పెళ్లి చేయలేదని ఆగ్రహం..
తల్లి ఇంటికే నిప్పు!
టీమీడియా , నవంబర్ 19, కడప:తనకు వివాహం చేయలేదన్న కోపంతో ఓ కుమారుడు కన్నతల్లి నివాసం ఉంటున్న ఇంటికే నిప్పంటించిన ఘటన కడప జిల్లాలో కలకలం రేపింది. జమ్మలమడుగు మండలం గూడెంచెరువు రాజీవ్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వరలక్ష్మికి ఇద్దరు కుమారులు. కొన్ని నెలల క్రితం చిన్న కుమారుడికి వివాహం జరిగింది. అయితే తనకు ఇంకా పెళ్లి చేయలేదని పెద్ద కుమారుడు సురేంద్ర తల్లితో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో చిన్న కుమారుడు వేరుగా కాపురం పెట్టగా, పెద్ద కుమారుడు కూడా తల్లికి దూరంగా ఉంటున్నాడు.
పెట్రోల్ పోసి నిప్పంటింపు
తనకు పెళ్లి చేయలేదన్న ఆగ్రహంతో తల్లిపై కక్ష పెంచుకున్న సురేంద్ర, ఆమె ఇంటికి నిప్పంటించాలని నిర్ణయించుకున్నాడు. తల్లి ఇంట్లో లేని సమయంలో పెట్రోల్ తీసుకొచ్చి ఇంట్లో చల్లి నిప్పంటించాడు. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
సామగ్రి పూర్తిగా దగ్ధం
మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఇంట్లోని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
చిన్న కారణంతో కన్నతల్లి ఇంటికే నిప్పంటించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.






