ఉచిత కుటుంబ సలహా కేంద్రం & జెండర్ రిసోర్స్ సెంటర్’ ను
ప్రారంభించిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే
టీ మీడియా ,అక్టోబర్ 26 ,నారాయణఖేడ్ : నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఐకేపీ (ఐకేపి) కార్యాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో, కమ్యూనిటీ నిర్వహణలో నూతనంగా ఏర్పాటు చేసిన "ఉచిత కుటుంబ సలహా కేంద్రం మరియు జెండర్ రిసోర్స్ సెంటర్"ను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సోమవారం రోజు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుతున్న కాలంలో చిన్న చిన్న మనస్పర్థలతో కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా, నిపుణులైన కౌన్సెలర్ల ద్వారా ఉచితంగా సలహాలు, సూచనలు అందించడం అభినందనీయమన్నారు.
మహిళల హక్కుల పరిరక్షణ, లింగ సమానత్వం, కుటుంబాల్లో సామరస్యం పెంపొందించడానికి ఈ కేంద్రం ఒక వేదికగా నిలుస్తుందని తెలిపారు. పోలీస్ స్టేషన్లు, కోర్టుల వరకు వెళ్లకుండా గ్రామీణ మహిళలు, దంపతులు స్థానికంగానే పరిష్కారం పొందేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
సమాజంలో మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, పేదరిక నిర్మూలనతో పాటు వారి సామాజిక భద్రతకు పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
