*చవిటిగూడెం అంగన్వాడీ కేంద్రం ఆకస్మిక తనిఖీ*
*తనిఖీ చేసిన అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్*
టీ మీడియా,నవంబర్ 12,అశ్వాపురం: అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలోని చవిటిగూడెం అంగన్వాడీ కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ బానోత్ సదర్ లాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, ప్రీ-స్కూల్ విద్య, కేంద్రం నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.
ఈ తనిఖీలో భాగంగా పంచాయతీ కార్యదర్శి యాకూబ్ అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన స్టాక్ రికార్డులు, ఆహార సరఫరా, ఫీడింగ్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రానికి పిల్లలందరూ ప్రతిరోజూ క్రమం తప్పకుండా హాజరయ్యేలా అంగన్వాడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. చిన్నారుల భవిష్యత్తుకు పునాది ప్రీ-స్కూల్ విద్యేనని, చిన్నతనంలోనే వారికి మంచి విద్యాబోధన, క్రమశిక్షణ, మంచి అలవాట్లు నేర్పించడం ద్వారా భవిష్యత్తులో వారు ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
అంగన్వాడీ కేంద్రంలో ఆటపాటలతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యాబోధన అందించాలని, ప్రతి చిన్నారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సిబ్బందికి సూచించారు.
అదేవిధంగా గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. లబ్ధిదారులకు అందించాల్సిన ఆహారాన్ని ఇంటికి పంపించడం కాకుండా, ప్రతి ఒక్కరూ అంగన్వాడీ కేంద్రానికి హాజరై పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో భోజనం చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. తద్వారా వారందరూ ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం కల్పించాలని తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అంగన్వాడీ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, పిల్లల ఆరోగ్యం, విద్య, పోషకాహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అంగన్వాడీ కేంద్రాన్ని ఆదర్శ కేంద్రంగా తీర్చిదిద్దాలని సర్పంచ్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తుల్లూరి ప్రకాశరావు, పంచాయతీ కార్యదర్శి యాకూబ్ మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.


