ఢిల్లీ

Rs 36,000 fine for going to see someone off 12 people left stranded inside Vande Bharat train

Rs 36,000 fine for going to see someone off 12 people left stranded inside Vande Bharat train

By ·

Share this article

 

 

 

సెండాఫ్​ ఇవ్వడానికి వెళ్తే రూ.36 వేల ఫైన్                                                             

 వందేభారత్‌లోనే చిక్కుకుపోయిన 12 మంది


 
 టీమీడియా , నవంబర్ 17, ఢిల్లీ బ్యూరో : బంధువులను రైలు ఎక్కించేందుకు వెళ్లిన 12 మంది అనుకోకుండా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో చిక్కుకున్నారు. బోగీల్లోకి వెళ్లి తమ కుటుంబ సభ్యులను సీట్ల వద్ద కూర్చోబెట్టే క్రమంలో రైలులోని ఆటోమేటిక్‌ తలుపులు మూసుకుపోయాయి. దీంతో వారు బయటకు రాలేక లోపలే ఉండిపోయారు. అప్పటికే రైలు స్టేషన్‌ నుంచి బయలుదేరడంతో చేసేదేమీ లేక 139 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చింది. చివరకు రైల్వే అధికారులు వారిని ఓ స్టేషన్‌లో దించి, సరైన టిక్కెట్లు లేకుండా ప్రయాణించినందుకు మొత్తం రూ.36 వేల జరిమానా విధించారు.

ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని కాన్పూర్‌ జిల్లాలో సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. బనారస్‌ నుంచి దిల్లీకి వెళ్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో తమ బంధువులను ఎక్కించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 12 మంది బోగీల్లోకి ప్రవేశించారు. కుటుంబ సభ్యులను వారి సీట్ల వద్ద కూర్చోబెడుతుండగా ఆటోమేటిక్‌ తలుపులు మూసుకుపోయాయి. వందే భారత్‌ రైళ్లలో ఆటోమేటిక్‌ తలుపులు ఉంటాయి. రైలు నిర్ణీత స్టేషన్‌కు చేరుకున్నప్పుడు మాత్రమే అవి తెరుచుకుంటాయి. కొంత సమయం తర్వాత వాటంతట అవే మూసుకుపోతాయి.

ఈ విషయం తెలియని 12 మంది రైలు బయలుదేరిన తర్వాత తాము లోపలే ఉండిపోయామని గుర్తించారు. వెంటనే రైలు సిబ్బందిని తలుపులు తెరవాలని కోరారు. అయితే రైలు కదులుతున్న సమయంలో తలుపులు తెరవడం సాధ్యం కాలేదు. వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉండటంతో ఆందోళనకు గురయ్యారు. కొందరు నిరసన వ్యక్తం చేస్తూ గందరగోళం సృష్టించినప్పటికీ, మధ్యలో రైలును ఆపి వారిని దించే అవకాశం లేకపోయింది. దీంతో గమ్యం కానప్పటికీ 139 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చింది.

రూ.36 వేల జరిమానా
ఇదిలా ఉండగా టిక్కెట్లు లేకుండా ప్రయాణించినందుకు రైల్వే అధికారులు ఆ 12 మందిపై చర్యలు తీసుకున్నారు. మొత్తం రూ.36 వేల జరిమానా విధించారు. అంటే ఒక్కొక్కరికి సగటున రూ.3 వేల చొప్పున జరిమానా పడింది. బంధువులను సాగనంపేందుకు స్టేషన్‌కు వచ్చిన వారు అనుకోకుండా ప్రయాణికులుగా మారడమే కాకుండా, వేల రూపాయలు జరిమానాగా చెల్లించాల్సి వచ్చింది. ఈ ఘటనపై నార్త్‌ సెంట్రల్‌ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ (సీపీఆర్ఓ) శివం శర్మ స్పందించారు. వందే భారత్‌ రైళ్లలో ఆటోమేటిక్‌ తలుపులు ఉంటాయని, అనుమతి లేకుండా బోగీల్లోకి ప్రవేశించడం నిషిద్ధమని తెలిపారు. ఈ 12 మంది ప్లాట్‌ఫారమ్‌ టిక్కెట్లు కూడా లేకుండానే రైలు ఎక్కారని వివరించారు. దాంతోవారిని ఎటావా స్టేషన్‌లో రైలు నుంచి దించేసినట్లు శివం శర్మ తెలిపారు. అక్కడ రైల్వే అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుని జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు.

అధికారుల సూచనలు
ఈ ఘటన నేపథ్యంలో ప్రయాణికుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. తమ ఆత్మీయులకు వీడ్కోలు పలకడానికి రైల్వే స్టేషన్లకు వచ్చే బంధువులు, స్నేహితులు తప్పనిసరిగా ప్లాట్‌ఫాం టిక్కెట్లను కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. చెల్లుబాటు అయ్యే ప్రయాణ టిక్కెట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ రైలు కోచ్‌లలోకి ప్రవేశించకూడదని వారు విజ్ఞప్తి చేశారు. ప్లాట్‌ఫాం టిక్కెట్ అనేది కేవలం స్టేషన్ ఆవరణలోకి ప్రవేశించడానికి మాత్రమే అనుమతిస్తుంది తప్ప, రైలు బోగీలలోకి ఎక్కడానికి లేదా ప్రయాణించడానికి కాదని అధికారులు గుర్తు చేశారు.

ముఖ్యంగా వందే భారత్ వంటి అత్యాధునిక రైళ్లలో ప్రయాణికుల భద్రత కోసం ఆటోమేటిక్ తలుపుల వ్యవస్థ ఉంటుందని, రైలు బయలుదేరే సమయంలో అవి వాటంతటవే మూసుకుపోతాయని వివరించారు. అందుకే టిక్కెట్ లేకుండా లోపలికి వెళ్లి, అనుకోకుండా రైలు కదిలితే వారిని అనధికార ప్రయాణికులుగా పరిగణిస్తామని తెలిపారు. అలాంటి వారిపై రైల్వే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటూ పూర్తి ప్రయాణ ఛార్జీతో పాటు భారీ జరిమానా విధిస్తామని అధికారులు గట్టిగా హెచ్చరించారు.

Tags: