adyathmikam

వేలం లేకుండానే జాయింట్‌ వీల్స్‌కు అవకాశం..?

వేలం లేకుండానే జాయింట్‌ వీల్స్‌కు అవకాశం..?

By ·

Share this article
వేలం లేకుండానే జాయింట్‌ వీల్స్‌కు అవకాశం..?

వేలం లేకుండానే జాయింట్‌ వీల్స్‌కు అవకాశం..?

రూ.లక్ష డొనేషన్‌తోనే సరిపెట్టారా?.. 

ఈఓ వ్యాఖ్యలతో కొత్త ప్రశ్నలు

 

 

 

వేలం నిర్వహించాల్సి ఉంటే ఎందుకు నిర్వహించలేదు?..

 దేవాదాయ శాఖ ఆదాయానికి గండి పడుతోందా?

గ్రామపంచాయతీ అనుమతి ఉందా?..

 ఇన్సూరెన్స్‌, ఫిట్‌నెస్‌ పత్రాలెక్కడ?

డొనేషన్‌ పేరుతో ఎగ్జిబిషన్‌కు అవకాశం ఇచ్చారా?..ఉన్నతాధికారులు తేల్చాలి

టీ మీడియా,అక్టోబర్22,సింగరేణి(కారేపల్లి): ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామంలోని శ్రీ కోట మైసమ్మ ఆలయ జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణం,పరిసరాల్లో ఏర్పాటు చేసిన జాయింట్‌ వీల్స్‌, ఎగ్జిబిషన్‌ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.నిర్వాహకుల నుంచి రూ.లక్ష డొనేషన్‌ తీసుకున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కే. వెంకటయ్య చెప్పడంతో..అసలు ఎగ్జిబిషన్‌ నిర్వహణకు అవకాశం ఏ ప్రాతిపదికన ఇచ్చారు? బహిరంగ వేలం లేదా టెండర్‌ ప్రక్రియ నిర్వహించాల్సిన అవసరం ఉందా? ఉంటే ఎందుకు నిర్వహించలేదు? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

 

 

 

 

*వేలం పెట్టాల్సి ఉంటే.. ఎందుకు పెట్టలేదు?*

జాతర సందర్భంగా ఆలయ పరిధిలో వాణిజ్యపరంగా జాయింట్‌ వీల్స్‌, ఎగ్జిబిషన్‌ నిర్వహించుకునే హక్కులను కేటాయించేందుకు దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం బహిరంగ వేలం లేదా ఇతర పోటీ ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుందా? అనే అంశంపై అధికారులు ముందుగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.ఒకవేళ వేలం నిర్వహించాల్సిన నిబంధన వర్తిస్తే.. వేలం ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉండగా రూ.లక్ష డొనేషన్‌తోనే ఎందుకు సరిపెట్టారు? వేలం నిర్వహించకపోవడం వల్ల ఆలయానికి రావాల్సిన ఆదాయం తగ్గిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు వేలం అవసరం లేదని అధికారులు భావిస్తే, ఏ నిబంధన లేదా ఉత్తర్వుల ప్రకారం డొనేషన్‌ తీసుకుని ఎగ్జిబిషన్‌కు అవకాశం కల్పించారో వెల్లడించాల్సిన బాధ్యత దేవాదాయ శాఖపై ఉంది.

 

 

 

*డొనేషన్‌ తీసుకుంటే నిర్వహణ హక్కు వచ్చినట్లేనా?*

నిర్వాహకుల నుంచి రూ.లక్ష డొనేషన్‌ తీసుకున్నట్లు ఈఓ వెల్లడించిన నేపథ్యంలో ఆ డొనేషన్‌కు అధికారిక రసీదు ఇచ్చారా? ఆ మొత్తం ఆలయ అధికారిక ఖాతాలో జమైందా? డొనేషన్‌కు, ఎగ్జిబిషన్‌ నిర్వహణకు మధ్య ఏదైనా సంబంధం ఉందా? లేక స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళం మాత్రమేనా? అనే వివరాలు వెల్లడించాల్సి ఉంది.డొనేషన్‌ చెల్లించడం వల్లనే జాయింట్‌ వీల్స్‌,ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారా? లేక ఇందుకు ప్రత్యేకంగా అనుమతి ఉత్తర్వులు జారీ చేశారా? అన్నది తేలాల్సి ఉంది.

 

 

 

*దేవాదాయ శాఖ ఆదాయానికి గండి పడిందా?*

జాతరలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే సమయంలో ఎగ్జిబిషన్లు,వినోద పరికరాల నిర్వహణకు వాణిజ్య విలువ ఉంటుంది. అలాంటి హక్కులను పారదర్శకమైన పోటీ విధానంలో కేటాయిస్తే ఆలయానికి ఎంత ఆదాయం వచ్చేది?ప్రస్తుతం తీసుకున్న రూ.లక్ష డొనేషన్‌తో పోలిస్తే తేడా ఎంత? అనే అంశాలను ఉన్నతాధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది.వేలం నిర్వహించాల్సిన నిబంధన ఉన్నప్పటికీ నిర్వహించలేదని తేలితే ఆలయానికి రావాల్సిన ఆదాయానికి గండి పడిందా? అందుకు బాధ్యత ఎవరిది? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

*జాయింట్‌ వీల్స్‌కు భద్రతా పత్రాలున్నాయా?*

ఆదాయ అంశంతో పాటు భక్తుల భద్రత కూడా అత్యంత కీలకం. జాయింట్‌ వీల్స్‌ వంటి భారీ వినోద పరికరాలకు అవసరమైన ఫిట్‌నెస్‌, ఇన్సూరెన్స్‌, విద్యుత్‌ భద్రతతో పాటు వర్తించే ఇతర అనుమతులు ఉన్నాయా? గ్రామపంచాయతీ నుంచి అవసరమైన అనుమతి పొందారా? సంబంధిత అధికారులు పరికరాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.ప్రమాదం సంభవిస్తే బాధ్యత ఎవరు తీసుకుంటారు? నిర్వాహకులకు తగిన బీమా ఉందా? అత్యవసర పరిస్థితులకు అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స, ఇతర భద్రతా ఏర్పాట్లు చేశారా? అనే విషయాలపై కూడా తనిఖీలు జరగాల్సి ఉంది.

 

 

*డొనేషన్‌ లెక్కలు.. అనుమతుల లెక్కలు బయటపెట్టాలి*

ఈ మొత్తం వ్యవహారంపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపి రూ.లక్ష డొనేషన్‌ ఏ ప్రాతిపదికన తీసుకున్నారు? రసీదు ఇచ్చారా? వేలం/టెండర్‌ అవసరం ఉందా? ఉంటే ఎందుకు నిర్వహించలేదు? ఎగ్జిబిషన్‌కు ఎవరు అనుమతి ఇచ్చారు? గ్రామపంచాయతీతో పాటు ఇతర శాఖల అనుమతులు ఉన్నాయా? జాయింట్‌ వీల్స్‌కు ఇన్సూరెన్స్‌, ఫిట్‌నెస్‌, భద్రతా పత్రాలు ఉన్నాయా? అనే అంశాలను ప్రజల ముందు వెల్లడించాల్సిన అవసరం ఉంది.అన్ని నిబంధనల ప్రకారమే జరిగి ఉంటే సంబంధిత అనుమతి పత్రాలను బహిర్గతం చేసి సందేహాలకు తెరదించాలని,నిబంధనల ఉల్లంఘన లేదా ఆలయ ఆదాయానికి నష్టం జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.