కోనసీమలో మళ్లీ గ్యాస్ టెన్షన్
ఓఎన్‌జీసీ బావిలో బ్లోఅవుట్
టీమీడియా , నవంబర్ 17, కోనసీమ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ బ్లోఅవుట్ కలకలం రేపింది. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న తాడివారిమెరక వద్ద ఓఎన్‌జీసీ అధికారులు రీడ్రిల్లింగ్ పనులు చేపట్టారు. ఈ పాయింట్ నుంచే అకస్మాత్తుగా సీఎన్‌జీ గ్యాస్ భారీగా లీకైంది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా గ్యాస్ వాసన వ్యాపించింది.
తెల్లవారుజామున నిద్రలో ఉన్న స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గ్యాస్ వాసన రావడం, భారీ శబ్దం వినిపించడంతో భయాందోళనలకు గురయ్యారు. ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సీఎన్‌జీ గ్యాస్ క్రమంగా నగరం పరిసర ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు కూడా వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోనసీమలో మళ్లీ గ్యాస్ టెన్షన్
గ్యాస్ లీక్ కట్టడికి ఓఎన్‌జీసీ భారీ ఆపరేషన్ కొనసాగిస్తోంది. గ్యాస్ లీక్ అవుతున్న ప్రాంతానికి అర కిలోమీటర్ మేర బ్లోఅవుట్ శబ్దాలు వినిపిస్తున్నాయి. అయితే ఉదయం కంటే గ్యాస్ తీవ్రత కాస్త తగ్గిందని ఓఎన్‌జీసీ అధికారులు తెలిపారు. నాలుగు ఫైరింజన్లతో గ్యాస్ పీడనం తగ్గించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గ్యాస్ కట్టడి ఆపరేషన్‌కు నీటి కొరత లేకుండా చూసేందుకు గన్నవరం కాలువ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గ్యాస్ బావి ముఖద్వారం పటిష్టంగానే ఉందని, భూమికి సమీపంలో గ్యాస్ వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నామని ఓఎన్‌జీసీ సిబ్బంది వెల్లడించారు. ప్రమాద నివారణలో భాగంగా ఘటనా స్థలంలో డీజిల్ జనరేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను నిలిపివేశారు. గ్యాస్ బావి లీకేజీని పూర్తిగా అరికట్టేందుకు సిమెంటింగ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంటోంది. మరో 4–5 గంటల్లో గ్యాస్ లీకేజీని పూర్తిగా అదుపులోకి తీసుకువస్తామని ఓఎన్జీసీ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గ్యాస్ లీక్ తీవ్రత దృష్ట్యా గెద్దాడ నుంచి కొండాలమ్మచింత వరకు జాతీయ రహదారిని పోలీసులు పూర్తిగా మూసివేశారు. ముందుజాగ్రత్తగా వాహనాల రాకపోకలను దారి మళ్లించారు. కొండాలమ్మచింత మీదుగా నగరం గ్రామం నుంచి ప్రత్యామ్నాయంగా ట్రాఫిక్ పునరుద్ధరించారు. గ్యాస్ లీకేజీ కట్టడికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.
స్పందించిన సీఎం గ్యాస్ లీక్ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. స్థానిక అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. గ్యాస్ లీక్ అవుతున్న ప్రాంతం నుంచి ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఓఎన్‌జీసీ అధికారులను తక్షణం సంప్రదించి సమన్వయం చేసుకోవాలన్నారు. ఓఎన్‌జీసీ ఛైర్మన్‌తో స్వయంగా చర్చించి భద్రతా చర్యలపై సమీక్షించాలని సూచించారు. ప్రజల భద్రతకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.
హోంమంత్రి అనిత కూడా జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. అగ్నిమాపకశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. గ్యాస్ లీక్ నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
అలాగే కోనసీమ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సూచించారు. పోలీస్, రెవెన్యూ యంత్రాంగాన్ని వెంటనే అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పరిసర గ్రామాల ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. గ్యాస్ లీకేజీ కట్టడికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.
గ్యాస్ లీక్ ఘటనాస్థలి పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ, 200 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. గ్యాస్ ప్రమాదాలపై ఓఎన్‌జీసీ సిబ్బంది చర్యలు తీసుకోవట్లేదని అన్నారు. అలాగే ఘటనాస్థలిలో కలెక్టర్ మహేశ్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. నాలుగు ఫైరింజన్లతో గ్యాస్ పీడనం తగ్గించేందుకు ఓఎన్‌జీసీ బృందాల యత్నిస్తున్నాయి.
కాగా గత అక్టోబర్ 26వ తేదీన ఇదే జిల్లాలోని అంబాజీపేట మండలంలో గ్యాస్ లీకైన విషయం తెలిసిందే. మాచవరం గ్రామం వరి పొలాల్లో ఓఎన్జీసీ పైపులైన్ నుంచి గ్యాస్ లీకైంది. పొగముంచులా గ్యాస్ పైకి వచ్చి సుమారు 100 మీటర్ల మేర దాని వాసన వ్యాపించింది. గ్యాస్ వాసన రావడంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. పరిసర ప్రాంతాలకు గ్యాస్ వాసన విస్తరించడంతో అధికారులు అప్రమత్తమై లీకేజీని అదుపులోకి తీసుకొచ్చారు.






