పగలు ఎండ, రాత్రి చలి -
రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు
టీ మీడియా,నవంబర్12, హైదరాబాద్ బ్యూరో : గత కొన్ని రోజులుగా వాతావరణంలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పగలు ఎండగా, రాత్రిపూట చల్లగా ఉంటోంది. ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
వైరస్‌తో న్యుమోనియా వచ్చే పరిస్థితి
చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. గాలిలోని వైరస్‌లు, బ్యాక్టీరియాల ద్వారా న్యుమోనియా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలలో జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పక్కటెముకలు పైకి లేవడం, నీరసం వంటివి ఉంటాయి. సిగరెట్ తాగేవారు, మద్యపానం చేసేవారు, మధుమేహులు, క్షయ రోగులకు ఈ వ్యాధి సులభంగా సోకుతుంది. పరీక్ష చేయించుకుని, డాక్టర్ సూచనల మేరకు మందులు తీసుకోవడం ఉత్తమం.
శీతాకాలంలో చర్మ సమస్యలు ఇబ్బందికరంగా ఉంటాయి. దురద ఎక్కువగా ఉంటుంది. చర్మంపై దద్దుర్లు వస్తాయి. చర్మం పొడిబారుతుంది. పెదాలు పొడిబారతాయి. పగుళ్లు ఏర్పడతాయి. చర్మవ్యాధి నిపుణుల సలహా మేరకు నాణ్యమైన ఆయింట్‌మెంట్‌లను ఉపయోగించాలి. కొబ్బరి నూనె రాసుకోవడం మంచిది.
వృద్ధులు తీసుకోవలసిన జాగ్రత్తలు
బీపీ, షుగర్, ఆస్తమా ఉన్న వృద్ధులు చలిలో జాగ్రత్తగా ఉండాలి.చేతులు, చెవులు, మెడను కప్పుకోవాలి.వ్యాయామంతో పాటు నడవడం ముఖ్యం.సరైన ఆహారం, తాజా పండ్లు తీసుకోవాలి.చల్లని పానీయాలు, మద్యం మానుకోవాలి.వృద్ధులు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.మోకాళ్ల నొప్పి వంటి ఇబ్బందులు వచ్చినపుడు నివారణకు ఎక్కువగా జిగురు పదార్థాలు తీసుకోవాలి.
శరీరానికి తగినంతగా మంచి నీరు తీసుకోవాలి. పండ్ల రసాలు ఎక్కువగా తాగాలి.వృద్ధులు ఉండే గదులు చల్లబడకుండా కిటికీలు మూసి ఉంచాలి.
ఇవి చిన్న పిల్లల జాగ్రత్త కోసం
పుట్టినప్పటి నుంచి 15 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న పిల్లలకు వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీరానికి చాలా మంచిది.రోగ నిరోధక శక్తి పెంచే, సి విటమిన్ ఉండే ఉసిరి, నిమ్మ, ప్రొటీన్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి.గొంతు నొప్పిగా ఉంటేగోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకుని పుక్కిలించాలి.
తరచుగా జలుబు, దగ్గు, జ్వరాలు వస్తుంటాయి. స్వెటర్లు, మంకీ క్యాప్‌లు వాడాలి.అప్పుడే వండిన, వేడిగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి.త్వరగా జీర్ణమయ్యే బార్లీ, రాగిని ఇవ్వాలి.చల్లని పదార్థాలను అస్సలు తినకూడదు.వారానికి రెండుసార్లు టమోటా, మిరియాల రసం, ఆకుకూరలను వండి ఇవ్వాలి.పచ్చి బియ్యం, పచ్చి బఠానీలు, ఎండుద్రాక్ష, దోసకాయ, క్యారెట్, బంగాళదుంప, గుడ్లు, పెరుగు ఇవ్వాలి.మసాలాలు ఎక్కువగా ఉన్న, జంక్‌ఫుడ్‌కు వీలైనంత మేరకు దూరంగా ఉండాలి.
సంగారెడ్డి జిల్లాలో ఈ నెలలో ఉష్ణోగ్రతలు (డిగ్రీల్లో)
తేదీ కనిష్ఠం గరిష్ఠం
6 17.2 31.5
7 16.8 31.1
8 15.3 31.8
9 15.0 2.7
10 14.9 32.5
11 14.7 32.8




