రాష్ట్ర ఆదాయం అంతంత
ఖర్చులు మాత్రం కొండంత
రూ.15 వేల కోట్లకు పైగా రెవెన్యూ లోటు
టీ మీడియా, అక్టోబర్ 24 , హైదరాబాద్ బ్యూరో : ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరం అర్ధభాగం ముగిసే నాటికి రాష్ట్రం రూ.15 వేల కోట్లకు పైగా రెవెన్యూ లోటు నమోదు చేసింది. ఆశించిన మేర ఆదాయం లేకపోగా, ఖర్చులు గణనీయంగా పెరగడంతో రెవెన్యూ లోటు పెరుగుతోంది. పన్ను రాబడులు లక్ష్యానికి దూరంగానే ఉన్నాయి. ఆర్నెళ్లు గడచినా రెవెన్యూ రాబడులు రూ.లక్ష కోట్లలోపే సమకూరినట్లు కాగ్ నివేదించింది.
బడ్జెట్లో 46 శాతం ఆదాయమే
ఆర్థిక సంవత్సరపు తొలి ఆర్నెళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ రాబడులు రూ.లక్ష కోట్లలోపు మాత్రమే ఉన్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.2,41,263 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా, సెప్టెంబర్ నెలాఖరు వరకు కేవలం రూ.92,013 కోట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. బడ్జెట్ అంచనాల్లో 38 శాతాన్ని మాత్రమే మించింది. పన్నుల ద్వారా ఖజానాకు రూ.82,553 కోట్లు వచ్చాయి. బడ్జెట్ అంచనా అయిన రూ.1,81,367 కోట్లలో ఇది కేవలం 46 శాతం వరకు మాత్రమే ఉంది.
అంచనా వేసిన గ్రాంట్ల కంటే చాలా తక్కువ
జీఎస్టీ ద్వారా రూ.29,565 కోట్లు, అమ్మకపు పన్ను ద్వారా రూ.18,830 కోట్లు, ఎక్సైజ్ పన్నుల ద్వారా రూ.10,471 కోట్లు, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల నుంచి రూ.9,033 కోట్ల ఆదాయం సమకూరింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.10,667 కోట్లు, ఇతర పన్నుల ద్వారా రూ.3,985 కోట్లు వచ్చాయి. ఆగస్టులో రూ.16 వేల కోట్లకు పైగా ఉన్న పన్ను ఆదాయం, సెప్టెంబర్ నెలలో రూ.13 వేల కోట్లకు తగ్గింది. పన్నేతర ఆదాయం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. ఏడాదికి రూ.35,730 కోట్లను అంచనా వేయగా, సెప్టెంబర్ వరకు అందులో 16 శాతానికి పైగా అంటే రూ.5,754 కోట్లు మాత్రమే సమకూరాయి.
పన్నేతర ఆదాయం ద్వారా సెప్టెంబర్ నెలలో కేవలం రూ.278 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఈ ఆర్థిక సంవత్సరం రూ.24,166 కోట్లు వస్తాయని అంచనా వేయగా, 6 మాసాల్లో రూ.3,706 కోట్లు మాత్రమే వచ్చాయి. అంచనాలో ఇది 15 శాతాన్ని మాత్రమే అధిగమించింది.
గణనీయంగా పెరిగిన ఖర్చులు
సెప్టెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా రూ.44,612 కోట్లు సమీకరించుకొంది. బడ్జెట్లో ఈ ఏడాది రూ.61,457 కోట్ల అప్పులు ప్రతిపాదించగా, ఆర్థిక సంవత్సరం అర్ధభాగం పూర్తయ్యే వరకు 72 శాతం మేర అప్పులు తీసుకున్నారు. అన్ని రకాలుగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నెలాఖరు వరకు రాష్ట్రానికి రూ.1,36,648 కోట్ల ఆదాయం సమకూరింది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యయం గణనీయంగా నమోదైంది. రెవెన్యూ వ్యయం రూ.1,07,109 కోట్లకు చేరగా, మూలధన వ్యయం రూ.27,743 కోట్లుగా ఉంది.
సెప్టెంబర్లోనే అత్యధిక వ్యయం
మూలధన వ్యయం కింద సెప్టెంబర్ నెలలోనే ఏకంగా రూ.15,251 కోట్లు ఖర్చు చేశారు. ఉద్యోగుల జీతాల కోసం రూ.25,258 కోట్లు, పింఛన్ల కోసం రూ.14,235 కోట్లు, వడ్డీ చెల్లింపుల కోసం రూ.16,565 కోట్లను సెప్టెంబర్ నెలాఖరు వరకు ఖర్చు చేశారు. ఇక రాయితీలకు రూ.10,298 కోట్లు వ్యయం చేశారు. మొత్తంగా ఆరు నెలల్లో రూ.1,34,852 కోట్ల ఖర్చు జరిగింది. రెవెన్యూ రాబడులను మించి రెవెన్యూ వ్యయం ఉండటంతో రూ.15,096 కోట్ల రెవెన్యూ లోటు నమోదైంది. ఆర్థిక లోటు రూ.44,612 కోట్లకు గానూ ప్రాథమిక లోటు రూ.28,046 కోట్లు ఉన్నట్లు తేల్చారు.






