పాఠశాల విద్యాశాఖలో ఇంటర్ విలీనం
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో బిల్లు!
టీమీడియా , నవంబర్ 17, హైదరాబాద్ బ్యూరో : పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ బోర్డు, ఇంటర్మీడియట్ విద్యా శాఖలను విలీనం చేసే ప్రక్రియపై వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఒక బిల్లును ప్రవేశపెట్టి కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై మరో 15 రోజుల్లో ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తామని విద్యా వర్గాలు స్పష్టం చేశాయి. సీనియర్ సెకండరీ వ్యవస్థను (9వ-12వ తరగతి) వచ్చే విద్యా సంవత్సరం (2027-28) నుంచి అమలు చేయనున్నారు.
2029-30 విద్యా సంవత్సరం నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలను సమీకృత పాఠశాలలుగా మార్చనున్నారు. చాలా మంది బాలికలు పదవ తరగతి తర్వాత చదువు మానేస్తుండటంతో రాష్ట్రంలో 17.90% మంది బాలికలు 18 ఏళ్ల లోపే వివాహం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల్లోనే నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను అందిస్తే ఈ సమస్యలకు పరిష్కారం చూపవచ్చని ప్రభుత్వం పేర్కొంటోంది.
సీనియర్ సెకండరీ బోర్డు ఏర్పాటు
ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసి సీనియర్ సెకండరీ బోర్డును ఏర్పాటు చేస్తారు. దీనికి ఒక ఐఏఎస్ అధికారి కార్యదర్శిగా ఉంటారు. ఆ బోర్డు పరిధిలో పదోతరగతికి పరీక్షలను చూసుకునేందుకు విభాగం-1ను, 11, 12 తరగతుల పరీక్షలకు విభాగం-2 ఏర్పాటు చేస్తారు. అకడమిక్ విభాగం అనుబంధ గుర్తింపు జారీ చేయడం తదితర ప్రక్రియలను చేపడతారు.
ఆరు దశల్లో ప్రక్రియ పూర్తి
మొత్తం విలీన ప్రక్రియకు ఆరు దశలు ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసింది.రెండు శాఖల చట్టాలను ఒకే చట్టంగా మార్చడంస్వయంప్రతిపత్తి గల సీనియర్ సెకండరీ బోర్డును ఏర్పాటు చేయడంసీనియర్ సెకండరీ పాఠశాలల బడ్జెట్ ఇతర ఆర్థిక అవసరాల కోసం డీడీఏ కోడ్‌లను మార్చడంఇంటర్ విద్యా శాఖకు చెందిన డీఐఈఓలను డీఈవో పరిధిలోకి తీసుకురావడంప్రభుత్వ కళాశాలల్లో రెండు దశల్లో పాఠశాల తరగతులను ప్రారంభించడంప్రైవేట్ జూనియర్ కళాశాలలకు మూడేళ్లలో 8-10 తరగతుల వరకు ప్రారంభించే అవకాశం కల్పించడం
సీనియర్ సెకండరీ పాఠశాలలుగా మార్పు
ప్రస్తుతం రాష్ట్రంలోని 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఇంటర్మీడియట్ విద్యా శాఖ పరిధిలో ఉన్నాయి. వాటిని సీనియర్ సెకండరీ పాఠశాలలుగా మార్చనున్నారు. తొలి దశలో, వచ్చే విద్యా సంవత్సరం (2027-28)లో 96 జూనియర్ కళాశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (టీజీపీఎస్)గా అప్గ్రేడ్ చేయనున్నారు.
రెండో దశలో 2028-29, 2029-30 విద్యా సంవత్సరాల నాటికి ట్విన్ క్యాంపస్ మోడల్ (రెండు ప్రాంగణాలు) విధానంలో నడిపిస్తారు. ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను మ్యాపింగ్ చేస్తారు. ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి వరకు చదివిన విద్యార్థులను సమీపంలోని కళాశాలలో 11వ తరగతిలో చేరేలా చూస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత పాఠశాలలకు కిలోమీటరు పరిధిలో 260 జూనియర్ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి.
శాసనసభలో చట్టం
ప్రస్తుతం పాఠశాల విద్యా శాఖకు తెలంగాణ విద్యా చట్టం-1982, ఇంటర్మీడియెట్ విద్యా శాఖకు ఇంటర్మీడియట్ విద్యా చట్టం-1971 ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి ఒకే చట్టంగా చేయడానికి పాఠశాల విద్యా చట్టాన్ని సవరించి, ఇంటర్మీడియెట్ విద్యా చట్టాన్ని రద్దు చేయాలి. దీనికోసం శాసనసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందాల్సి ఉంటుంది.






