ఢిల్లీ

14–16 hours of work a day... Only four hours of sleep... The plight of CISF personnel

By ·

Share this article
14–16 hours of work a day...  Only four hours of sleep...  The plight of CISF personnel

 

రోజుకు 14-16 గంటల పని..                                                                         

నాలుగు గంటలే నిద్ర..                                                                   

సీఐఎస్‌ఎఫ్‌ జవాన్ల దుస్థితి 
 

 

టీమీడియా , అక్టోబర్ 26 , ఢిల్లీ బ్యూరో  : జమ్ము కశ్మీర్‌లోని కథువా జిల్లాలో సేవా నదిపై నిర్మించిన హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌ ప్రాజెక్టు వద్ద సీఐఎస్‌ఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అవదేశ్‌ కుమార్‌ సింగ్‌ తన సహచర ఉద్యోగులతో వాగ్వాదం తర్వాత తన దగ్గర ఉన్న ఏకే 47 తుపాకితో నలుగురిని కాల్చి చంపిన ఘటన ఇటీవల చోటుచేసుకుంది. అనంతరం అతడిని పోలీసులు అరెస్ట్‌ చేయగా, సీఐఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

అయితే ఇలాంటి ఘటనలు తరచూ ఎందుకు జరుగుతున్నాయని పరిశీలిస్తే సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిలోని పనిఒత్తిడి, రోజుకు 14-16 పనిగంటలు, విశ్రాంతి లేకపోవడం, దశాబ్దాల తరబడి ప్రమోషన్లు లేకపోవడం వల్ల ఏర్పడిన అసంతృప్తి ప్రధాన కారణాలుగా బయటపడింది. 2019 నుంచి 2025 మధ్య 1,016 మంది ఆత్మహత్య చేసుకోగా, 24 మంది తమ తోటి సిబ్బందినే హతమార్చిన విషయం ఆశ్చర్యపరుస్తుంది.

రోజుకు 19 గంటల వరకు పని
సీఐఎస్‌ఎఫ్‌ అంటే సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌. ఇది హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే భారతదేశంలోని ప్రముఖ కేంద్ర సాయుధ పోలీస్‌ దళాలలో ఒకటి. దేశంలో సీఏపీఎఫ్‌, అస్సాం రైఫిల్స్‌లో 93,139 ఉద్యోగాలు ఖాళీగా భర్తీ చేయకుండా ఉన్నాయి. దీని కారణంగా సిబ్బందిపై రోజురోజుకూ పనిభారం పెరిగిపోతున్నదని సీఐఎస్‌ఎఫ్‌ మాజీ ఏడీజీ హెచ్‌ఆర్‌ సింగ్‌ తెలిపారు. పనిగంటలు స్థిరంగా ఉండవని ఒక్కో సమయంలో రోజుకు 19 గంటల పాటు పనిచేయాల్సి ఉంటుందని, రోజుకు కనీసం నాలుగైదు గంటలు నిద్రపోవడానికి కూడా ఉండదని అది వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతున్నదని చెప్పారు.

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)నే ఉదాహరణగా తీసుకుంటే షిఫ్ట్‌కు ఆరు గంటల చొప్పున రోజుకు రెండు షిఫ్ట్‌ల్లో పనిచేయాలి. మొదటి షిఫ్ట్‌ ఉదయం ఆరు గంటల నుంచి 12 గంటల వరకు, రెండో షిఫ్ట్‌ సాయంత్రం ఆరు నుంచి రాత్రి 12 గంటల వరకు ఉంటుంది. మొదటి షిఫ్ట్‌ కోసం వారు ఉదయం నాలుగు, నాలుగున్నరకు నిద్ర లేవాలి. కాలకృత్యాలు తీర్చుకుని, బ్రేక్‌ఫాస్ట్‌ చేసి డ్రెస్‌ వేసుకుని తమ ఆయుధాలను సేకరించాలి. విధి నిర్వహణలో ఫోన్‌ను అనుమతించరు కాబట్టి, కుటుంబ సభ్యులతో ఏదైనా మాట్లాడాలనుకుంటే అప్పుడే మాట్లాడుతారు. తర్వాత క్యాంప్‌ను విడిచి బోర్డర్‌ ఔట్‌ పోస్ట్‌ వద్దకు నిర్దేశిత సమయానికి కనీసం 15 నిమిషాల ముందు చేరుకుంటారు. 12 గంటలకు మొదటి షిఫ్ట్‌ అయ్యాక తిరిగి క్యాంప్‌నకు చేరుకుని ఆయుధాలను డిపాజిట్‌ చేస్తారు.

తర్వాత లంచ్‌ చేసి తమ కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడుకుంటారు. రెండో షిఫ్ట్‌కు రిపోర్టింగ్‌ చేసే ముందు వారు క్యాంప్‌లో నిర్వహణ పనులను చేపట్టాల్సి ఉంటుంది. తర్వాత ఆరు గంటల షిఫ్ట్‌కు వెళ్లి రాత్రి 12 గంటలకు డ్యూటీ దిగుతారు. మళ్లీ తెల్లవారుజామున నాలుగు గంటలకు లేవాల్సి ఉంటుంది. అంటే వారు పడుకోవడానికి కనీసం నాలుగు గంటల సమయం కూడా ఉండదు. వ్యక్తిగత పనులకు హాజరు కావాల్సి వచ్చినా సెలవు దొరకదు. ఈ నేపథ్యంలోనే కేవలం పై అధికారి సెలవు ఇవ్వలేదన్న కారణంతో ఆత్మహత్య చేసుకోవడమో, లేదా తన పై అధికారిని కాల్చి చంపడమో చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

Tags: