జల సంరక్షణ చర్యల దిశగా సర్కార్ అడుగులు - 6 నెలల ప్రత్యేక ప్రణాళిక సిద్ధం!
టీమీడియా , నవంబర్10 , హైదరాబాద్ బ్యూరో:వర్షాభావం, నీటి సంక్షోభం నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి భరోసా కల్పిస్తూనే జల సంరక్షణ చర్యలు చేపట్టే దిశగా సర్కార్ సిద్ధమవుతోంది. జనవరి నుంచి జూన్ వరకు 6 నెలల జల సంరక్షణ కార్యక్రమం చేపట్టి గ్రామాల్లో నీటి వనరుల పునరుద్ధరణకు కసరత్తు చేస్తోంది. వీబీజీరాంజీని ఉపయోగించుకోవడంతో పాటు అవసరమైన చోట అదనపు నిధులు వెచ్చించి పనులు చేపట్టనున్నారు. వర్షాలు వచ్చే నాటికి చెరువులు, ఫీడర్ ఛానెళ్లు, చెక్ డ్యాంలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసి నీటిని పూర్తిగా ఒడిసిపట్టాలని సర్కార్ భావిస్తోంది.
భూగర్భ జలాలపై ఎల్‌నినో ప్రభావం
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు మొహం చాటేయడంతో తెలంగాణలో వ్యవసాయం, జల వనరులు, గ్రామీణ ఉపాధిపై ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడంతో కృష్ణా, గోదావరి నదులతో పాటు వాటిపై ఉన్న జలాశయాల్లోకి ఆశించిన స్థాయిలో నీరు చేరలేదు. చెరువులు, కుంటలు నిండకపోవడంతో భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగింది. రోజురోజుకూ దిగువకు పడిపోతున్న నీటి మట్టాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే వర్షాకాల పంటకు నీటి ఇబ్బందులు ఎదురవుతుండగా, రెండో పంట ప్రశ్నార్థకంగా మారింది.
రైతులు ఆరుతడి పంటల వైపు మళ్లాలి
కృష్ణా, గోదావరి బేసిన్లలో ఆశించిన స్థాయిలో నీటి లభ్యత లేకపోవడంతో సాగునీటి అవసరాలను తీర్చడం సవాలుగా మారింది. జలాశయాల్లో ఉన్న కొద్దిపాటి నీటిని తాగునీటి అవసరాలకు జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చెరువులు, కుంటల్లో నీరు చేరకపోవడంతో వాటి ఆధారంగా సాగు చేసే రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
భూగర్భ జలాలపై ఆధారపడుతున్న ప్రాంతాల్లో బోర్లు అడుగంటుతున్నాయి. వరి సాగుకు నీటి లభ్యత కష్టంగా మారడంతో ఆరుతడి పంటల వైపు మళ్లాలని ప్రభుత్వం గతంలోనే రైతులకు సూచించింది. ఇప్పటికే పంట చివరి దశలో నీరు అందక ఎండిపోతున్న పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి.
రెండో పంట సాగు చాలా ప్రాంతాల్లో సాధ్యం కాకపోవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రెండో పంట సాగు తగ్గితే దాని ప్రభావం రైతులకే కాకుండా వ్యవసాయ కూలీలపైనా పడనుంది. వ్యవసాయ పనులు తగ్గి రైతు కూలీలకు ఉపాధి కరువయ్యే ప్రమాదం పొంచి ఉంది. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న కుటుంబాలకు వేసవి కాలంలో పని దొరకడం కష్టంగా మారవచ్చు. వర్షాభావ పరిస్థితులు కొనసాగితే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ఉపాధికి భరోసా కల్పిస్తూనే భవిష్యత్తు నీటి అవసరాలను తీర్చేలా జల సంరక్షణ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
జనవరి నుంచి జూన్ వరకు జల సంరక్షణ కార్యక్రమం
రైతు కూలీలకు స్థానికంగా ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో నీటి వనరులను పునరుద్ధరించేలా ప్రత్యేక కార్యాచరణకు రూపకల్పన చేస్తోంది. జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా జలసంరక్షణ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నాయి. వీబీజీ–రామ్‌జీ పథకాన్ని ఉపయోగించుకుంటూ జలసంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 60, 40 నిష్పత్తి నిధుల విధానాన్ని అనుసరిస్తూనే అవసరమైన చోట రాష్ట్ర ప్రభుత్వం అదనపు నిధులు సమకూర్చనుంది.
జల సంరక్షణ ద్వారా ఈ పనులు
ప్రతి గ్రామాన్ని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ నీటి వనరుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి నిల్వ లక్ష్యంగా పనులు చేపట్టనున్నారు. జలసంరక్షణ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే 355 రకాల పనులతో ప్రాథమిక జాబితాను సిద్ధం చేసినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈ పనులకు సంబంధించిన మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి. నెలాఖరు వరకు కార్యక్రమంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చెరువులు, కుంటలు, కాలువలు, చిన్న నీటి వనరుల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చిన్న నీటిపారుదల చెరువులు, గ్రామీణ కుంటల్లో పేరుకుపోయిన పూడిక తొలగింపుపై దృష్టి సారించనున్నారు. చెరువుల తూములు, గేట్ల మరమ్మతులు, పాడైన నిర్మాణాల పునరుద్ధరణ, కాలువల్లో పేరుకుపోయిన మట్టి, పిచ్చిమొక్కల తొలగింపు వంటి పనులు చేపట్టనున్నారు. వర్షపు నీరు వృథాగా వెళ్లకుండా అడ్డుకోవడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ఈ పనుల ప్రధాన లక్ష్యం. వాగులు, వంకలు, చిన్న నదులపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వర్షపు నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించి భూగర్భ జలాల పెరుగుదలకు అవకాశం కల్పించేలా వీటిని నిర్మించనున్నారు. ఇప్పటికే ఉన్న నీటిపారుదల వ్యవస్థలను సమర్థంగా వినియోగించుకునేందుకు ఫీల్డ్ ఛానళ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టనున్నారు. దీంతో అందుబాటులో ఉన్న నీటిని పొలాలకు సమర్థంగా చేరవేసే అవకాశం ఉంటుంది.
జల సంరక్షణతో రైతు కూలీలకు ఉపాధి కల్పించే అవకాశం
జలసంరక్షణ వ్యవస్థలను పునరుద్ధరించడం ద్వారా వర్షపు నీటిని ఒడిసిపట్టేలా చర్యలు తీసుకోనున్నారు. జలసంరక్షణలో రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాలు అనుసరిస్తున్న విజయవంతమైన విధానాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి నిల్వ, గ్రామీణ జలవనరుల పునరుద్ధరణకు చేపట్టిన కార్యక్రమాలను పరిశీలించనున్నారు.
రాష్ట్ర భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా విధానాలను అమలు చేసే అవకాశాలను అధికారులు అధ్యయనం చేయనున్నారు. వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయ పనులు తగ్గే సమయంలో జలసంరక్షణ పనులు రైతు కూలీలకు ఉపాధి కల్పించే అవకాశాన్ని అందించనున్నాయి. అదే సమయంలో చెరువులు, కుంటలు, కాలువల పునరుద్ధరణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నీటి లభ్యతను మెరుగుపరిచే అవకాశం ఉంటుంది. రానున్న వర్షాకాలం నాటికి ఈ పనులన్నింటినీ పూర్తి చేసి వానలు పడిన వెంటనే నీటిని ఒడిసి పట్టేలా సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.






