ఐదేళ్ల పాటు ఎల్‌నినో ప్రభావం!
కుటుంబాలు ఆర్థికంగా కుదేలయ్యే అవకాశం!!
టీ మీడియా,నవంబర్14, హైదరాబాద్ బ్యూరో : ఎల్‌నినో ప్రభావంతో తగ్గిన ఉత్పాదకత, ద్రవ్యోల్బణం తదితర కారణాలతో రానున్న ఐదేళ్లలో జీడీపీ 1.8 నుంచి 2 శాతం వరకు క్షీణించొచ్చని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ అధ్యయనం వెల్లడించింది. ఈ మేరకు ఎల్‌నినో ప్రభావం, దాని ద్వారా సంభవించే ఆర్థిక నష్టాల అంచనాలపై 'బలమైన ఎల్‌నినో - చెరిగిపోని నష్టాలు' పేరిట తన అధ్యయన నివేదికను విడుదల చేసింది. ఈ ఎల్‌నినో గతంలో ఏర్పడిన వాటి కన్నా అధిక నష్టాలను కలిగించనుందని నివేదికలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సంభవించే నష్టాల్లో మూడింట రెండొంతుల భారం భారత్, చైనా, పాకిస్థాన్‌తో పాటు ఇతర ఆగ్నేయాసియా దేశాలపైనే పడనుందని తెలిపింది.
అతిపెద్ద విపత్తుగా నిలిచిపోవచ్చు
ఎల్‌నినో ప్రభావం పేద, గ్రామీణ కుటుంబాలపై తీవ్రంగా ఉంటుందని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ తెలిపింది. ఉపాధి అవకాశాలు, పెట్టుబడుల కొరతతో ఆస్తులను అమ్ముకోవాల్సిన ప్రమాదముందని హెచ్చరించింది. నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం అప్పటి వరకు దాచిన పొదుపు సైతం ఖర్చు చేయడంతో కుటుంబాలు ఆర్థికంగా కుదేలయ్యే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడిన కుటుంబాలు ఎక్కువగా నష్టపోతాయని, కరవు ప్రభావిత ప్రాంతాల్లోని కార్మికుల ఆదాయం తగ్గే అవకాశం ఉందని వివరించింది. ప్రభావిత దేశాల్లో ఉత్పాదకత గణనీయంగా తగ్గుతుందని, దీంతో గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే అతి పెద్ద విపత్తుగా నిలిచిపోనుందని ఆక్స్‌ఫర్డ్ పేర్కొంది.
నివేదికలో పేర్కొన్న మరిన్ని ముఖ్యాంశాలివే
తీవ్రమైన వేడి పంట దిగుబడులను తగ్గిస్తుండగా, వరదలు మూలధనాన్ని నాశనం చేస్తున్నాయి. దీంతో ఈ రెండు ప్రభావిత ప్రాంతాల్లో ఆహార ధరలు గణనీయంగా పెరగనున్నాయి.
ప్రపంచ జీడీపీ 2027 నాటికి 0.6 శాతం, 2028 నాటికి 0.8 శాతం మేర తగ్గొచ్చు.
ఆహార ధరల ద్రవ్యోల్బణంపై ఆధారపడే వ్యవస్థలు ఎక్కువగా నష్టపోతాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఎల్‌నినో ప్రభావం రానున్న 5 సంవత్సరాల పాటు కొనసాగుతుంది.
ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో నష్టాలు పెరిగే కొద్దీ వినియోగదారులు మరింత జాగ్రత్త వహిస్తారు. దీంతో వచ్చే సంవత్సరం ప్రపంచ ఉత్పత్తి నష్టంలో సగం వరకు ఇవే ప్రధాన కారణాలవుతాయి.
గతంలో సంభవించిన ఎల్నినోలు ప్రపంచ జీడీపీని 1 శాతం మేర తగ్గించినట్లు అంచనాలున్నాయి.
వేడి వాతావరణం కారణంగా కార్మికుల పని గంటలు తగ్గి, ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం పడనుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు 9 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. 2028 ప్రారంభం నాటికి ధరల పెరుగుదల గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చు.
2026 నుంచి 2031 మధ్య కాలంలో స్థూలంగా 4 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
ఇక ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో అధిక ధరలు, వ్యాపార అనిశ్చితి వంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ కోవలోకి వచ్చే దేశాలు కొన్నేళ్లలోనే నిలదొక్కుకోగలవు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలపై మాత్రం ఈ ప్రభావం చాలా ఏళ్లపాటు కొనసాగుతుంది.






