పసుపు రైతు పరేషాన్‌!

-ఎంఎస్‌పి రూ.6,850

0
TMedia (Telugu News) :

టీ మీడియా,మార్చి 10,కృష్ణా : పసుపు ధర దారుణం

 పసుపు రైతు పరేషాన్‌!

-ఎంఎస్‌పి రూ.6,850

-మార్కెట్‌ ధర రూ.4,500 నుంచి రూ.5 వేలు

టీ మీడియా,మార్చి 10,కృష్ణా : పసుపు ధర దారుణంగా పతనమైంది. క్వింటాలు పసుపునకు ప్రభుత్వం రూ.6,850గా కనీస మద్దతు ధరగా 2020లో నిర్ణయించింది. కానీ, మార్కెట్లో ధర రూ.4,500కు దిగజారింది. ధర పెరిగే వరకు నిల్వ చేసుకోవడానికి అవకాశం లేనంతగా ఇటీవల కాలంలో ఎసి గోదాముల అద్దెలు పెరిగిపోయాయి. గతంలో ఏడాదికి క్వింటాలు ఒక్కంటికీ రూ.100 అద్దె ఉండేది. అది కాస్తా ఇప్పుడు రూ.300కు పెరిగింది. ఈ నేపథ్యంలో పసుపు సేకరణపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటనా చేయకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
పెరిగిన దిగుబడి… పతనమైన ధర
కృష్ణా జిల్లాలోని 11 మండలాల్లో 4,450 ఎకరాల్లో ఈ ఏడాది రైతులు పసుపు పంటను సాగు చేశారు. గతేడాది జూన్‌ రెండో వారంలో విత్తిన పసుపు ఈ ఏడాది మార్చి మొదటి వారంలో చేతికందుతోంది. వర్షాలు తక్కువగా ఉండడంతో గత మూడేళ్ల కన్నా దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. ఎకరానికి 25 క్వింటాళ్లు (2.5 టన్నులు) దిగుబడి వస్తోంది. ఈ క్రమంలో మార్కెట్లో ధరలు దిగజారడంతో గత నష్టాలను పూడ్చుకోవచ్చనుకున్న రైతులను తీవ్రంగా నిరాశపరిచింది. మద్దతు ధర కన్నా క్వింటాలుకు రూ.2,350 వరకు ధర తగ్గడంతో పెట్టుబడులు కూడా రావని వాపోతున్నారు. పసుపు విస్తీర్ణంలో 80 శాతం కౌలు రైతులే సాగు చేస్తున్నారు. ఎకరాకు ఎనిమిది క్వింటాళ్లు కౌలు చెల్లిస్తున్నారు.

Also Read : తేజస్వియాదవ్‌ నివాసంలో ఈడి సోదాలు

మరోవైపు ఎకరానికి రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి అవుతోంది. ఈ పరిస్థితుల్లో రెక్కల కష్టం కూడా చేతికిరాదని కౌలు రైతులు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్లో ధరలు దిగజారిన పరిస్థితుల్లో ప్రభుత్వం మార్కెట్‌ యార్డుల ద్వారా పసుపు పంటను సేకరించాల్సి ఉంది. రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా చూడాలి. ఈ నెలతోపాటు ఏప్రిల్‌, మేలోనూ రైతులు పసుపు పంటను ఎక్కువగా విక్రయిస్తారు. ప్రస్తుతం మార్చి రెండో వారంలోకి ప్రవేశించినా ఇప్పటి వరకు పసుపు సేకరణపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటనా చేయలేదు. బహిరంగ మార్కెట్లో వ్యాపారులకు అమ్ముకుని నష్టపోకముందే మార్కెట్‌ యార్డుల ద్వారా పసుపు సేకరణ ప్రారంభించి మద్దతు ధర అందించాలని రైతులు కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube