ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో పట్టపగలే చోరీ
4 వెంటిలేటర్లను అపహరణ
టీ మీడియా, నవంబరు 4, ఆదిలాబాద్ : హాస్పిటల్లో ఎక్కడికక్కడ పకడ్బందీగా పహారా కాచేది సిబ్బంది, సెక్యూరిటీ గార్డులే! ఆసుపత్రిలో ఏం జరిగినా వారు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందిస్తారు. వార్డువార్డుకు ఒకరు ఉంటూ ఎప్పుడూ కాపలా కాస్తూనే ఉంటారు. ఏం జరిగినా ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. కానీ ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పట్టపగలే అక్కడ దొంగతనం జరుగుతున్నా ఎవరూ గమనించలేని పరిస్థితి. పట్టపగలే వెంటిలేటర్లు చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడమే ఇందుకు నిదర్శనం.
పర్యవేక్షణ ఎక్కడ?
ఇటీవల వరుస ఘటనలతో రిమ్స్ ఆసుపత్రి వార్తల్లో నిలుస్తోంది. తాజాగా రోగులకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే వెంటిలేటర్ల చోరీతో మరోసారి వార్తల్లోకెక్కింది. పట్టపగలే ఇద్దరు వ్యక్తులు దర్జాగా చోరీకి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటన అక్కడి అధికారుల పర్యవేక్షణ లోపానికి అద్దం పడుతోంది. సిబ్బంది పట్టించుకోకపోవటంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గత నెల 30న చోరీ
పోలీసుల వివరాల ప్రకారం, గత నెల 30న మధ్యాహ్నం 2.37 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. రిమ్స్‌లోని రెండో అంతస్తులో ఉన్న ఆర్ఐసీయూ విభాగంలో చోరీ జరిగింది. ఇద్దరు వ్యక్తులు పల్మనాలజీ విభాగంలోని ఆర్ఐసీయూ వార్డు, చెస్ట్, టీబీ వార్డుల్లో మొత్తం కలియ తిరిగారు. ఆ తర్వాత ఆయా వార్డుల్లో ఉన్న 4 వెంటిలేటర్లను ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో అక్కడ వైద్యులు లేనప్పటికీ, స్టాఫ్ నర్సులు, సెక్యూరిటీ గార్డు, పేషెంట్ కేర్ ఉన్నట్లు సమాచారం. పట్టపగలే చోరీ జరుగుతుంటే వారంతా ఏం చేస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది.
నిందితులకు సిబ్బంది సహకారం!
ఒక్కో వెంటిలెటర్ విలువ రూ.8 లక్షల వరకు ఉంటుంది. దాదాపు రూ.35 లక్షల విలువ గల పరికరాలు చోరీ కావడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ ఘటనలో నిందితులకు కొంతమంది సిబ్బంది సహకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, ఏడాది క్రితం ఎంఐసీయూలో కూడా ఒక వెంటిలెటర్‌ను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లిన విషయం సైతం బయటపడింది. వైద్యులు, సిబ్బంది, సూపర్వైజర్లు, సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణ లోపంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని పలువురు పేర్కొంటున్నారు. మరోవైపు ఈ చోరీలో రిమ్స్‌కు సంబంధించిన సిబ్బంది సహకారం ఉంటుందనే చర్చా సాగుతోంది.
ఘటన జరిగిన 4 రోజుల తర్వాత అంటే మంగళవారం రోజున విషయం అధికారుల దృష్టికి రావడం వారి పర్యవేక్షణ ఎలా ఉందో తెలియజేస్తోంది. దీనిపై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాఠోడ్ టూ టౌన్లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్‌ను అందజేశారు. సీఐ నాగరాజు ఆ విభాగాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే అత్యవసరంగా రోగులకు ఆక్సిజన్ అందించాల్సిన పరికరాలు లేకపోతే కనీసం వైద్యులు కూడా దాని గురించి ఆరా తీయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
