అద్భుత శిల్ప‌క‌ళ‌ల‌ దివ్యక్షేత్రం యాదాద్రి

-4.33 ఎకరాల్లో ఆలయ పునర్ నిర్మాణం

0
TMedia (Telugu News) :

అద్భుత శిల్ప‌క‌ళ‌ల‌ దివ్యక్షేత్రం యాదాద్రి

-4.33 ఎకరాల్లో ఆలయ పునర్ నిర్మాణం

-సిమెంట్ వాడ‌కుండానే నిర్మాణం

లహరి, పిభ్రవరి 20,యాదగిరిగుట్ట : శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని సీఎం కేసీఆర్ తిరుమల తిరుపతి తరహాలో దేశంలోనే అద్భుత దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో రూ.1200కోట్లతో ఆలయ పునర్నిర్మాణ పనులు జరిపించారు. యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటిడిఏ) ఆధ్వర్యంలో స్వామివారు కొలువైన యాదగిరిగుట్ట సహా చుట్టూ ఉన్న నవగిరుల అభివృద్ధి పనులు 2039ఎకరాలలో చేపట్టి ముందుగా స్వామి వారి ప్రధానాలయ నిర్మాణం పూర్తి చేసి 2022 మార్చి 28న పున ప్రారంభించారు.2014 అక్టోబర్ 17న సీఎం హోదాలో తొలిసారి కేసీఆర్, శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామితో కలిసి యాదగిరిగుట్ట ఆలయం సందర్శించి పునర్ నిర్మాణ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. 2015 మే 30న ఆలయ పునర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

చిన్న జీయర్ స్వామి సూచనతో సీఎం కేసీఆర్ అప్పట్లో యాదగిరిగుట్టకు యాదాద్రిగా నామకరణం చేసినప్పటికీ పునర్ నిర్మిత ఆలయం ప్రారంభోత్సవం పిదప తిరిగి యాదగిరిగుట్ట పేరునే పునరుద్ధరించారు.ప్రధానాలయం 2.33 ఎకరాల్లో నిర్మించగా, ప్రాకారాలు మాడవీధులతో కలిపి కొండపైన 4.33 ఎకరాల్లో అద్భుత శిల్పకళా సంపదతో ఆలయం పునర్ నిర్మాణం పూర్తయింది. స్వామి వారి రథశాల, మాడవీధులు ఏర్పాటు చేశారు. ఆలయ పనుల పర్యవేక్షణకు సీఎం కేసీఆర్ ఇప్పటివరకు 22 సార్లు యాదగిరిగుట్టను సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా గురిజేపల్లి, గుంటూరు జిల్లా కమ్మవారిపాలెం నుండి మేలు జాతి కృష్ణ శిలలను ప్రధానాలయం నిర్మాణంలో 2.5 లక్షల టన్నుల వరకు వినియోగించారు.అష్టభుజ మండపాలతో త్రితల, పంచతల సప్త రాజ గోపురాలతో ఆగమశాస్త్ర వాస్తు పద్ధతులతో అద్భుత శిల్పకళలతో ప్రధానాలయాన్ని నిర్మించారు. ప్రధాన స్థపతి సుందర రాజన్ , స్థపతి వేలు, ఆర్కిటెక్ట్ ఆనంద సాయిల బృందం 2500 మంది శిల్పులతో అహర్నిశలు పనిచేసి యాదాద్రి ప్రధానాలయం నిర్మాణం పూర్తి చేశారు.ముఖ మండపాలు, ఆళ్వార్ల విగ్రహాలు కాకతీయ శైలిలో, విమాన గోపురం ద్రావిడ శిల్పకళతో, అష్టభుజ మండపం పల్లవనిర్మాణ రీతిలో శిల్పులు తీర్చిదిద్దారు. రెండు ప్రాకారాల్లో ప్రధాన ఆలయం నిర్మించగా లోపలి మండపాల్లో 58 సింహ ముఖ యాలీ స్తంభాలు, తిరు మాడవీధుల వైపు 158 యాలీ స్తంభాలు ఏర్పాటు చేశారు. ప్రవేశ ద్వారానికి దక్షిణ దిశలో రాతిగుహ పై వెండి పలకలతో ప్రహ్లాద చరిత్రను, లోపలి వైపు ప్రాకారంలో యాలీ నిర్మాణాలను శిల్పులు అద్భుతంగా చెక్కారు.పల్లవ శిల్పకళారీతలతో ఏనుగులను, కాకతీయ చాళుక్య శైలులతో స్తంభాలను, హోయసాల రీతులతో ఉప పీఠాలను రూపుదిద్దారు. ఆలయ నిర్మాణంలో నాలుగు పలకలతో కూడిన బ్రహ్మకాంతం, 8 పలకలతో విష్ణుకాంతం, వృత్తాకారంలో రుద్రకాంతం అను మూడు రకాలుగా స్తంభాలను చెక్కారు. సింహ ఆకారంతో ఏనుగు తొండం ఉన్న శిల్పాకృతితో కూడిన యాలి స్తంభాలు మరింత ప్రత్యేకము. యాలీ స్తంభంలో విగ్రహ స్థానం, నాగబంధం, అష్టపటం, చతురస్సం విభాగాలతో శిల్పాలు చెక్కారు.ప్రథమ ప్రాకారంలో విష్ణుకాంత స్తంభాలు ఎక్కువగా ఉంటే, ద్వితీయ ప్రాకారం లో యాలీ స్తంభాలు కనువిందు చేస్తాయి. బయటి ప్రాకారంలో 28 అష్టభుజ మండపాల్లో 158 చిత్రకంఠ స్తంభాలను, బాలపాద స్తంభాలను నిర్మించారు. బాల పాదం స్తంభం కింద సింహం నోట్లో రాతిగుండు ఉండేలా సింహం ప్రతిమలను చెక్కారు .పంచతల రాజగోపురం లోపల రుద్రకాంత స్తంభాలను పొందుపరచగా, ఏడంతస్తుల రాజగోపురం లోపల చిత్రకంఠ స్తంభాలు అమర్చారు. స్తంభాలు, ప్రాకారాలపై, మండపాలపై పద్మాలని, పత్రాలని, పక్షుల్ని, దశావతారాల శిల్పాలను, పురాణ గాధలను, ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్రతో కూడిన శిల్పాలను, ఆధునిక కాలం నాటి క్రీడలు, కరెన్సీ, వాహనాల శిల్పాలను శిల్పులు నైపుణ్యంతో చెక్కారు.కృష్ణ శిలతో దశావతారాలు, ఆళ్వార్లు, అష్టదిక్పాలకులు, విష్ణువు, 108 క్షేత్రాలు నరసింహ ప్రతిమలతో కూడిన 243 విగ్రహాలు కనువిందు చేస్తాయి.

Also Read : రికార్డు స్థాయిలో కోటప్పకొండ తిరునాళ్లు హుండీలు..

ప్రధాన ఆలయంలో ఉన్న మహా మహా ముఖ మండపం లోని స్తంభాలకు కాకతీయుల కళాకృతులతో కూడిన ఆళ్వార్ల విగ్రహాలను తీర్చిదిద్దారు. 12 స్తంభాల ముందు వైపున 12 మంది ఆళ్వార్ల విగ్రహాలను ఏర్పాటు చేశారు. పై అంతస్తులో కాకతీయుల శైలిలో చెక్కిన బ్రహ్మ కాంత స్తంభాలపై గజ సింహ పులి అశ్వవాహనాలతో కూడిన యుద్ధ సన్నివేశాల శిల్పాలు చెక్కారు.కృష్ణ శిలతో నిర్మితమైన ఆలయం 1000 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండనుంది. కాలం గడిచే కొద్దీ కృష్ణశిల రాయి మరింత నిగారింపు దృఢత్వం సంతరించుకుంటుంది. యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణంలో ఎక్కడా సిమెంటు వాడలేదు. ప్రాచీన ఆలయ నిర్మాణాల్లో మాదిరిగా గానుగ(డంగు) సున్నం కరక్కాయ బెల్లం మిశ్రమాన్ని వినియోగించారు. పెద్ద జాయింట్లలో సీసం వాడారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube