దీనస్థితిలో నిరుపేద కుటుంబం
దాతల సాయం కోసం ఎదురుచూపులు
టీమీడియా , నవంబర్ 17, హైదరాబాద్ బ్యూరో : రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద చేనేత కుటుంబం వారిది. ఒకవైపు ఇంటి పెద్ద పక్షవాతంతో మంచాన పడటం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. మరోవైపు కాళ్లు విరిగి కదలలేని పరిస్థితిలో తల్లి, పోలియోతో నడవలేని స్థితిలో కుమార్తె. ప్రభుత్వం ఇచ్చే పింఛన్ డబ్బులే ఆ కుటుంబానికి ఆధారం. ఆ వచ్చే కొద్దిపాటి సొమ్ముతోనే మందులు కొంటూ, ఇంటి అద్దె చెల్లిస్తూ బతుకు భారంగా జీవిస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన మెరుగు సత్యనారాయణ మగ్గంపై నూలు చీరలు నేసేవారు. భార్య వరమ్మ రాట్నంపై కండెలు పడుతూ, ఆసు పోస్తూ భర్తకు సాయం చేసేది. వీరికి ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. ఉన్నపెంకుటిల్లు అమ్మి, అప్పులు చేసి నలుగురు కుమార్తెల పెళ్లిళ్లు చేశారు.
కుమారుడు ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇందులో నాలుగో కుమార్తె అజంతాకు ఆరెళ్ల వయసులో పోలియో సోకి రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. రెండేళ్ల కిందట సత్యనారాయణకు పక్షవాతం వచ్చి కింద పడటంతో కాలు విరిగింది. శస్త్ర చికిత్స చేయించే స్తోమత లేకపోవటంతో మంచానికే పరిమితమయ్యాడు. మగ్గం మూగబోవడంతో ఆదాయ మార్గం పూర్తిగా నిలిచిపోయింది.
నేలపై పాక్కుంటూ డిగ్రీ పూర్తి చేసిన అజంతా
దీన స్థితిలో ఉన్న కుటుంబంపై కొద్ది రోజుల క్రితం మరో పిడుగు పడింది. ఇంటి ఆవరణలో చెట్టుపై ఉన్న కోతుల మూక ఒక్కసారిగా వరమ్మపై దూకడంతో అదుపు తప్పి పక్కనున్న కాలువలో పడిపోయింది. రెండు కాళ్లు విరిగాయని, మోకాలి చిప్ప పక్కకు జరగడంతో శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారు.
ప్రస్తుతం ఊతం లేనిదే వరమ్మ కదలలేకపోతుంది. అజంతా దివ్యాంగురాలైనా నేలపై పాక్కుంటూ వెళ్లి పట్టుదలతో డిగ్రీ పూర్తి చేసింది. ఓ ఎన్జీవో అజంతకు శిక్షణ నిచ్చి, టెలీ కాలర్ ఉపాధి కల్పించింది. అయితే పక్షవాతంతో తండ్రి, నడవలేని స్థితిలో ఉన్న తల్లిని చూసుకోవడానికి ఉద్యోగం వదులుకుని నేలపై పాక్కుంటూ అజంత సేవలందిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం అందించే పింఛన్ డబ్బులతోనే ఆ కుటుంబం కాలం వెళ్లదీస్తోంది.
దాతలు ఎవరైనా వైద్యానికి సాయం చేయాలని విజ్ఞప్తి
సత్యనారాయణ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. వరమ్మకు మోకాలికి, కాళ్లకు ఆపరేషన్ చేస్తేనే సొంతంగా నడవగలుగుతుందని డాక్టర్లు చెప్పారు. డబ్బు లేకపోవడంతో నిస్సహాయంగా మిన్నకుండి పోయారు. వృద్ధ దంపతుల వైద్యానికి, దివ్యాంగురాలికి మూడు చక్రాల వాహనం కోసం ఆ కుటుంబం ప్రభుత్వం, దాతల సహకారం కోరుతున్నారు.






