పెయింట్ షాపులో భారీ అగ్ని ప్రమాదం..
మూడు భవనాలకు వ్యాపించిన మంటలు!
టీ మీడియా,నవంబర్14, హైదరాబాద్ బ్యూరో : హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ హఫీజ్‌పేట్‌లో ఓ పెయింట్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. పెయింట్ షాపులో మంటలు వేగంగా వ్యాపించడంతో పక్కనే ఉన్న మరో రెండు భవనాలకు కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
పెయింట్ షాపులో మంటలు ఎగసిపడుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరకు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ అగ్నిప్రమాదంలో పెయింట్ షాపుతో పాటు పక్కనే ఉన్న రెండు భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రమాదం కారణంగా సుమారు కోటి రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊరట చెందారు.
మియాపూర్ పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందా? మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో విచారణ చేపట్టే అవకాశం ఉంది. అగ్నిప్రమాదంతో న్యూ హఫీజ్‌పేట్ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.






