hyderabad

Work is hard to find even in towns. The plight of daily wage laborers is pathetic.

Work is hard to find even in towns. The plight of daily wage laborers is pathetic.

By ·

Share this article
Work is hard to find even in towns.  The plight of daily wage laborers is pathetic.

 

 

పట్టణాల్లోనూ పని దొరకట్లేదు                                                                         

దయనీయంగా 'అడ్డా' కూలీల పరిస్థితి


 టీ మీడియా,నవంబర్14, హైదరాబాద్  బ్యూరో : రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వారివి. తెల్లవారుజామునే సద్దికట్టుకుని పని కోసం అడ్డా బాట పట్టడం, ఎవరైనా పిలుస్తారేమోనని ఆశగా ఎదురు చూడటం, చివరకు పని దొరక్క నిరాశగా ఇంటికెళ్లడం! ఇదీ మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో కూలీల దైనందిన పోరాటం. ఎల్​నినో ప్రభావం, వర్షాభావం కారణంగా గ్రామాల్లో పనులు కరవయ్యాయి. ఉపాధి వెతుక్కుంటూ పట్టణాలకు వస్తున్నా, అక్కడా అదే దుస్థితి నెలకొంది.

వర్షాభావంతో పంటలు పండక
ఎల్‌నినో దెబ్బకు గ్రామాల్లో పనులు కరవయ్యాయి. వర్షాభావంతో పంటలు సరిగా పండక పనుల జాడలేదు. ఉపాధి కోసం నిత్యం వందలాది మంది పట్టణాలకు వెళ్తున్నా, అక్కడ సైతం ఉపాధి కష్టంగానే ఉంటోంది. పనుల కోసం అడ్డా వద్దకు పెద్దఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి సైతం కూలీలు రావడంతో స్థానికులకు ఉపాధి కరవైంది.

పదిలో ఒక్కరిద్దరికే పని
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు సమీప గ్రామాల నుంచి పెద్దఎత్తున కూలీలు పని కోసం వస్తారు. భవన నిర్మాణ పనులు, ఇళ్లు, పరిశ్రమల క్లీనింగ్ పనులకు గుత్తేదారులు, యజమానులు వచ్చి వారిని పనికి తీసుకెళ్తుంటారు. బిహార్‌ కూలీలతో పాటు ఇతర జిల్లాల నుంచి సైతం కూలీలు పెద్ద మొత్తంలో వస్తుండటంతో పదిలో ఒక్కరిద్దరికే పని దొరుకుతోంది. మిగతా వాళ్లు మధ్యాహ్నం వరకు ఎదురుచూసి తిరిగి ఇంటికెళ్లాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వారంలో 3 రోజులు పని దొరకడమే గగనం
సొంత ఇల్లు, వ్యవసాయం లేక కేవలం కూలీ మీదనే ఆధారపడిన ఎంతో మంది పరిస్థితి దయనీయంగా ఉందంటున్నారు. పెరుగుతున్న నిత్యావసరాలతో పాటు ఇంటి కిరాయిలు కట్టేందుకు అవస్థలు పడుతున్నామంటున్నారు. వారంలో 2, 3 రోజులు పని దొరకడమే గగనం అవుతోందంటున్నారు. ఉపాధి తగ్గిపోవడంతో తక్కువ కూలీ ఇచ్చినా వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. మరో పక్క యజమానులు ఒక్క కూలీ కోసం వస్తే 10 మంది చుట్టుముడుతున్నారని అంటున్నారు. ఎక్కువ మందిలో ఎవరిని పిలవాలో తెలియని అయోమయ పరిస్థితి ఉంటోందంటున్నారు.

ఆర్థిక భరోసా కరవు
కార్మికుల జీవితాల్లో కనీస ఆర్థిక భరోసా కరవవుతోంది. ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని, అడ్డా కూలీలను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

Tags: