎంపిలు కోరారని, ఈ అభ్యర్థనపై కేంద్రం ఎంత అహంకార పూరితంగా వ్యవహరించిందో చెప్పేందుకు మాటలు లేవని అన్నారు. జమ్మూకాశ్మీర్‌కు సంబంధించి కొన్ని కీలక బిల్లులకు ఈ పార్లమెంట్‌ సెషన్‌లో ఆమోదం లభించాయని సోనియా గాంధీ గుర్తుచేశారు. జవహర్‌లాల్‌ నెహ్రూ వంటి దేశభక్తులను కించపరిచేందుకు కొంతమంది చరిత్రను వక్రీకరించి, చారిత్రక వాస్తవాలను కప్పిపెడుతూ నిరంతర దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. వారిలో ప్రధాని, హోంమంత్రి ముందుంటున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి చర్యలకు బెదరబోమని.. నిజం చెప్పేందుకు నిరంతర పట్టుదలతో కృషి చేస్తామని అన్నారు. జమ్ముకాశ్మీర్‌పై తమ వైఖరి స్పష్టంగా ఉందని, పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని, వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. లడఖ్‌ ప్రజల ఆకాంక్షలు ముఖ్యమని, వాటిని పరిష్కరించాలని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమిపై సమీక్ష నిర్వహించామని అన్నారు. ప్రస్తుతం పార్టీ అనేక కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటోందని, అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు.

Also Read : ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ఖ‌ర్గేను ప్ర‌పోజ్ చేశా.. కేజ్రీవాల్ స‌పోర్ట్ ఇచ్చారు

డిసెంబర్‌ 13న పార్లమెంటులో జరిగిన ఘటన క్షమించరానిదని, దానిని ఎవరూ సమర్థించలేరని అన్నారు. అయితే, దీనిపై స్పందించడానికి ప్రధాని మోడీకి నాలుగు రోజుల సమయం పట్టిందని విమర్శించారు. అది కూడా ఇంత గంభీరమైన విషయంపై ఆయన తన అభిప్రాయాలను పార్లమెంటు వెలుపల వ్యక్తం చేశారని తెలిపారు. ఇది సభను అపహాస్యం చేయడమేనని ధ్వజమెత్తారు. దేశ ప్రజల పట్ల ఆయన నిర్లక్ష్యపూరిత వైఖరికి ఇది నిదర్శమని విమర్శించారు. పార్లమెంటులో సోమవారం రికార్డు స్థాయిలో 78 మంది లోక్‌సభ సభ్యులు సస్పెండ్‌ కాగా మంగళవారం మరో 49 మందిని సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం నుంచి ఇప్పటి వరకు మొత్తం 141 మంది సస్పెండయ్యారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube