'ముందు సిద్ధూకు డబ్బులివ్వు
అప్పుడే నీ చెక్ ఇస్తా'
హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్‌లో 'వసూల్ రాణి'
.
టీమీడియా , అక్టోబర్ 26 , హైదరాబాద్ బ్యూరో : "మీ పేరులో తప్పు ఉంది, మీరు ఏడాదిగా ఇంట్లో లేరు. అయినా సరే మీకు రూ.లక్షల్లో డబ్బులిప్పించాను. పేర్లు తప్పులున్నాయని రాస్తే మీకు ఆ డబ్బు రాదు. అందుకే మా సిద్ధూ చెప్పినట్లుగా మీరు ముందు డబ్బు చెల్లిస్తేనే నేను చెక్కు ఇస్తా. నా స్నేహితులు మేడం, ఎలా అయినా డబ్బులిప్పించండి అని సిద్ధూ రికమండ్ చేశాడు. అందుకే చెక్కు రాశా. మంగళవారంలోగా మీరు డబ్బులివ్వకుంటే మీ ఇష్టం." కొన్ని రోజుల క్రితం ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట వరకు ఉన్న ఎలివేటెడ్ కారిడార్ మార్గంలో భూమిని ఇచ్చిన ఓ వ్యక్తితో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయ భూ సేకరణ అధికారి పలికిన మాటలివి. ఈ మాటలు ఒక్క వ్యక్తితో పలికినవి కావు, ఆ అధికారి ఫోన్‌లో ఇదే రీతిలో చాలా మందితో మాట్లాడారు.
ఎలివేటెడ్ కారిడార్ నిర్వాసితులకు ప్రభుత్వం రూ.400 కోట్లను విడతల వారీగా విడుదల చేసింది. దీనికి సంబంధించి పరిహారం విడుదలైనప్పటి నుంచి సదరు అధికారి బాధితుల నుంచి డబ్బు వసూలు చేయడం మొదలుపెట్టారు. డబ్బు వసూలు చేయడానికి సిద్ధూ అనే ఒక ప్రైవేట్ వ్యక్తిని నియమించారు. సిద్ధూకు డబ్బులందితే వెంటనే కలెక్టర్ కార్యాలయం నుంచి చెక్కు జారీ అవుతుంది.
ఒక్కొక్కరి నుంచి రూ.20 లక్షల వరకు
పరిహారం మంజూరైన భూ నిర్వాసితుల నుంచి సదరు అధికారిణి రూ.6 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు వసూలు చేశారు. మరికొందరితోనూ బేరం కుదుర్చుకున్నారు. నెల రోజుల క్రితం తిరుమలగిరి మండలానికి చెందిన ఒక వ్యక్తి నుంచి రూ.6 లక్షలు తీసుకున్నారు. బోయిన్‌పల్లికి చెందిన మరో వ్యక్తి నుంచి సిద్ధూ అనే వ్యక్తి రూ.14 లక్షలు తీసుకున్నాడు. ఇంత చెల్లించినా వారికి చెక్కులు అందకపోవడంతో వారు అక్టోబర్ రెండో వారంలో కలెక్టరేట్‌కు వచ్చి అధికారితో మాట్లాడారు. అయితే అదే సమయంలో పైఅధికారులు వరుసగా సెలవుల్లో ఉన్నారని, మరికొందరు ఇతర పనుల్లో ఉన్నారని వారికి సర్దిచెప్పి, ఈ నెల 19న చెక్కులు ఇస్తామని చెప్పారు. దీంతో వారు సోమవారం ఆఫీసుకు వెళ్లారు. అయితే 'నేనేమైనా మీకు అప్పు ఉన్నానా?' అంటూ ఆ అధికారిణి వారిని వెళ్లగొట్టారు. దీంతో ఆగ్రహానికి లోనైన బాధితులు శనివారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. భూసేకరణ అధికారి వసూళ్ల వ్యవహారంపై రెవెన్యూ అధికారుల వద్ద ఆరా తీయగా, ప్రాథమిక ఆధారాలు సేకరిస్తున్నామని ఒక ఉన్నతాధికారి ధ్రువీకరించారు.
డబ్బు అందిన తర్వాతే చెక్కు
సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట్ వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో ప్రైవేట్ ఆస్తులు, భూములను సేకరించారు. నిర్వాసితులకు పరిహారంగా టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) బాండ్లను ఇస్తామని అధికారులు ప్రతిపాదించగా, యజమానులు నిరాకరించారు. దానికి బదులుగా నగదు ఇవ్వాలని కోరడంతో అధికారులు అంగీకరించారు.
ప్రాంతాల వారీగా చదరపు గజానికి రూ.90 వేల నుంచి రూ.1.13 లక్షల వరకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. కలెక్టరేట్‌లో చెక్కులు అందజేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అక్కడే భూ సేకరణ అధికారి వసూళ్ల పర్వాన్ని ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి చెక్కు రాసే సమయంలో నిర్వాసితుల నుంచి డబ్బు అందిన తర్వాతే ఆ చెక్కును పంపిణీ చేస్తున్నారు.






