విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్స్ బంద్..
తెలంగాణ సర్కార్ కసరత్తులు..
టీ మీడియా,నవంబర్12, హైదరాబాద్ బ్యూరో : తెలంగాణలోని ప్రైవేట్ కాలేజీల ఇష్టారాజ్యానికి కళ్లెం వేసే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విద్యా సంస్థల క్యాంపస్‌లలో సినిమా ప్రమోషన్లు, ప్రైవేట్ ఈవెంట్ల నిర్వహణపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని యోచిస్తోంది. క్యాంపస్‌లను కేవలం విద్యా, క్రీడా కార్యక్రమాలకే పరిమితం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. విద్యార్థులను వాణిజ్య, రాజకీయ ప్రచారాలకు వాడుకోవడంపై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. “విద్యా సంస్థల ప్రాంగణాలు విద్యా, క్రీడా కార్యకలాపాలకే పరిమితం కావాలి” అని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నిర్ణయం వెనుక ఇటీవలి వరుస ఘటనలు ఉన్నాయి. ఓ విశ్వవిద్యాలయంలో పాన్ ఇండియా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగ్గా అక్కడకు జనం భారీగా తరలిరావడంతో తోపులాట లాంటి పరిస్థితి ఏర్పడింది. సౌండ్ బాక్సులు అమర్చిన ఎత్తైన నిర్మాణం కూలి కొందరికి గాయాలయ్యాయి. అలాగే మరో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో దాండియా నైట్ జరిగింది. ఆ కార్యక్రమంలో 80 అడుగుల తాత్కాలిక లైటింగ్ నిర్మాణం కూలిపోయింది. ఈ ప్రమాదంలో మొదటి సంవత్సరం విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కనీసం 14 మంది గాయపడ్డారు. తగిన భద్రతా జాగ్రత్తలు లేకుండా ఈవెంట్లు నిర్వహించడం విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారుతోందని అధికారులు భావిస్తున్నారు.
సినిమా విడుదలకు సంబంధించి సెలవులు ఇవ్వడంపై ఇదివరకే తెలంగాణ ఉన్నత విద్యా మండలి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. ప్రమోషన్ల పేరుతో విద్యార్థుల చదువును, క్రమశిక్షణను దెబ్బతీయడాన్ని సహించబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఇకపై ఏదైనా భారీ కార్యక్రమం నిర్వహించాలంటే విద్యాశాఖతో పాటు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చిన్న స్థాయి కార్యక్రమాలకు అనుమతి ఇచ్చినా, ఎక్కువ మంది హాజరయ్యే కార్యక్రమాల్లో, ముఖ్యంగా బయటివారిని ఆహ్వానించినప్పుడు కఠిన భద్రతా నియమాలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి విద్యార్థుల భద్రతకు చట్టం తీసుకురావాలని ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి ముసాయిదా నివేదిక సమర్పించారు. విద్యా సంస్థలకు కొత్త నియమావళితో కూడిన అధికారిక ఉత్తర్వులను విద్యాశాఖ త్వరలోనే విడుదల చేయనున్నట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి.






