ఎర్రకాలువ కన్నెర్ర
నిండా మునిగిన కర్షకులు
టీ మీడియా,నవంబర్12, అమరావతి బ్యూరో : ఎర్రకాలువ ఉగ్రరూపానికి ఉభయగోదావరి జిల్లా రైతుల గుండె పగిలింది. సామర్థ్యానికి మూడింతలకుపైగా పోటెత్తిన ప్రవాహంతో ఎర్రకాలువకు ఏకంగా 35 చోట్ల గండ్లు పడ్డాయి. ఎల్‌నినో ప్రతికూల పరిస్థితుల్లోనూ అష్టకష్టాలు పడి సాగుచేసిన సుమారు 10 వేల హెక్టార్ల పంటలు నీటమునిగాయి. తుపాను వచ్చి వారం గడిచినా పొలాలు ఇంకా ముంపులోనే మగ్గుతున్నాయి. దశాబ్దాలుగా ఎర్రకాలువ కన్నెర్రకు కర్షకులు నష్టపోతూనే ఉన్నారు. ఎర్రకాలువ రైతుల ముంపు గోడుపై పరిశీలనాత్మక కథనం.
అర్నబ్, మురసు తుపాన్లు అన్నదాతలకు మిగిల్చిన నష్టమంతా ఓ ఎత్తైతే ఏలూరు జిల్లాలోని ఎర్రకాలువ మిగిల్చిన నష్టం ఒక్కటీ ఒకఎత్తు.! దానికి నిదర్శనమే చెరువుల్ని తలపిస్తున్న ఈ పొలాలు! కోతకు సిద్ధమైన వరిపైర్ల ఊపిరి తీసిందీ ఎర్రకాలువ. ఉప్పెనలా విరుచుకుపడి అన్నదాతల రెక్కల కష్టాన్ని నిండా ముంచింది. తుపాను శాంతించి వారం దాటినా వరి పైర్లు ముంపు నుంచి తేరుకోలేదంటే అదీ ఎర్రకాలువ రైతు గుండెకు చేసిన మానని గాయం.
ఎర్రకాలువ జలాలు వేలివెన్ను కాలువకు అందులోంచి నిడదవోలు-నరసాపురం కాలువ ద్వారా బ్రాంచ్ కెనాల్‌కు చేరి పోటెత్తింది. పెరవలి మండలంలోని ముక్కామల, ఖండవల్లి, ముత్యాలవారిపాలెంలో పొలంగట్లను ధ్వంసం చేసుకుంటూ వందల ఎకరాల్ని నీట ముంచింది. ముక్కామలలో ఎర్రకాలువ గట్లు ఎప్పుడో బలహీనపడ్డాయి. ఇలాంటిఉపద్రవమేదో ముంచుకొస్తుందని ముందే శంకించిన రైతులు గట్లు బలహీనంగా ఉన్న చోట కోతకు గరవకుండా ఇసుక బస్తాలు వేశారు. అలా ఊరిని కాపాడుతున్న రైతులు పంటల్ని మాత్రం దక్కించుకోలేక కుమిలిపోతున్నారు.
ముక్కాముల గట్టుపై ఉన్న 4 స్లూయిజ్‌లు శిథిలమయ్యాయి. నీళ్లు పొలాల్లోకి చేరకుండా తూముల వద్ద ఇసుక బస్తాలు వేసి కట్టడి చేస్తున్నారు. గట్టు ఎత్తు పెంచి, మలుపు వద్ద సుమారు 500 మీటర్ల మేర రక్షణ గోడ నిర్మిస్తే తప్ప ముంపు సమస్య పరిష్కారం కాదంటున్నారు రైతులు.
ఇది ముక్కాములలోని ఒకరిద్దరి రైతుల ఆవేదన కాదు! ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, గోపాలపురం, ఉండి, భీమవరం, జంగారెడ్డిగూడెం, పోలవరం నియోజకవర్గాల పరిధిలోని వేల మంది రైతుల ఆవేదన! మురసు తుపాను ప్రభావంతో ఎర్రకాలువ, ఎనమదురు కాలువ పరిధిలో 10 వేల హెక్టార్లకుపైగా పంటలు ముంపునకు గురయ్యాయి. నేటికీ నీటిలోనే ఉన్నాయి. కొన్నిపొలాలు తటాకాల్ని తలపిస్తుంటే నీరు లాగేసిన చేలల్లో కుళ్లిపోయిన వరి దుబ్బులు బయటపడ్డాయి.
ప్రధానంగాతూర్పుగోదావరి జిల్లాలోని నల్లజర్ల, నిడదవోలు, దేవరపల్లిలో సుమారు 7 వేల హెక్టార్లు, పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, ఆకివీడు, ఉండి, భీమవరం తదితర మండలాల్లో సుమారు 3వేల హెక్టార్ల మేర పంటలు ముంపులో ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావంతో సాగు ఆరంభంలో నీటి తడులకు అల్లాడామని, పంట చేతికందే సమయానికి ఇలా ఎర్రకాలువ ముంచేస్తుందనుకో లేదని సింగవరం, తాళ్లపాలెం రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఎగువున వర్షాలు కురిస్తే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం రిజర్వాయర్‌కు భారీ వరద వస్తుంది. ప్రాజెక్ట్ నీటి మట్టం 83 మీటర్లకు చేరితే జలాలు దిగువకు విడిచిపెడతారు. ఆ జలాలకు, పరిసరాల్లో కురిసిన భారీ వర్షాలు తోడై ఎర్రకాలువ ఉగ్రరూపం దాల్చింది. రిజర్వాయర్ నుంచి అనంతపల్లి వరకూ 33 కిలో మీటర్లు, అక్కడి నుంచి నందమూరి అక్విడక్ట్ వరకు 33 కిలో మీటర్లు మేర ఎర్రకాలువ విస్తరించింది. ఇక్కడి నుంచి మరో 65 కిలో మీటర్ల మేర ఎనమదూరు డ్రెయిన్‌గా ప్రవహించి మొగల్తూరు సమీపంలోని పాతపాడు వద్ద సముద్రంలో కలుస్తుంది.
కాలువ సామర్థ్యం 20 వేల క్యూసెక్కులే. కానీ, మొన్న తుపాన్లకు సుమారు 70 వేల క్యూసెక్కుల ప్రవాహం పోటెత్తింది. ఫలింతగా కాలువకు చిన్న, పెద్దా కలిపి దాదాపు 40 చోట్ల గండ్లు పడినట్లు అధికారులు గుర్తించారు. 2018 వరదల తరువాత నిపుణుల కమిటీ పరిశీలించి లక్షా 54 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకునేలా స్ట్రక్చర్లు, కాలువ పటిష్ఠం చేయాలని సూచించినా నేటికీ చర్యలు లేవు. కాలువ అక్విడక్ట్ వద్ద 100 మీటర్ల మేర వెడల్పు ఉంటే కొన్ని చోట్ల అది 28 మీటర్లకు కుచించుకు పోయింది. పూర్తిస్థాయిలో ఆధునికీరిస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
రెండేళ్ల క్రితం మంత్రులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, అనిత, దుర్గేశ్, తదితరులు ఎర్రకాలువ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. మూడు దశల్లో పనులు చేసి ముంపునకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఏడాది క్రితం తూర్పుగోదావరి జిల్లా పరిధిలో పనులు చేసేందుకు అధికారులు రూ.298 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ఆ తర్వాత కదలిక లేదు. ఎర్రకాలువ ప్రాజెక్ట్ పరిధిలోని కాలువలు వెడల్పు చేసి గట్లు ఎత్తుపెంచేందుకు గతంలోనే అధికారులు భూసేకరణ చేసినా ఆ భూములను స్వాధీనం చేసుకోలేదు.
ఫలితంగా గట్లు ఆక్రమణలుకు గురయ్యాయి. నల్లజర్ల మండలంలోని అనుమునిలంకలో 7.67 ఎకరాలు, పోతవరంలో 0.32, అనంతపల్లిలో 10.34 ఎకరాలు, నిడదవోలు మండలంలో అమ్మెపల్లిలో 2.64, మేడిపల్లిలో 4, కోరుమామిడిలో 4.30, తాడిమల్లిలో 2.70, ఉనకరమల్లిలో 1.08, రావిమెట్లలో 2.68 ఎకరాల మేర ఆక్రమణలున్నాయి. ఈ సమస్యను ప్రభుత్వాలు ఎప్పటికి పరిష్కరిస్తాయో? ఇంకెన్నిసార్లు పంటలు మునగాలో రైతులకు దిక్కుతోచడంలేదు.




