hyderabad

Minimal rainfall in 18 districts across the state - drought in 358 mandals!

By ·

Share this article
Minimal rainfall in 18 districts across the state - drought in 358 mandals!

 

రాష్ట్రంలో 18 జిల్లాల్లో కనిష్ఠ వర్షపాతం                                                                                                       - 358 మండలాల్లో కరవు!
 
 
 టీ మీడియా, అక్టోబర్ 24 , హైదరాబాద్ బ్యూరో : రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులను అధిగమించేందుకు అన్ని శాఖలు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ ఆదేశించింది. కరవు మండలాలను గుర్తించి, ఈ నెలాఖరులోగా కేంద్రానికి పంపించాలని సూచించింది. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి, నిరంతరం పరిస్థితులను పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 358 మండలాల్లో కరవు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సీఎస్ సంజయ్ జాజు తెలిపారు.

శాఖల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు
ఎల్‌నినో వల్ల ఎదురయ్యే కరవును ఎదుర్కొనేందుకు శాఖల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం ఉన్నతాధికారులను ఆదేశించింది. సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్‌ సబ్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఎల్‌నినో, కరవు ప్రభావం, నీటి లభ్యత, రైతులకు అందించాల్సిన ఉపశమన చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. ఎల్‌నినోతో ఉత్పన్నమయ్యే పరిస్థితులపై చర్చించడానికి త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయించింది.

ఈ నెల 31లోగా కరవు మండలాలను ప్రకటించాలని సూచించింది. కరవు ప్రభావిత మండలాలను శాస్త్రీయంగా, నిబంధనల ప్రకారం గుర్తించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఎల్‌నినో ప్రభావం ఏయే రంగాలపై ఎలా ఉండబోతోందో ముందుగానే అంచనా వేస్తే అవసరమైన సాయం సకాలంలో అందించేందుకు వీలవుతుందని కేబినెట్‌ సబ్‌ కమిటీ అభిప్రాయపడింది.

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు
కలెక్టర్లు ప్రతి వారం సమీక్ష నిర్వహించి కరవు నివారణ చర్యలు చేపట్టాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. నీటి ఎద్దడి నేపథ్యంలో వరి వేయవద్దన్నారు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని తెలిపారు. రైతులకు వాస్తవ పరిస్థితులను వివరించి, చైతన్య పరచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు. ఎల్‌నినో తీవ్రత, భూగర్భ జలాల మట్టాలపై గణాంకాలను ప్రతి వారం జిల్లాల్లో విడుదల చేయాలన్నారు.

చేపల మనుగడ కష్టమే 
కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్లకు అత్యవసర ప్రత్యేక నిధులు కేటాయించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్రంలో దాదాపు రూ.7 వేల కోట్లతో కరవు పనులు చేపడుతున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండేలా కార్యాచరణను చేయాలని అధికారులను సీతక్క కోరారు. చెరువుల్లో నీరు గణనీయంగా తగ్గిపోతున్నందున చేపల మనుగడకు కష్టంగా మారిందని పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. పెద్ద రిజర్వాయర్లలో చేపలను వదిలేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు.

నెలాఖరులోగా కరవు మండలాల జాబితా
ప్రతి జిల్లా కలెక్టర్‌కు అత్యవసర నిధుల కింద రూ.కోటి ఇప్పటికే విడుదల చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. రాష్ట్రంలో 358 మండలాల్లో కరవు పరిస్థితులు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించినట్లు సీఎస్ చెప్పారు. ఈ నెల 31 తేదీలోగా కేంద్ర ప్రభుత్వానికి కరవు మండలాల జాబితాను సమర్పిస్తామన్నారు. రాష్ట్రంలో 18 జిల్లాల్లో కనిష్ఠ వర్షపాతం నమోదు కాగా, 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయిందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 324 మండలాల్లో భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని సీఎస్​ వివరించారు. రిజర్వాయర్లలో 470 టీఎంసీలకు గానూ 170 టీఎంసీలు మాత్రమే ఉన్నాయన్నారు. సింగూరు జలాశయంలో నీటి కొరత పరిస్థితులను అధిగమించడానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందించామని స్పష్టం చేశారు.

Tags: