bhadrachalam

ల్యాబ్ మారితే రిపోర్ట్ మారుతుంది! ఒకే రక్త నమూనా.. వేర్వేరు ఫలితాలు!

ల్యాబ్ మారితే రిపోర్ట్ మారుతుంది! ఒకే రక్త నమూనా.. వేర్వేరు ఫలితాలు!

By ·

Share this article
ల్యాబ్ మారితే రిపోర్ట్ మారుతుంది! ఒకే రక్త నమూనా.. వేర్వేరు ఫలితాలు!

ల్యాబ్ మారితే రిపోర్ట్ మారుతుంది!

 

 


ఒకే రక్త నమూనా.. వేర్వేరు ఫలితాలు


 - ఖమ్మం లో 2,000 అనుమతులు లేని ల్యాబ్‌లు

 

 


టీ మీడియా,నవంబర్13, ఖమ్మం బ్యూరో :వైద్య పరీక్షల ఫలితాలు రోగికి చికిత్స దిశను నిర్ణయిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు, హిమోగ్లోబిన్, థైరాయిడ్, కాలేయం, మూత్రపిండాల పనితీరు వంటి పరీక్షల ఆధారంగానే వైద్యులు మందులు సూచిస్తారు. అలాంటి కీలకమైన వైద్య పరీక్షల నివేదికల్లోనే తేడాలు వస్తే రోగుల పరిస్థితి ఏమిటి? ఒకే వ్యక్తి ఒకే సమయంలో ఇచ్చిన రక్త నమూనాను వేర్వేరు ప్రయోగశాలల్లో పరీక్షిస్తే ఫలితాలు భిన్నంగా వస్తున్నాయనే ఫిర్యాదులు ఆందోళన కలిగిస్తున్నాయి.ఒక ప్రయోగశాల ఇచ్చిన నివేదికను చూసి వైద్యుడు చికిత్స ప్రారంభిస్తే, మరో ప్రయోగశాల నివేదికలో వేరే ఫలితం కనిపించడం రోగులను గందరగోళానికి గురిచేస్తోంది. ఏ నివేదికను నమ్మాలి? ఏ పరీక్ష సరైనది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వైద్య పరీక్షల పేరుతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అనుమతులు లేకుండానే  నిర్వహణ?
ఖమ్మం జిల్లాలో వైద్య పరీక్షల ప్రయోగశాలల నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో సుమారు 2,000 వరకు అనుమతులు లేని ప్రయోగశాలలు ఉన్నాయన్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ సంఖ్యను అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. వాస్తవంగా జిల్లాలో ఎన్ని ప్రయోగశాలలు పనిచేస్తున్నాయి? వాటిలో ఎన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం నమోదు చేసుకున్నాయి? ఎన్ని నమోదు లేకుండా నిర్వహిస్తున్నారు? అనే వివరాలు ఇప్పటికీ బహిర్గతం కావాల్సి ఉంది.గ్రామాలు, పట్టణాలు, ప్రధాన రహదారుల వెంట వైద్య పరీక్షల కేంద్రాలు వెలుస్తున్నా వాటి నిర్వహణకు అవసరమైన అనుమతులు, సాంకేతిక అర్హతలు, నాణ్యతా ప్రమాణాలను అధికారులు ఎంతవరకు పరిశీలిస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఒకే నమూనా.. రెండు రకాల ఫలితాలు!
రోగి ఒక ప్రయోగశాలలో రక్త పరీక్ష చేయించుకుంటే ఒక ఫలితం, మరో ప్రయోగశాలలో పరీక్ష చేయించుకుంటే మరో ఫలితం వస్తోందనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మధుమేహం, థైరాయిడ్, హిమోగ్లోబిన్, కొలెస్ట్రాల్ వంటి పరీక్షల్లో ఫలితాల తేడాలు రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.. పరీక్షా పద్ధతి, పరికరాల సామర్థ్యం, నమూనా సేకరణ, నిల్వ, పరీక్ష నిర్వహణ సమయం, ప్రమాణాల వ్యత్యాసం వల్ల కొంత తేడా ఉండవచ్చు. కానీ అనుమతులు, నాణ్యతా నియంత్రణ, సాంకేతిక అర్హతలు లేకుండా పరీక్షలు నిర్వహిస్తే మాత్రం రోగులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
అర్హతలేని సిబ్బందితో పరీక్షలా?
ప్రయోగశాల నిర్వహణలో సాంకేతిక నైపుణ్యం ఎంతో కీలకం. రక్త నమూనా సేకరణ నుంచి పరీక్ష నిర్వహణ, ఫలితాల విశ్లేషణ, నివేదిక జారీ వరకు ప్రతి దశలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి.ప్రయోగశాలలో అర్హత కలిగిన సాంకేతిక సిబ్బంది ఉన్నారా?- పరీక్షలు నిర్వహించే పరికరాలకు క్రమం తప్పకుండా నాణ్యతా తనిఖీలు జరుగుతున్నాయా?పరికరాల క్రమాంకనం నిర్వహిస్తున్నారా?- పరీక్షల ఫలితాలను ధ్రువీకరించే బాధ్యత ఎవరిది?
- రోగులకు ఇచ్చే నివేదికల్లో బాధ్యత వహించే నిపుణుల వివరాలు ఉంటున్నాయా?ఈ ప్రశ్నలకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
. తనిఖీలు ఎక్కడ?
వైద్య పరీక్షల కేంద్రాలు, నిర్ధారణ కేంద్రాలు ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ అధికారిక సమాచారం ప్రకారం వైద్య నిర్ధారణ, ప్రయోగశాల సేవలు కూడా నియంత్రణ పరిధిలోకి వస్తాయి. ప్రయోగశాలలకు కనీస సిబ్బంది, సదుపాయాలు, పరికరాలు, నిర్వహణ ప్రమాణాలు నిర్దేశించబడ్డాయి. ఖమ్మం జిల్లాలో 2026 సెప్టెంబర్ 29న నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షలో 16 నిర్ధారణ కేంద్రాలను తనిఖీ చేయగా లోపాలున్న కేంద్రాలకు నోటీసులు ఇచ్చి, సరిదిద్దుకోకపోతే చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించరు.ఇది తనిఖీలు అవసరమనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అయితే 16 కేంద్రాల తనిఖీతో జిల్లాలోని అన్ని ప్రయోగశాలల పరిస్థితి తెలిసిపోదు.                                                                                                                               మందుల ద్వారా ఉపశమనం                                                                                                                                                                                                   మూడు రోజులుగా అధిక జ్వరంతో బాధపడుతున్న ఒక వ్యక్తి కొత్తగూడెంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. రోగ నిర్ధారణ పరీక్షల అనంతరం అతనికి క్రియాటిన్ స్థాయిలు పెరిగాయని తెలిసింది. మూడు రోజులపాటు ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. నాలుగో రోజు అతని క్రియాటిన్ స్థాయిలు గణనీయంగా పెరిగాయని, పరిస్థితి అలానే ఉంటే కిడ్నీలు పనిచేయడం ఆగిపోతాయన్నారు. తాము తదుపరి చికిత్స అందించలేమని, వేరే ఆసుపత్రికి ఖమ్మం వెళ్లమని చెప్పేశారు. ఆందోళనకు గురైన ఆ రోగి, ఖమ్మం వెళ్లకుండా హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అక్కడ అతని పరిస్థితి నిలకడగా మారింది.పాల్వంచకు చెందిన ఒక వ్యక్తి కడుపునొప్పితో బాధపడుతూ స్కానింగ్​ కోసం ఒక ప్రైవేట్ ల్యాబొరేటరీకి వెళ్లారు. అతనికి 14 మి.మీ. కిడ్నీలో రాయి ఉందని, తక్షణ శస్త్రచికిత్స అవసరమని చెప్పారు. బాధితుడు భయంతో కొత్తగూడెంలోని మరో ల్యాబొరేటరీలో రెండో అభిప్రాయం కోసం వెళ్లగా, అక్కడ 5 మిల్లీమీటర్ల రాయి ఉన్నట్లు నిర్ధారణ అయింది. శస్త్రచికిత్స అవసరం లేకుండానే అతను మందుల ద్వారా ఉపశమనం పొందాడు.

 

 


2,000 ల్యాబ్‌ల ఆరోపణలపై విచారణ జరగాలి!
జిల్లాలో సుమారు 2,000 ప్రయోగశాలలు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నాయన్న ఆరోపణలు నిజమైతే అది సాధారణ విషయం కాదు. ప్రజారోగ్యానికి సంబంధించిన తీవ్రమైన అంశం. ఈ సంఖ్యపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తక్షణమే స్పష్టత ఇవ్వాలి. జిల్లాలో మొత్తం ఎన్ని ప్రయోగశాలలు ఉన్నాయి? వాటిలో ఎన్ని తాత్కాలిక నమోదు పొందాయి? ఎన్ని శాశ్వత నమోదు కలిగి ఉన్నాయి? ఎన్ని పునరుద్ధరణ చేయించుకున్నాయి? ఎన్ని అనుమతులు లేకుండానే కొనసాగుతున్నాయి? అనే వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.