khammam

కోట మైసమ్మ జాతరలో సౌకర్యాలు గాలికి!

పారిశుధ్యం పడకేసింది.. పరిసరాల్లో దుర్వాసన!

By ·

Share this article
కోట మైసమ్మ జాతరలో సౌకర్యాలు గాలికి!

కోట మైసమ్మ జాతరలో సౌకర్యాలు గాలికి!

 

పారిశుధ్యం పడకేసింది.. పరిసరాల్లో దుర్వాసన!

 

వసూళ్లపై ఆరోపణలు.. భక్తుల సౌకర్యాలపై నిర్లక్ష్యమా?

 

 

టీ మీడియా |,అక్టోబర్ 21, సింగరేణి (కారేపల్లి):ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ కోట మైసమ్మ అమ్మవారి జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అయితే జాతరలో భక్తులకు అవసరమైన కనీస సౌకర్యాల నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పారిశుధ్యం, తాగునీరు, మరుగుదొడ్లు, మురుగునీటి పారుదల వంటి మౌలిక వసతుల కల్పనలో దేవాదాయ శాఖ అధికారులు తగిన శ్రద్ధ చూపడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు.

 

 

వసూళ్లు జోరు.. సౌకర్యాలు బేజారు!

జాతరకు వచ్చే వాహనాలకు పూజల పేరుతో నిర్ణీత రుసుము కంటే అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సామాన్య భక్తుల నుంచి రుసుముల వసూళ్లపై చూపుతున్న శ్రద్ధను కనీస సౌకర్యాల కల్పనలోనూ చూపాలని భక్తులు కోరుతున్నారు. వాహన పూజలకు అధికారికంగా నిర్ణయించిన రుసుము ఎంత? ప్రస్తుతం ఎంత వసూలు చేస్తున్నారు? అధిక వసూళ్ల ఆరోపణల్లో వాస్తవమెంత? అనే అంశాలపై దేవాదాయ శాఖ అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

 

 

పారిశుధ్యం ఎక్కడ.. పరిశుభ్రతకు దిక్కేది?

భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే జాతరలో పారిశుధ్య నిర్వహణ అత్యంత కీలకం. అయితే జాతర పరిసరాల్లో పరిశుభ్రత లోపిస్తోందని, చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించడం లేదని భక్తులు వాపోతున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక పారిశుధ్య బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం శుభ్రత చర్యలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

ఇంకుడు గుంతలేవి.. మురుగునీరు వెళ్లేదెక్కడ?

మురుగునీటి నిర్వహణకు తగిన ఏర్పాట్లు లేకపోవడంతో జాతర పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మరుగుదొడ్ల వినియోగం పెరిగే సమయంలో మురుగునీటి పారుదలకు ముందస్తు ఏర్పాట్లు చేయకపోతే దుర్వాసనతోపాటు పారిశుధ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలు బహిరంగ మరుగుదొడ్లను తలపిస్తున్నాయని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

 

దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణ ఏది?

జాతర ప్రారంభానికి ముందే భక్తుల రాకపోకలను అంచనా వేసి తాగునీరు, పారిశుధ్యం, మరుగుదొడ్లు, మురుగునీటి పారుదల వంటి అంశాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది. ఏర్పాట్లు చేశామని చెప్పడం మాత్రమే కాకుండా, అవి సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్నది నిరంతరం పర్యవేక్షించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది.

 

 

 

అయితే జాతర పరిసరాల్లో సమస్యలు ఉన్నాయంటూ భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటిని వెంటనే పరిష్కరించే పర్యవేక్షణ వ్యవస్థ ఏమైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘వసూళ్లకు లెక్క ఉంది.. భక్తుల సౌకర్యాలకు లెక్క లేదా?’ అనే ప్రశ్న భక్తుల నుంచి వినిపిస్తోంది.

 

ఇప్పటికైనా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు జాతర ప్రాంగణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, అధిక వసూళ్ల ఆరోపణలపై విచారణ జరపాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. అదే సమయంలో పారిశుధ్యం, తాగునీరు, మరుగుదొడ్లు, మురుగునీటి నిర్వహణలోని లోపాలను యుద్ధప్రాతిపదికన సరిచేసి, జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.