ఉద్యోగుల వేతనం నుంచి కోత
ప్రభుత్వానికి చేరిన ఫైల్
టీ మీడియా,నవంబర్12, హైదరాబాద్ బ్యూరో : వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల వేతనం నుంచి కొంత మొత్తాన్ని వారి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయాలన్న చట్టం అమలు చేయడానికి సర్కారు సిద్ధమైంది. ప్రతి నెలా ఉద్యోగి మొత్తం వేతనంలో 15 శాతం లేదా రూ.10 వేలు ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని చెల్లించే కార్యక్రమం అమలు కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, తల్లిదండ్రుల సహాయ పర్యవేక్షణ చట్టం-2026ను ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే.
తాజాగా దీనిని అమలు చేయడానికి వయోవృద్ధుల సంక్షేమ శాఖ పలు రకాల నియమ నిబంధనలు రూపొందించి ఆమోదం కోసం దస్త్రాన్ని ప్రభుత్వానికి పంపించింది. కొత్త చట్టం కింద ఇప్పటికే రాష్ట్రంలో 5 ఫిర్యాదులు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి మూడు, కరీంనగర్, నిజామాబాద్‌ల నుంచి ఒక్కోటి చొప్పున ఉన్నాయన్నారు. నిబంధనల్లోని అంశాలు ఇలా ఉన్నాయి.
తమ సంతానం (కుమారుడు, కుమార్తె, దత్తత తీసుకున్నవారు) ప్రభుత్వ ఉద్యోగులై ఉండి తమను పట్టించుకోకుండా ఉంటే ఆయా తల్లిదండ్రులు ఆన్‌లైన్ లేదా నేరుగా సంబంధిత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక అథారిటీకి దరఖాస్తు సమర్పించాలి.
తాము జీవించేందుకు అవసరమైన ఆదాయ వనరులు లేవని తెలపడంతో పాటు అన్ని వనరుల నుంచి నెలకు అందుతున్న ఆదాయం, ఇప్పటి వరకు ఉద్యోగులైన సంతానం అందించిన సహాయానికి సంబంధించిన ఆధారాలను కూడా అందించాలి.
వివరణ కోసం నోటీసులు పంపుతారు
ఈ దరఖాస్తులు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టరు కార్యాలయం నుంచి రసీదు జారీ అవుతుంది. దరఖాస్తు వివరాలు సరైన విధానంలో ఉన్నట్లు ధ్రువీకరించిన 10 రోజుల్లో బాధ్యుడైన ఉద్యోగికి నోటీసులు పంపుతారు. నోటీసులతో పాటు తల్లిదండ్రులు ఇచ్చిన దరఖాస్తు, ఇతర ఆధార పత్రాల కాపీ అందులో జత చేస్తారు. అనంతరం జిల్లా అథారిటీ ఆ ఉద్యోగిని పిలిచి ఆ విషయానికి సంబంధించి వివరణ తీసుకుంటుంది. నోటీసులపై ఉద్యోగి గడువులోగా స్పందించకున్నా, విచారణకు రాకున్నా, వేతనం నుంచి కొంత మినహాయించి తల్లిదండ్రుల ఖాతాల్లో వేయాలని స్పీకింగ్ ఆదేశాలు వేగంగా జారీ చేస్తారు.
తల్లిదండ్రులు కూడా ఆ ఉద్యోగి విచారణ తేదీన హాజరుకావాలి. ఒకవేళ రాకపోతే వారికీ నోటీసు జారీ చేస్తారు. రెండోసారి హాజరుకాకుంటే జిల్లా కలెక్టరు వారి దరఖాస్తును వెంటనే తిరస్కరిస్తారు. అయితే అందుకు సరైన కారణం చూపితే రద్దు చేసిన దరఖాస్తును మళ్లీ విచారణను తిరిగి ప్రారంభిస్తారు.
విచారణ అనంతరం జిల్లా అథారిటీ ఇచ్చిన ఆదేశాలను 60 రోజుల్లోగా ఆయా ప్రభుత్వ విభాగాలు తప్పనిసరిగా అమలు చేయాలి. ఆర్డరు ఇచ్చిన తేదీ నుంచి ఉద్యోగి వేతనంలో 15 శాతం లేదా రూ.10 వేలు ఏది తక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని దరఖాస్తు చేసిన తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో ప్రతి నెలా జమ చేయాలని జిల్లా అథారిటీ ఆదేశిస్తుంది. తల్లిదండ్రులకు ఒకరికన్నా ఎక్కువ సంతానం ఉండి, వారిలో మరొకరు ప్రభుత్వ ఉద్యోగి అయితే తొలుత నోటీసు అందుకున్న వ్యక్తి అథారిటీకి ఆ విషయాన్ని తెలియజేయాలి. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులైన ఇద్దరికీ నోటీసులు జారీ అవుతాయి. అథారిటీ జారీ చేసే ఆదేశాలను ఇద్దరూ తూ.చ. తప్పకుండా పాటిస్తూ, పేర్కొన్న మొత్తాన్ని 50:50 నిష్పత్తిలో పంచుకుని భరించాలి.ఈ అథారిటీలు, కమిషన్లకు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. అథారిటీ, కమిషన్ ఇచ్చిన ఆదేశాలను యాజమాన్యాలు కచ్చితంగా పాటించాలి. లేకుంటే జరిమానాలు విధించే అవకాశాలు లేకపోలేదు.దరఖాస్తును జిల్లా అథారిటీ 60 రోజుల్లో పరిష్కరించకపోతే బాధిత తల్లిదండ్రులు రాష్ట్ర కమిషన్‌లో అప్పీలు చేసుకోవచ్చు. అప్పీలు చేసిన 60 రోజుల్లోగా ఆ దరఖాస్తును కమిషన్ వెంటనే పరిష్కరిస్తుంది.జిల్లా అథారిటీ ఇచ్చిన ఆదేశాలపైనా కమిషన్‌లో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోతే ఆయా ఆధారాలతో అథారిటీలో దరఖాస్తు చేస్తే బతికున్నవారికి ఆ వేతనం ప్రతి నెలా తప్పకుండా అందుతుంది.ఈ ఆదేశాలు అమలవుతున్న సమయంలో ఎప్పుడైనా తల్లిదండ్రులు తమ దరఖాస్తును వెనక్కి తీసుకునే అవకాశాన్ని కూడా నిబంధనల్లో చేర్చారు. ఈ కేసులను ఆరు నెలలకోసారి వయోవృద్ధుల కమిషన్ చీఫ్ కమిషనర్ ఆధ్వర్యంలోని కమిటీ నిశితంగా పరిశీలిస్తుంది.






