khammam

పోలీసు అమరుల సేవలు చిరస్మరణీయం

-జిల్లా కలెక్టర్ ., పోలీస్ కమిషనర్ 

By ·

Share this article
పోలీసు అమరుల సేవలు చిరస్మరణీయం

పోలీసు అమరుల సేవలు చిరస్మరణీయం

-జిల్లా కలెక్టర్ ., పోలీస్ కమిషనర్ 

 

 

 

టీ మీడియా, అక్టోబర్ 21, ఖమ్మం:ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వర్తించిన పోలీసు అమరవీరుల త్యాగాల ఫలితమే నేడు సమాజంలో కనిపిస్తున్న శాంతి, సౌభ్రాతృత్వమని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా బుధవారం ఖమ్మం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.

 

 

స్మారక స్థూపం వద్ద ఘన నివాళులు

జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. తొలుత పోలీసు సాయుధ బలగాలు పరేడ్ నిర్వహించి గార్డ్ ఆఫ్ హానర్ సమర్పించాయి. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గార్డ్ ఆఫ్ హానర్ పరేడ్‌కు ఆర్‌ఐ శ్రీశైలం ఇన్‌చార్జిగా వ్యవహరించారు.

 


శాంతిభద్రతల పరిరక్షణలోకీలక పాత్ర

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ, దేశ రక్షణలో సైన్యం, ప్రజల శ్రేయస్సు కోసం పోలీసు శాఖ ప్రదర్శిస్తున్న నిబద్ధత, అంకితభావం, త్యాగాలు సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు పునాదిగా నిలుస్తున్నాయని అన్నారు. జిల్లా పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న సమయంలో ప్రజలకు రక్షణ, భద్రత, భరోసా కల్పిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి కుటుంబ సభ్యులు అందిస్తున్న సహకారం, వారు చేస్తున్న త్యాగాలను కూడా సమాజం గుర్తించాలని అన్నారు. పోలీసుల విధి నిర్వహణ వెనుక కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సహకారం ఎంతో విలువైనవని తెలిపారు.

 

 


అమరవీరుల త్యాగాలు పోలీసులకు స్ఫూర్తి: సీపీ

పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా బలగాల దాడిలో 10 మంది భారతీయ పోలీసులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. వారి అసమాన త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.తెలంగాణలో గతంలో తీవ్రవాదం కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ప్రజలు భయాందోళనల మధ్య జీవించాల్సిన పరిస్థితులు ఉండేవని గుర్తుచేశారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోలీసులు చేసిన కృషి, త్యాగాల ఫలితంగా నేడు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొందని పేర్కొన్నారు.

 

 

 

పోలీసు అధికారులు, అమరుల కుటుంబ సభ్యుల హాజరు

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏఆర్ డీసీపీలు కుమారస్వామి, విజయబాబు, ఏఆర్ ఏసీపీలు సుశీల్ సింగ్, నర్సయ్య, ఏసీపీలు రమణమూర్తి, మహేష్, సాంబరాజు, నర్సింహారావు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు హేమనాధ్, పలువురు సీఐలు, ఆర్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.